Monday, April 29, 2024

తేనెటీగలతోనే మానవ మనుగడ

- Advertisement -
- Advertisement -

తేనెటీగలకు మానవ మనుగడకు సంబంధం ఏమిటి అని ఆశ్చర్యంగా ఉందా! అవును తేనెటీగలకు మానవ మనుగడకు అవినాభావ సంబంధం ఉంది. అవిశ్రాంతంగా పని చేసే తేనెటీగలు ప్రజలకు, మొక్కలకు, పర్యావరణానికి చేసే ప్రయోజనాన్ని వెల కట్టలేము. అందుకే ఎన్నో శతాబ్దాలుగా భూగ్రహం మీద శ్రమైక జీవనానికి ప్రతీకలుగా నిలుస్తున్న తేనెటీగల గురించి ఉటంకిస్తూ భూమి ఉపరితలం నుండి తేనెటీగలు అదృశ్యమైతే మానవులు నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు అని అన్నారు ప్రఖ్యాత ఆంగ్ల కవి ఆల్బర్ట్ ఐన్ స్టీన్. పుప్పొడిని ఒకపువ్వు నుండి మరొక పువ్వుకు చేరవేయడం ద్వారా తేనెటీగలు, ఇతర పరాగ సంపర్క జీవులు సమృద్ధిగా పండ్లు, కాయలు, గింజల నాణ్యతకు, ఉత్పత్తికి దోహదం చేయడమేకాక జీవవైవిధ్యాన్ని కాపాడటంలో కూడా కీలక భూమిక వహిస్తాయి.
తేనెతీగల చరిత్ర
తేనెటీగలు అపిడే (Apidae) కుటుంబానికి చెందిన ఎగిరే కీటకాలు. తేనెటీగలు భూమ్మీద 34 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి మనుగడలో ఉన్నాయని భావిస్తారు. తేనెని దాదాపు 8 వేల యేళ్ళ క్రితం వాలెంసియా, స్పెయిన్‌లోని ఆరానా గుహల్లో కనుగొన్నారని అంటారు. ఆ తర్వాత ఈజిప్ట్‌లో తూటంఖమూన్ రాజు సమాధి లోపల 3 వేల యేళ్ళ క్రితం పెట్టిన కుండలు కనుగొన్నారు. ఆయన స్వర్గ లోకంలో ప్రయాణానికి అవి అవసరమని వారు భావించారు. దానికి ముందే 5500 యేళ్ళ క్రితం జార్జియాలో తవ్వకాల్లో తేనె పాత్రల ఆచూకీ లభ్యమైంది. అందుకే ఎన్నేళ్లయినా చెక్కుచెదరని, పాడవని ఆహారంగా పరిగణించబడుతుంది తేనె.
పర్యావరణ పరిరక్షణలో..
పర్యావరణ పరిరక్షణకు అద్వితీయంగా తోడ్పాటునందించే తేనెటీగల కోసమే ప్రత్యేకంగా మే 20వ తేదీ ప్రపంచ వ్యాప్తం గా తేనెటీగల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరపు ప్రపంచ తేనె దినోత్సవ వేడుకలు మే 20న మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ప్రారంభం కానున్నాయి. నిజానికి తేనెటీగలు ఒక రకమైన తుమ్మెదలు. తేనెటీగలు ఆర్థికపరంగా మానవులకు సహాయపడుతున్న ఉత్పాదక కీటకాలు. వ్యవసాయపరంగా ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. మన ఆహార భద్రత, పోషణ, మన పర్యావరణ పరిరక్షణలో తేనెటీగలు, పరాగ సంపర్కాల పాత్ర చాలా ముఖ్యమైనది. వివిధ రకాల పువ్వుల నుండి పుప్పొడిని సేకరించి ఇతర పువ్వులపై వాలడం ద్వారా ఇవి పరపరాగ సంపర్కానికి ఎంతో దోహదపడతాయి. ఈ ప్రక్రియ ద్వారా పండ్లు, కూరగాయలు, నూనె గింజలు వంటి తదితర ఉత్పత్తుల నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 115 ప్రముఖ ఆహార పంటలలో 87 పరాగ సంపర్కం చర్య ద్వారా ఉత్పత్తికాగా, మొత్తం పంట ఉత్పత్తిలో పరాగ సంపర్కాలు 35 శాతం ఉత్పత్తికి కారణమవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా మానవులకు ఆహారంగా ఉపయోగపడే వివిధ రకాల తిండి గింజలు, పండ్ల పంటల సాగులో దాదాపు 75% పంటలు పరాగ సంపర్కాలపై ఆధారపడతాయంటే ఒకింత ఆశ్చర్యం కలుగక మానదు. తేనెటీగలు జీవవైవిధ్యాన్ని కాపాడటంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. తేనెటీగలు పూల నుండి మకరందాన్ని సేకరించి తేనెపట్టులో ఉంచి తేనెగా మారుస్తాయి. ఇవి సంతానోత్పత్తి కోసం తేనెపట్టును ఏర్పరచుకొంటాయి. అయితే ఇటీవలి సర్వేల ప్రకారం కేవలం గత రెండు సంవత్సరాలలో 90 శాతం తేనెటీగలు అంతరించిపోయాయని తెలియడం అత్యంత ఆందోళన కలిగించే పరిణామం. విచక్షణారహితంగా అడవుల నరికివేత, తేనె తెట్టెలు పెట్టడానికి అనువైన వృక్షాలు లేకపోవడం, వివిధ పుష్పజాతులు అంతరించిపోవడం, అనియంత్రిత కలుపు, క్రిమిసంహారక మందుల వినియోగం తేనెటీగలు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి. ఆర్ధికపరంగా చూస్తే పంటల పరాగ సంపర్కాలుగా తేనెటీగల ఆచరణాత్మక విలువ అవి ఉత్పత్తి చేసే తేనె, మైనం విలువ కంటే చాలా ఎక్కువ.
తేనె శరీరానికి ఎంతో మేలు చేస్తుందని మనలో చాలా మందికి తెలుసినప్పటికీ తేనె తయారీ కోసం తేనెటీగల జీవిత కాల కృషి ఇందులో ఇమిడి ఉందని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. తేనెటీగలు ఒక చెంచా తేనెను తయారు చేయడానికి అనేక వేల కిలోమీటర్లు ఎగరవలసి ఉంటుంది. మొత్తం జీవిత కాలంలో ఒక తేనెటీగ ఒక చెంచా తేనెను కూడా తయారు చేయలేదు. ప్రతి తేనెటీగ తన జీవిత కాలంలో ఒక టీస్పూన్‌లో కేవలం పన్నెండవ వంతు వరకు మాత్రమే తేనెను తయారు చేస్తుంది. అంటే 12 తేనెటీగలు జీవితాంతం కష్టపడితే ఒక చెంచా తేనె తయారవుతుంది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే కేవలం ఆడ తేనెటీగలు మాత్రమే తేనెను తయారు చేస్తాయి. మగ తేనెటీగలు ఏ పని చేయక ఆడ తేనెటీగలు ఎక్కువగా ఉన్న చోట ఉంటాయి. తేనెటీగ సగటు జీవిత కాలం 45 రోజులు మాత్రమే. ఒక కిలో తేనెను తయారు చేయడానికి అందులో నివసించే తేనెటీగలు దాదాపు 40 లక్షల పువ్వుల రసాన్ని పీల్చుకుని 90,000 మైళ్లు ప్రయాణించవలసి ఉంటుంది. పుప్పొడిని మోసుకెళ్లడానికి అనుగుణంగా ఆడతేనెటీగలు ప్రత్యేక శరీర నిర్మాణ నిర్మాణాలను కలిగి ఉంటాయి. సాధారణంగా స్వల్పకాలం జీవించే మగ తేనెటీగలు సంతాన సంరక్షణ, పుప్పొడి సేకరణ లాంటి ఎటువంటి బాధ్యతలను నిర్వహించవు.
