Tuesday, April 30, 2024

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు కార్యాలయాల వేదికగా హైద్రాబాద్

- Advertisement -
- Advertisement -
  • రూ.3 లక్షల కోట్ల పెట్టుబడితో 20 వేలకు పైగా పరిశ్రమల స్థాపన
  • కేటిఆర్ కృషితో నేడు ఐటి రంగంలో మరింత పురోగతి
  • టిఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ అనుమతులు
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి వేలకు పైగా కంపెనీలను స్థాపించి పరోక్షంగా, ప్రత్యక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఘనత కెసిఆర్‌కు సాధ్యమైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ ప్యాబ్‌సిటీలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దినోత్సవంలో జడ్పి చైర్‌పర్సన్ తీగల అనితాహరినాథ్, కలెక్టర్ హరీష్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు.

పారిశ్రామిక ప్రగతిలో భాగంగా పలు కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమల ఏర్పాటుకు అనేక ఇబ్బందులు వచ్చేవని ముఖ్యంగా పవర్ హాలిడే కారణంగా అనేక పరిశ్రమలు మూతబడ్డాయని స్వారాష్ట్రంలో అలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు కార్యాచరణతో వసతులు కల్పిస్తున్నామన్నారు. ఔత్సాహికులకు టిఎస్ ఐపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేస్తుకున్న వారిలో అర్హత కల్గిన వారికి అనుమతులు అందజేసి అధికారుల చుట్టూ కాలయాపన చేసే పనిలేకుండా చేశారన్నారు.

నిర్దిష్ట గడువులోపు అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవడం, అనుమతుల విషయంలో కాలయాపన చేసిన అధికారులపై అపరాధ రుసుము విధిస్తూ అనుమతులు వచ్చేలా చుస్తున్నారన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం, వసతి, నీటి, విద్యుత్ సరఫరా, శాంతి భద్రతలతో పాటు పలు అవసరమైన వ్యవస్థలను మెరుగుపర్చడంతో తొమ్మిదేళ్ల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 20 వేల కంపెనీలు స్థాపించారన్నారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాప్ట్ వంటి దిగ్గజ కంపెనీలలో 24 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు.

తెలంగాణ ప్రగతే ధ్యేయంగా యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే అభిమతంతో ఉద్యోగ కల్పనకు అస్కారం కలిగిన కంపెనీలను ప్రభుత్వం తన సరళీకృత విధానాల ద్వారా ఆకర్షించి పారిశ్రామిక ప్రగతిలో తలసరి ఆదాయం తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలవడం హర్షించదగ్గ విషయమన్నారు. దేశంలో జిడిపి తిరోగమనం బాటపట్టగా, తెలంగాణ జిడిపి4 శాతం వృద్ధ్ది సాధించింది. నిటి నిల్వలలో 10 శాతం పరిశ్రమలకు అందించడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం ద్వారా పరిశ్రమల పెరుగుదల మరింత వృద్ధి సాధించిందన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ టిఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని, ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు అందజేస్తున్నామన్నారు.

కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ ప్లాంట్ ఏర్పాటు కొరకు భూమి పూజ చేయడం జరిగిందని ఫాక్స్‌కాన్ ఉత్పత్తులు ప్రారంభించడం దేశంలో అతి పెద్ద పెట్టుబడుల్లో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిక్‌జైన్, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News