Saturday, April 27, 2024

ప్రమాదంలో హిమాలయ ప్రాంతం

- Advertisement -
- Advertisement -

హిమాలయాల అందచందాల వైభవం ఎందరినో ఆకట్టుకుంటుంది. గత కొన్నేళ్లుగా శిఖరాలపై మంచు తరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశమే అయినా ఇప్పటికీ హిమాలయాలు కవులను, కళాకారులను మధుర స్వప్నాల్లో విహరింపచేస్తుంది. కానీ ఈ రోజు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి హిమాలయ రాష్ట్రాల్లో నదులు వరద నీటితో ముంచుకొచ్చి వంతెనలను, రోడ్లను భవనాలను తుడిచి వేస్తున్నాయి. లోపభూయిష్టమైన అభివృద్ధి పనులతో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. చమోలి వద్ద కొండచరియిలు రోడ్లకు అడ్డంగా విరిగిపడి ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ మునిగిపోయింది. గత జనవరిలో జోషిమఠ్ వద్ద ఎంతటి విధ్వంసం జరిగిందో మనకు తెలిసిందే.

హిమాలయ యాత్రకు వెళ్లే పర్యాటకులకు ప్రారంభ స్థావరంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. వందలాది కుటుంబాలను మరో సురక్షిత ప్రాంతానికి ఆగమేఘాలపై తరలించాల్సివచ్చింది. జోషీమఠ్ బచావో సంఘర్ష్ సమితి కొన్నేళ్ల క్రితమే ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ముందే హెచ్చరించింది. విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టడం అనర్థాలకు దారి తీస్తుందని 1976 లోనే మహేశ్ చంద్ర కమిటీ సూచించింది. జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ చేపట్టిన విద్యుత్ ఫథకం, అత్యంత పొడవైన ఉపమార్గం, 66 సొరంగాలతో కూడిన చార్‌థామ్ రోడ్ ప్రాజెక్టు వీటన్నిటి కారణంగా హిమాలయాలకు ఆనుకుని ఉన్న గ్రామాలకు తీరని ముప్పు ఎదురవుతోందని విశ్లేషణలు చెబుతున్నాయి. చమోలీ, ఉత్తరకాశీ, రుద్రప్రయాగ, పితోరాగడ్, జిల్లాల్లో వేల హెక్టార్లలో చేపట్టిన రోడ్ల నిర్మాణాలు, జలవిద్యుత్ కేంద్రాలు, విద్యుత్ సరఫరా లైన్లు మొదలైన వాటివల్ల పదేళ్ల క్రితమే వరదలు ముంచెత్తి ఆ ప్రాంతాలను నాశనం చేశాయి. ఈ విపత్తు రానురాను కొనసాగుతోంది.

హిమాచల్‌లో చంబావద్ద రోడ్డుకుంగిపోయింది. చార్‌థామ్ రూటులో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.2016లో చార్‌ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన అనే పేరుతో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు చేపట్టారు. 900 కిమీ పొడవున 12 మీటర్ల వెడల్పున రెండు వరసల రోడ్లతో గర్హాల్ రీజియన్ లోనూ, ఉత్తరాఖండ్‌లోని కుమయోన్ అనే సన్నని దారిలో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం లక్షలాది చెట్లు, వేలఎకరాల అటవీ భూములు పూర్తిగా తుడిచివేశారు.సారవంతమైన హిమాలయభూమి కూడా కోల్పోవలసి వచ్చిం ది. అనేక మంది జీవితాలు, వన్యమృగాల ఉనికి దెబ్బతిన్నాయి. టన్నుల కొద్దీ వచ్చిన బురద నీటివనరులను దెబ్బతీసింది. సాధారణంగా చట్ట ప్రకారం 100 కి.మీ.కి మించి చేపట్టిన ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ నుంచి అనుమతి అవసరం. కానీ కాలపరిమితితో కూడిన ఎన్నికల అజెండా ఫలితంగా, పర్యాటక శాఖ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు భూచట్టాలను దాటవేశాయి. ఒక్కోటి 100 కి.మీ. కన్నా తక్కువ ఉండేలా ఈ భారీ ప్రాజెక్టును 53 చిన్న ప్రాజెక్టులుగా విభజించారు.ఆవిధంగా పర్యావరణ ప్రభావ సమీక్ష లేకుండా దాటవేశారు.

