Friday, April 26, 2024

ముసురుకుంది

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు

 పొంగిపొర్లుతున్న వాగులు, అలుగు దుంకుతున్న చెరువులు
 వరద నీటితో ప్రాజెక్టులకు జలకళ,  పలు జిల్లాల్లో స్తంభించిన రాకపోకలు
 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బస్సుపై విరిగిపడ్డ భారీ వృక్షం
 తడిసి ముద్దయిన హైదరాబాద్

Heavy Rains in Several Areas of Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: భూ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనానికి తోడు, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతోపాటు పలు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరడంతో అవి నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగిపోగా, రోడ్లు కొట్టుకు పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే జూన్, జూలై నెలలో సాధారణం కంటే 18 శాతం అధిక వర్షపాతం నమోదయ్యింది.
ఉత్తరాంధ్ర -ఒడిశా తీరాలకు దగ్గరలో…
ఉత్తరాంధ్ర -ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని బుధవారం వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు నుంచి మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల్లోని గొలుసు కట్టు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. చాలా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద తెలంగాణలోని కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. చెరువుల మరమ్మతుతో వరదనీరు చేరి నిండుకుండలా కనిపిస్తున్నాయి. గ్రామాల్లోని చెరువులకు నీరు వచ్చి చేరుతుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా మారిపోయారు.
ఉప్పొంగుతున్న పాఖాల వాగు
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మాదన్నపేట చెరువు మత్తడిపోస్తుంటే ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మైసమ్మకు మొక్కి కొబ్బరికాయ కొట్టారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పాఖాల వాగు ఉప్పొంగడంతో కాజువే రోడ్డు మునిగిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలోని చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రుద్రంగిలోని గోళ్లపులోద్ది చెరువు పొంగి పోర్లుతోంది.
పలుచోట్ల భారీ వర్షాలు
నగరంలోని ఎల్బీ నగర్, రామాంతపూర్, ఖైరతాబాద్, మాదాపూర్, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, హయత్ నగర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మెదక్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్- పట్టణ, వరంగల్-గ్రామీణం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లా ల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఎపిలోని కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షం
ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం, ఎల్లంపల్లి, కొమురంభీం ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో పెరిగింది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. (మెడిగడ్డ)లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో 3 లక్షల 76 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3లక్షల 99వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 57 గేట్లను అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మెడిగడ్డ బ్యారేజ్‌లో 9.166 టిఎంసిల నీటి నిల్వ ఉంది.
పులిచింతల ప్రాజెక్టు ఔట్ ఫ్లో 100 క్యూసెక్కులు
పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 8.742 టిఎంసిలకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 137.630 అడుగులకు చేరుకుంది. ఇన్ ప్లో 1748 క్యూసెక్కులు కాగా, మొత్తం ఔట్ ఫ్లో 100 క్యూసెక్కులకు చేరుకుంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 563.10 అడుగులకు చేరింది. అలాగే ఇన్‌ఫ్లో 38,140 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 8,422 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 239.6552 టిఎంసిలుగా నమోదయ్యింది.
గోదావరి నదిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి
గోదావరి నదిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఉప నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువన ఉన్న ఇంద్రావతి, తాలిపేరుతోపాటు.. కిన్నెరసాని నుంచి నీటి ప్రవాహం పెరిగింది. భద్రాచలం వద్ద మంగళవారం రాత్రి 25 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం బుధవారం మధ్యాహ్నానికి 29.5 అడుగులకు చేరింది. బుధవారం రాత్రికి గోదావరి నీటిమట్టం 30 అడుగులు దాటింది. గురువారం ఉదయానికి నీటిమట్టం 32 అడుగులకు చేరింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటం, క్యాచ్‌మెంట్ ఏరియాల నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గోదావరి వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. నీటి ప్రవాహం ఇలాగే సాగితే భద్రాచలం వద్ద వరద కొద్ది వ్యవధిలోనే 40 అడుగులకు చేరే ఛాన్స్ ఉంది. తాలిపేరు నుంచి 17,626 క్యూసెక్కులు, కిన్నెరసాని నుంచి 17 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో దాని ప్రభావం పోలవరం వద్ద కూడా కనిపిస్తోంది. పోలవరం వద్ద నీటి మట్టం 10.610 మీటర్లకు చేరగా కాపర్ డ్యాం వద్ద గోదావరి వరద 24.75 మీటర్లుగా ఉంది. వరద పెరగడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 157.5 మి.మీ వర్షపాతం
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం 157.5 మిల్లీమీటర్లు, మహబూబాబాద్ 129.3, వరంగల్ రూరల్ 96.8, ఖమ్మం 88, ములుగు 132.5, పెద్దపల్లి 49.5, జయశంకర్ భూపాలపల్లి 48.3, కరీంనగర్ 47.3, మంచిర్యాల 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

Heavy Rains in Several Areas of Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News