Friday, April 26, 2024

నారాయణపేట్ జిల్లా కళాకారులకు గుర్తింపు కార్డులు

- Advertisement -
- Advertisement -

Identity cards for Narayanpet district artists

విశేష ప్రతిభ కళాకారులకు అక్కడికక్కడే కార్డులు అందించిన టీటా ప్రెసిడెంట్
తమ కృషికి గుర్తింపు దక్కింది: సంతోషం వ్యక్తం చేసిన కళాకారులు
సందీప్ మక్తాలకు కళాకారుల కృతజ్ఞతలు

హైదరాబాద్: కళాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందజేసే ప్రక్రియలో మరో కీలక ముందడుగు వేసింది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) భాగస్వామ్యంతో అందజేసే గుర్తింపు కార్డుల ప్రక్రియలో భాగంగా నారాయణపేట్ జిల్లాకు చెందిన కళాకారులకు మొదటగా గుర్తింపు కార్డులు దక్కాయి. ఈ కార్డులతో కళాకారులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందనున్నాయి. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలకు కళాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం సాధించిన తర్వాత కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సిద్ధమైంది. కార్డుల జారీ ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉండేందుకు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తయేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ భాగస్వామ్యంతో టి కల్చర్ యాప్ రూపొందించి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

మీసేవా నుంచి దరఖాస్తు చేసుకొని కార్డు పొందేలా…

గ్రామీణ ప్రాంత కళాకారులు సైతం ఈ యాప్ (bit.ly/tsculture) ద్వారా లేదా మీసేవా నుంచి దరఖాస్తు చేసుకొని కార్డు పొందేలా రూపకల్పన చేశారు. ఐడి కార్డుకు దరఖాస్తు చేసుకున్న తరువాత 30 రోజుల్లో ఆన్‌లైన్‌లో కార్డు వస్తుంది. దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ కళాకారులకు ఈ అవకాశం దక్కుతోంది. గత సంవత్సరం రాష్ట్ర యువజన సర్వీసులు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ‘టి కల్చర్’ యాప్‌ను ఆవిష్కరించారు.

పలు మండలాల్లో పర్యటన

ఈ కార్డును క్షేత్రస్థాయిలోని కళాకారులకు చేరువ చేయడంలో భాగంగా టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల నారాయణపేట్ జిల్లాలోని మాగనూరు, కృష్ణ, నర్వ మండలాల్లో పర్యటించి కళాకారులకు అక్కడికక్కడే గుర్తింపు కార్డులు అందజేశారు. స్థానికంగా పర్యటించిన సందీప్ మక్తాల చిరుత భజన, భజన బృందాల కళాకారులతో సమావేశమయ్యారు. అవార్డు గ్రహీత, మిర్రర్ రైటింగ్ కళాకారుడు బసవరాజు వాకిటి సందీప్ మక్తాల పేరును పలు భాషల్లో, రివర్స్‌లో రాశారు. మరో కళాకారుడు చిదానంద అవసాలి అప్పటికప్పుడు సందీప్ మక్తాల చిత్రాన్ని పెయింట్ వేసి బహుకరించారు. ఇలా వివిధ రంగాలకు చెందిన కళాకారులు వారి ప్రదర్శలు చేయగా వెంటనే వారికి కార్డులను మక్తాల అందించారు.

రానున్న రోజుల్లో 32 జిల్లాలో

ఈ సందర్భంగా సందీప్ మక్తాల మాట్లాడుతూ నారాయణ పేట జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన అనేకమంది కళాకారులకు ఈ కార్డులు పొందడంపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వారికి ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ గుర్తింపు కార్డులు దోహదపడుతున్నందున కళాకారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కళాకారులకు టెక్నాలజీ ఆధారంగా త్వరితగతిన కార్డులు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. తమకు కార్డులు అందించిన టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలకు కళాకారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అవగాహన కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం మొదటగా నారాయణపేట్ జిల్లాను ఎంపిక చేసినట్లు సందీప్ తెలిపారు. తదుపరి మిగతా 32 జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News