Friday, May 10, 2024

మరో మూడురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -
Heavy rains across Telangana for another three days
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన

హైదరాబాద్: రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నట్టు అధికారులు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. కొన్ని చోట్ల మోసర్త వర్షాలు కురవగా మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భానుడు ప్రతాపం చూపించాడు. ఖమ్మం జిల్లా నాగులవంచలో అత్యధికంగా 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయ్యింది. భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను జిహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తం చేశారు. ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, బిఎన్‌రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపుర్‌మెట్, ఉప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, కోఠి, లక్డీకాపూల్ పరిధిలలో భారీ వర్షం కురిసింది. అలాగే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది.

ఉదయం ఉక్కపోత సాయంత్రానికి వాన

గురువారం ఉదయం నుంచి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో పాటు భారీ వర్షం మొదలైంది. వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, మరో మూడు రోజుల పాటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మూడు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

గురువారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం

గురువారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండలో 91.5 మిల్లీమీటర్లు, జగిత్యాలలో 87.3, జయశంకర్ భూపాలపల్లిలో 82.8, సంగారెడ్డిలో 75, జనగాంలో 66.5, రంగారెడ్డిలో 63.5, కరీంనగర్‌లో 62.3, ములుగులో 56, సిద్ధిపేటలో 55.8, మంచిర్యాలలో 54.8, ఖమ్మంలో 49.8, వరంగల్ రూరల్‌లో 44, రాజన్న సిరిసిల్లలో 43, హైదరాబాద్‌లో 40 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News