Monday, April 29, 2024

మన ఊరు మన బడితో విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం

- Advertisement -
- Advertisement -
  • విద్యాభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసిఆర్ ఎనలేని కృషి
  • రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పెద్ద కొడప్‌గల్: మన ఊరుమన బడి ద్వారా విద్యార్థుల భవిష్యత్తు బంగారు మయం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్‌గల్ మండల కేంద్రంలో మన ఊరు మన బడి నిధులతో నూతనంగా నిర్మించిన పాఠశాల సముదాయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కోట్ల రూపాయలతో సీఎం కేసిఆర్ అన్ని రంగాలలో అభివృద్దిలో దూసుకుపోతున్నారన్నారు. పెద్ద కొడప్‌గల్‌లోని పాఠశాల స్వాతంత్య్రం కంటే ముందు నుంచి 1946 నుంచి కొనసాగుతూ జూనియర్ కళాశాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుందంటే ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన పాఠశాల గొప్పతనం ఎంతో ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఆణిముత్యాల్లాగా తీర్చిదిద్దుతారని, కేజీ టు పీజీ విద్య కొరకు సీఎం కేసిఆర్ కృషిచేస్తున్నారన్నారు.

ఒకేసారి ఏది సాధ్యం కాదని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విద్యా యజ్ఞం కొనసాగిస్తున్నారన్నారు. సీఎం కేసిఆర్ బాలిక విద్య పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలన్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో రాగి జావను సైతం అందజేస్తున్నారన్నారు. పలు పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తున్నారని, విద్యాభివృద్దికి ప్రత్యేక శ్రద్ద దృష్టి సారిస్తున్నారన్నారు.

కాసేపు స్పీచ్‌ను ఆపిన మంత్రి

పెద్ద కొడప్‌గల్‌లో స్పీచ్ ఇస్తుండగా, మధ్యలో నమాజ్ సౌండ్ రావడంతో కాసేపు స్పీచ్‌ను మధ్యలోనే ఆపి వేశారు. అందరి సాంప్రదాయాలను గౌరవించాలన్నారు. సీఎం కేసిఆర్ సహకారంతో స్కూళ్లను బాగు చేసుకున్నామని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలలో స్థిరపడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీపీ ప్రతాప్ రెడ్డిలు పలు విషయాలను సభా ముఖంగా తమ దృష్టికి తీసుకుని వచ్చారని, సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి వచ్చే అకాడమీక్ ఈయర్‌కు అవి పూర్తయ్యేలా చూస్తామన్నారు. అలాగే 6 అదనపు గదులతో పాటు పాఠశాల గ్రౌండ్ బాగుకు వెంటనే కృషిచేయాలని సంబంధిత శాఖాధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, కమీషనర్ దేవసేన, అడిషనల్ కలెక్టర్ మధు చౌదరి, జడ్పీ చైర్‌పర్సన్ దఫెదార్ శోభ రాజు, శ్రీధర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, డీఈవో రాజు, ఎంఈవో దేవిసింగ్, ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ చంద్రభాగ, సర్పంచ్ తిర్మల్ రెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు, ఆయా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News