Monday, April 29, 2024

సురక్షితం భాగ్యనగరం

- Advertisement -
- Advertisement -

దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో మూడవ స్థానం 2021 జాతీయ క్రైమ్
రికార్డ్ బ్యూరో నివేదికలో వెల్లడి
పోలీసుశాఖకు మంత్రి కెటిఆర్ ప్రశంస

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో అత్యంత సురక్షిత మూడు మెట్రో నగరాల్లో హైదరాబాద్ నగరం మూడవస్థానంలో నిలిచింది. కేంద్ర నేర రికార్డుల విశ్లేషణా సంస్థ (ఎన్‌సిఆర్‌బి) ప్రకటించిన దేశంలోని అత్యంత సురక్షిత నగరాల్లో కోల్‌కత్తా ప్రధమ స్థానంలోనూ, పుణె ద్వితీయ స్థానంలో ఉండగా హైదరాబాద్ మహానగరం తృతీ య స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సి.ఎం. కెసిఆర్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో రెండు మిలియన్ జనాభా ఉన్న నగరాల్లో విచారణకు అర్హమైన నేరాల (కాగ్నిజబుల్ అఫెన్స్) నమోదును ఎన్‌సిఆర్‌బి విశ్లేషించడంతో పాటు నివేదికను ఇటీవలే విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, ప్రతి మిలియన్ జనాభాకు హైదరాబాద్ నగరంలో కేవలం 2599 నేరాలు మాత్రమే జరుగుతున్నాయి. ఇదే భారత రాజధాని ఢిల్లీలో ప్రతి మిలియన్ జనాభాకు 18 ,596 నేరాలతో దేశంలోనే క్రైమ్ పరంగా అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 1034 నేరాల నమోదుతో కోల్‌కత్తా అత్యంత తక్కువ నేరాలు జరిగే మెట్రో నగరంగా అగ్రస్థానంలో నిలవగా, 2568 నేరాలతో పూణే మెట్రో ద్వితీయ స్థానంలో నిలిచింది.

ప్రతి మిలియన్ జనాభాకు కేవలం 2,599 నేరాలు మాత్రమే నమోదవుతూ తృతీయ స్థానంలో ఉన్న ఐటి నగరమైన హైదరాబాద్ సురక్షిత నగరంగా గుర్తింపు పొందింది. ఇక, అత్యంత అధిక నేరాలతో ఢిల్లీ నగరం అగ్రస్థానంలో ఉండగా, సూరత్, కొచ్చిన్, అహ్మదాబాద్, చెన్నై నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దక్షణాది మెట్రో నగరాల్లో అతితక్కువ నేరాలు జరిగే నగరంగా హైదరాబాద్ నగరం నిలువగా, ఐటి నగరంగా ఖ్యాతిగాంచిన బెంగళూర్‌లో ప్రతీ మిలియన్ జనాభాకు 4272 నేరాలు నమోదవుతూ సురక్షిత నగరాల్లో ఐదవ స్థానాన్ని పొందింది. ఒక లక్ష జనాభాకు తీసుకుంటే, కోల్‌కత్తాలో 104 .4 నేరాలు నమోదు కాగా, 256 .8, పూణేలో, 259 .9 హైదరాబాద్‌లో నేరాలు నమోదయ్యాయి. అలాగే 427 .2 బెంగుళూరులో, 428 .4 ముంబాయిలో నమోదయ్యాయి.

హత్యల విషయంలో కోల్‌కత్తాలో 45 , హైదరాబాద్‌లో 98 , బెంగళూర్‌లో 152 , ఢిల్లీలో 454 , ముంబాయిలో 162 జరిగాయి. హత్యాయత్నం కేసుల్లో కోల్‌కత్తా 135 , హైదరాబాద్‌లో 192 , బెంగళూర్ లో 371 , ఢిల్లీలో 752 , ముంబాయిలో 349 గా నమోదయ్యాయి. అత్యాచారం కేసుల్లో కోల్‌కత్తా 11 , హైదరాబాద్‌లో 116 , బెంగుళూరులో 117 , ఢిల్లీలో 1226 ,ముంబయిలో 364 నమోదయ్యాయి. మహిళలపై దాడులను విషయంలో 127 కోల్‌కత్తా , 177 హైదరాబాద్ , 357 బెంగుళూర్, 1023 ఢిల్లీలో జరిగాయి. డెకాయిటీ కేసులను పరిశీలిస్తే కోల్‌కత్తాలో 3 , హైదరాబాద్ 11 , బెంగుళూరు 36 , ఢిల్లీ 25 , ముంబాయి 16 నమోదయ్యాయి. దొంగతనాల అంశానికొస్తే కోల్‌కత్తాలో 1246 , హైదరాబాద్ 2419 , బెంగుళూరు 6066 , ఢిల్లీ1980 , ముంబాయిలో 7820 గా నమోదయ్యాయి.

మంత్రి కెటిఆర్ ప్రశంస

దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దిన రాష్ట్ర పోలీసు శాఖను మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అవిశ్రాంత కృషి చేస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా సురక్షిత నగరాలలో హైదరాబాద్‌కు తృతీయ స్థానంలో నిలిచిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి కెటిఆర్ డిజిపి మహేందర్‌రెడ్డి,హోంశాఖా మంత్రి, పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు

మొదటి స్థానంలో నిలిపే యత్నం 

దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్న తెలంగాణ పోలీసు శాఖ
అధికారిక ట్వీట్‌లో పేర్కొంది. గడచిన కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు పోలీసుల పనితీరును మెరుగుపర్చాయని ఆ ట్విట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి సికెం కెసిఆర్ పోలీసుశాఖను పునరుత్తేజం చేసే విధంగా నిధులు కేటాయించిందని తెలిపారు. ఆధునిక పద్దతుల ద్వారా నేరాలను అదుపు చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తునే ఉందన్నారు. పోలీసు శాఖకు నిధుల కేటాయింపు విషయంలోను వెనుకడుగు వేయకుండా సిఎం కెసిఆర్ అండగా నిలవడంతో పాటు పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారన్నారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్న క్రమంలో నగరంలో నేరాలు అదుపులోకి రావడంతో పాటు నేరగాళ్ల సంఖ్య తగ్గుతోందన్నారు. నేరాలు చేస్తే ఎక్కడ పట్టుబడిపోతామనే భయంతో క్రిమినల్స్ నేరాలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారని, క్లిష్టమైన కేసులను సైతం పోలీసులు అనతికాలంలో చేధిస్తున్నారని వివరించారు.

వెల్లువలా పెట్టుబడులు 

హైదరాబాద్‌లో శాంతి భద్రతల విషయంలో అన్ని రకాల చర్యలు చేపడుతున్న క్రమంలో ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని పోలీసు అధికారులు వివరిస్తున్నారు. దేశం నలుమూల నుంచి వచ్చిన ప్రజలు హైదరాబాద్‌లో నిశ్చింతగా నివసిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో హత్యలు, అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసులను త్వరితగతిన ఛేదిస్తున్నామన్నారు. ఇటీవల కమాండ్ కంట్రోల్ టవర్స్‌ను ఏర్పాటు చేశామని, నగరవ్యాప్తంగా నిఘా పెట్టేందుకు ప్రంపచస్థాయి టెక్నాలజీతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలోని మూడు కమిషనరేట్‌ల పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ క్రైం రేటును తగ్గించేందుకు నిరంతరం గస్తీ కాస్తున్నారని, ముఖ్యంగా మత కలహాలు, ఉగ్ర చర్యలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుంతూ విశ్వనగరంగా ఎదిగేందుకు అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. దీంతో ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని పోలీసు శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News