చంబా, అగ్రకల్ మలేథా, శివపురి, రుద్రప్రయాగ్, చమోలి, అగస్య్తముని, కర్ణప్రయాగ్, కుంద్ తదితర ఉత్తరాఖండ్‌లోని దట్టమైన అడవీ ప్రాంతాలు, ఇతరపచ్చని ప్రదేశాలు అన్నీ తుడుచుపెట్టుకుపోయాయి. చార్‌ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన ప్రాజెక్టు విపరీత స్వభావం ఫలితంగా ఒకే ఒక సహజమైన పచ్చని గంగా పరీవాహక ప్రాంతం అదే భగీరథి పర్యావరణ సున్నిత ప్రదేశం జోన్ మాత్రం మిగిలింది.గంగానదికి మిగిలి ఉన్న సహజ స్వేచ్ఛా ప్రవాహం భగీరథి పర్యావరణ సున్నిత జోన్ మాత్రమే. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం కింద 2012 డిసెంబర్‌లో ఈ ప్రాంతాన్నిరక్షిత ప్రాంతంగా వెల్లడించారు. ఈ ప్రాంతంలోని దాదాపు 100 కి.మీ వరకు జోనల్ బృహత్ ప్రణాళిక అనుమతి లేకుండా చార్‌ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన ప్రాజెక్టు పరిధి కిందకు తీసుకురాకూడదు.

అయితే చార్‌ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన ప్రాజెక్టుకు వెసులుబాటు కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా లెక్కచేయకుండా ఈ జోనల్ బృహత్ ప్రణాళిక తొందరతొందరగా అనుమతి మంజూరు చేసింది. విధానాలు పాటించడం కానీ, పర్యావరణ ప్రభావ సమీక్ష కానీ చేయలేదు. భగీరథి పర్యావరణ సున్నిత ప్రాంతం పర్యవేక్షణ కమిటీ అనుమతి ప్రకారం కూడా ఎలాంటి చర్చలు, సూచనలు పాటించకుండా రాష్ట్ర అధికార యంత్రాంగం నిర్లక్షం వహించింది. ఫలితంగా వేలాది దేవదారు వృక్షాలు, కిలోమీటర్ల పరిధిలో సహజమైన పర్వత సాణువులు భారీ రోడ్డు వెడల్పుతో పూర్తిగా ధ్వంసమయ్యాయి.భగీరథి పర్యావరణ సున్నితప్రాంతం జోన్‌లో వాహనాల రాకపోకలను నియంత్రించాలని నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఈ పరిధి లోని గంగోత్రి క్షేత్రం మార్గంలో రోజుకు 9000 వాహనాల రాకపోకలకు వీలుగా రవాణా సామర్థాన్ని పెంచేశారు. పర్యావరణ రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలన్న గుడ్డి ఆలోచనతో రవాణా సామర్థాన్ని మితిమీరి పెంచడం మంచిది కాదని పర్యావరణ నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నా నిబంధనలను పక్కన పెట్టేశారు. హిమాలయ ప్రాంతాన్ని మరీ దుర్బలంగా మార్చేశారు. రెండు వరుసల రోడ్ల డిజైన్ ప్రకారం కొండల్లోని రోడ్ల వెడల్పుకు సంబంధించి రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ తన నోటిఫికేషన్‌కు తానే విరుద్ధం కావడం గమనార్హం.

‘పర్వత సాణువులు, ఏటవాలు ప్రాంతాల్లో జాతీయ రహదార్లు, రోడ్ల నిర్మాణం విషయంలో ఏదెలాగైనా ఈ ప్రమాణాలు పాటించడంలో సవాళ్లు తెరపైకి వచ్చాయని రోడ్ల రవాణా శాఖ పేర్కొంది. కొండవాలు ప్రాంతాల అస్థిరత, రోడ్డు నిర్మాణాల అనుసంధానంలో ప్రగతిశీల హానికరమైన ప్రభావాలు కనిపించడంతో ఈ సవాళ్లు ఎదురయ్యాయని పేర్కొంది. వాహనాల రాకపోకల రద్దీకి సంబంధించి ప్రధాన రహదారి వెడల్పు అంతర్గత రహదార్ల ఆకృతులకు అనుగుణంగా ఉండాలని రెండు వరుస రోడ్ల నిర్మాణాలు (23 అడుగులు )తో కలిపి 5.5 మీటర్ల (18 అడుగులు) వెడల్పు ఉండాలని సిఫార్సు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు సివిల్ అప్పీలు 10930/2018 ద్వారా ఈ విరుద్ధమైన నిర్మాణాన్ని తనకు తాను విచారణకు స్వీకరించింది. తన నోటిఫికేషన్‌కు తానే విరుద్ధంగా వ్యవహరించడంపై ప్రభుత్వాన్ని మందలించింది.అయినా చివరకు తాను కోరుకున్నట్టు ప్రభుత్వం చేసుకోవచ్చని 2021లో అనుమతించింది.

