Monday, April 29, 2024

జ్వర తెలంగాణ

- Advertisement -
- Advertisement -

విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్
ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు
బస్తీదవాఖానాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐదు రెట్లు ఓపీ
వాతావరణ మార్పులతో పెరుగుతున్న బాధితులు
మనతెలంగాణ/హైదరాబాద్: వాతావరణంలో మార్పుల కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. జర్వం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, వాంతులు, విరేచనాలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిరిసిపోతోంది. ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వైరల్ ఫీవర్ బాధితులుంటున్నారు. వర్షాకాలం.. కొన్ని రోజులుగా వాతావరణం ముసురుగా ఉండటంతో విషజ్వరాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పది రోజులుగా పలు రకాల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లోనే రోజుకు 600 నుంచి 700 వరకు ఓపీ ఉంటోంది. సాధారణ రోజుల్లో ఇక్కడ 300 నుంచి 400 మంది మాత్రమే వస్తుంటారు. సీజన్‌మార్పుల కారణంగా ఈ సంఖ్య సుమారు ఐదు రెట్లు పెరిగింది. ఇక ఇన్ పేషెంట్‌గా చేరుతున్న వారి సంఖ్య రోజుకు 30 నుంచి 40 వరకు ఉంటోంది. వీరిలో ఎక్కువగా హెపటైటిస్, డెంగ్యూ, విషజర్వాల బాధితులు ఉంటున్నారు. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లో మాత్రమే కాదు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్‌లో కూడా వైరల్ ఫీవర్స్ బాధితుల సంఖ్య పెరిగింది. ప్రతి హాస్పిటల్ రోజు ఉండే సాధారణ ఓపీ కన్నా 500 వందల మంది వరకు ఎక్కువ ఒపి ఉంటోంది. పెరిగిన ఓపీ మొత్తం కూడా వైరల్ ఫీవర్స్ బాధితులేనని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనూ జ్వర బాధితులే
ప్రభుత్వ బోధనాసుపత్రులు మాత్రమే కాదు పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలతో పాటు ప్రైవేట్ క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్..ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌తోపాటు జ్వర బాధితుల ఇంటి సమీపంలోని క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అన్ని ఆసుపత్రులు, పిహెచ్‌సిలు, క్లినిక్స్‌లలో ఓపీలు కిటికిటలాడుతున్నాయి.
బస్తీదవాఖానాలలో పెద్దాసుపత్రులకు తగ్గిన ఓపీ
గ్రేటర్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాలలో ప్రజలకు తమ ఇంటి సమీపంలోనే వైద్యం లభిస్తోంది. దాంతో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రికి ఓపీ గతంలో కంటే కొంతమేర తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 256 బస్తీదవాఖానాలు ఉన్నాయి. వీటితో బాధితులకు వైద్యం అందించడంతో పాటు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా వైరల్ ఫీవర్ 3 నుంచి వారం రోజుల పాటు ఉంటుంది. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని వైద్యులు సూచించిన విధంగా మందులు వాడితే వారంలోపే వైరల్ ఫీవర్ తగ్గిపోతుంది. బస్తీదవాఖానాల్లో రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, మందులు ఇస్తుండటంతో చాలావరకు పెద్దాసుపత్రులకు వెళ్లే అవసరం తగ్గిపోతుంది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో గతంలో కంటే ఓపీ సంఖ్య తగ్గింది.
వ్యాధుల నివారణకు పకడ్భంధీ చర్యలు
వర్షాల కారణంగా వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ఉండేందుకు, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీహెచ్‌సీ స్థాయి నుంచి పెద్దాసుపత్రుల వరకు అన్ని స్థాయిలలో మందులు అందుబాటులో ఉంచి అన్ని స్థాయిలలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. వైద్య సేవలు, తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులకు తగిన సూచనలు ఇవ్వడం, జిల్లాలలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. నివారణ చర్యలు చేపడుతూనే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మలేరియా కంటే క్రమంగా డెంగీ కేసులే అధిక సంఖ్యలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెంగ్యూ సోకిన వారిలో 85 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో జ్వర లక్షణాలు కనిపిస్తుండగా, మరికొందరిలో తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం, వాంతులు, విరేచనాలు,ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోతే కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి : డాక్టర్ శంకర్, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్
వాతావరణ మార్పులతో వైరల్ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పాటు కలుషిత నీటి ద్వారా వచ్చే వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని అన్నారు. వర్షాల కారణంగా వాతావరణం చల్లగా మారిన నేపథ్యంలో ఫ్లూ వ్యాధులు వస్తాయని, ఈ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని, దాంతో రోగుల సంఖ్య పెరుగుతుందని వివరించారు.దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, ,ముక్కుకారడం,ఎక్కువగా దాహం వేయడం, రుచి, వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు ఉన్న వాళ్లకు 3 నుంచి 4 రోజులపాటు మందులు వాడినా తగ్గకపోతే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని, చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు ఉన్న వాళ్లు కనీసం మూడు రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని తెలిపారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రధానంగా వృద్దులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బిపి, షుగర్, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వైద్యుల సూచన మేరకు సకాలంలో మందులు వాడుతూ అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దోమలు ప్రబల కుండా తగిన జాగ్త్రలు తీసుకుంటూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

Hospitals full with Viral Fever patients in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News