అయితే దీని సమీక్షలో అనేక జవాబులేని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఏడు మీటర్ల వెడల్పులో మొట్టమొదట స్థానంలో రెండు వరుసల రోడ్ల నిర్మాణాన్ని రక్షణ మంత్రిత్వశాఖ ఎందుకు ఆశిస్తోంది? అవసరమైన రెండు వరుస లైన్ల రోడ్డు వెడల్పు ప్రమాణాల్లో ఎందుకు మార్చవలసి వచ్చింది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రుతుపవనాలకు ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని చార్‌ధామ్ మార్గాల్లో వాహనాల రాకపోకల రద్దీ సామర్థాన్ని పెంచేసింది. సాధారణంగా పరిమితికి మించి రవాణా రద్దీ పెరిగినా, జనాభా పెరిగినా, హిమాలయ పర్వతప్రాంతాల్లో సహజ ప్రకృతి వనరులు నాశనం అవుతాయి. పచ్చిక బయళ్లు ఆక్రమణల పాలవుతాయి. ఈ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని హిమాలయ రాష్ట్రాల్లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు కనీస సౌకర్యాలు కల్పించడం క్లిష్టమైన సమస్య. ఈ సౌకర్యాలకు, స్థిరంగాలేని భౌగోళిక పరిస్థితులకు మధ్య తులనాత్మకత పాటించడం పెద్ద సవాలు. హిమాలయ రాష్ట్రాల్లో శాస్త్రీయ విశ్లేషణ అనుసరించడం తప్పనిసరి అయినా, ఆ మేరకు అనుసరించకపోవడం విధ్వంసానికి దారి తీస్తోంది.

దీనిపై సుప్రీంకోర్టు ఆ రాష్ట్రంలో ఎన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఇతర నిర్మాణాలు ఎన్ని చేపట్టారో, అంచనా వేయడానికి కమిటీని నియమించింది. దీనిపై జలవిద్యుత్ ప్రాజెక్టుల సంఖ్యను తగ్గించాలని కమిటీ సూచించింది. అలాగే కొండలను దొలిచివేసి అమాంతంగా రోడ్లను వెడల్పు చేయడాన్ని ఆపాలని సూచించింది. ఈ విధంగా చేయడం భౌగోళికంగా హిమాలయ రాష్ట్రాలకు అనువు కాదని హెచ్చరించింది. ఇటీవల కేంద్రం చేసిన ప్రతిపాదనలు కూడా కొత్తవేం కావు. 2020 లోనే వాహనాల రాకపోకలు, జనం రద్దీ, నిర్మాణాల విషయంలో సరైన అంచనా వేయాలని 13 హిమాలయ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. పర్వత శిఖరాల్లో ఉన్న పట్టణాలు, నగరాల్లో, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో ప్రభావాలను అంచనా వేయాలని సూచించింది.

ఈ మేరకు అధ్యయన నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖ గత మేనెలలో మళ్లీ గుర్తు చేసింది. పర్వత ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, క్షీణించడం, జోషిమఠ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో విపరీత పరిణామాలు ఏర్పడడం చర్చనీయాంశం అయింది. సౌకర్యాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య నెలకొన్న సంక్లిష్టతపై గత జనవరిలో చర్చకు దారితీసింది. కానీ ఈ లోగానే హిమాచల్ ప్రదేశ్‌లో జలప్రళయం ముంచుకు వచ్చింది. ఏమాత్రం అనువుకాని పర్వతాలపై నిర్మించిన రోడ్లు, జాతీయ రహదార్లు, తుడిచిపెట్టుకుపోయాయి.

పి.వెంకటేశం
9985725591

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News