తేనెటీగల సహనివేశం సాధారణంగా ఒక రాతికిగాని, భవనం పైకప్పు, గోడకు మధ్య అనుసంధానంగా ఉండే బీమ్‌కు గాని లేదా చెట్టు శాఖలకు గాని తేనెపట్టును నిర్మిస్తాయి. ఒక్కొక్క సహనివేశంలో దాదాపు 50,000 తేనెటీగలు ఉంటాయి. ఒక్కొక్క తేనెపట్టులో మైనంతో చేసిన రెండు రకాల షడ్భుజాకారపు కక్ష్యలు అనేకం ఉంటాయి. మొదటి రకం షడ్భుజాకారపు కక్ష్యలో తేనెను, పుప్పొడి రేణువులను నిల్వచేయడానికి రెండవ రకం షడ్భుజాకారపు కక్ష్యలో పిండ సంరక్షణకు ఉపయోగపడతాయి. ఇవి కాక రాణీ ఈగ కోసం పెద్ద కక్ష్య ఒకటి ఉంటుంది. పిండ రక్షణ కక్ష్యలో అండాలుంటాయి. పుప్పొడి రేణువులే పిండదశలో ఆహారం. పిండ దశ నుండి కొత్త ప్రౌఢ ఈగలొస్తాయి. ఒక తేనెటీగల సహనివేశంలో మూడు రకాలు అనగా రాణి ఈగలు, డ్రోన్‌లు, కూలి ఈగలుంటాయి. ఒక్కొక్క తేనెపట్టులో ఒక రాణి ఈగ (Queen Bee) ఉంటుంది. ఒకవేళ, పొరపాటున రెండు రాణి ఈగలు ఉంటే, ఒకటి మరో దానిని చంపేస్తుంది. రాణి ఈగలు ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తిచేస్తాయి. అది కూలి ఈగలు (Worker Bees) సంతానోత్పత్తిపరమైన అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. దినమంతా గదులను పర్యవేక్షించే రాణి ఈగ రోజుకు 2000 వరకు గుడ్లను పెడుతుంది. వాటి నుండి 1-2 రోజుల తరువాత డింభకాలు (Larvae) బయటికి వస్తాయి. కూలి ఈగలు డింభకాలకు తేనె, పుప్పొడి, రాయల్ జెల్లీ (Royal Jelly)ని అందిస్తాయి. రాయల్ జెల్లీని ఎక్కువగా త్రాగిన డింభకాలు, రాణి ఈగలుగా మారుతాయి. 5వ రోజుకు డింభకాలు తమ చుట్టూ, ఒక గట్టి పొరను నిర్మించుకుంటాయి. కూలి ఈగలు గదిని మైనంతో మూసివేస్తాయి. మూడు వారాలలో పూర్తిగా ఎదిగిన తేనెటీగలు గదిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాయి.
తేనె ఎంతో రుచికరమైన, పోషక విలువలు గల ఆహారపదార్థం. సాంప్రదాయకంగా తేనె కంటి వ్యాధులు, శ్వాసనాళ ఉబ్బసం, గొంతు ఇన్ఫెక్షన్లు, క్షయ, దాహం, ఎక్కిళ్ళు, అలసట, మైకం, హెపటైటిస్, మలబద్దకం, పురుగుల ముట్టడి, పైల్స్, తామర, పూత, గాయాలను నయం చేయడంతో పాటు బలవర్ధక పోషకాహారంగా కూడా ఉపయోగించబడుతుంది. తేనెటీగ విషాన్ని కీళ్ళ నొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు. తేనెటీగల నుండి సేకరించే ప్రొపోలిస్ (Propolis) ద్రావకాన్ని హోమియోపతి మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇదే కాకుండా ఆయుర్వేదంలో ఎన్నో మందులను తేనేతో కలిపి ఇవ్వటం వల్ల ఆ మందు త్వరగా జీర్ణం అయి త్వరగా పని చేస్తుందని భావిస్తారు. భస్మాలను అంటే పొడులను తేనేలో రంగరించి తింటారు. విటమిన్ బి, సి, ఇంకా పొటాషియం వంటివి ఇందులో ఉంటాయి.
కుటీర పరిశ్రమగా తేనెటీగల పెంపకం
అదనపు ఆదాయం కోసెం కేవలం కొద్దిపాటి వనరులు స్వల్ప పెట్టుబడితో రైతులు వ్యవసాయాధారిత పరిశ్రమ అయిన తేనెటీగల పెంపకాన్ని (Beekeeping or Apiculture) చేపట్టవచ్చు. తేనెటీగల పెంపకానికి, మైనం తయారీకి భూసారంతో పని లేదు. ఇందుకు బంజరు భూములైనా సరిపోతుంది. పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపే తేనెటీగలు పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవ లాంటి పంటలతో పాటు పూలు పూచే మొక్కలలో పరపరాగ సంపర్కానికి సహాయకారిగా నిలవడం తో పాటు వివిధ రకాల పండ్ల జాతులలో అధిక దిగుబడికి దోహదం చేస్తాయి. తేనె, మైనానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. తేనెటీగల పెంపకాన్ని ఎవరికి వారు వ్యక్తిగతంగా కానీ లేదా బృందంగా కానీ ఏర్పడి చేపట్టవచ్చు.
రైతుల జీవితాలను మార్చేందుకు సహాయపడే మధు క్రాంతి లేదా తీపి/ తేనె విప్లవం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివాసీలు, రైతులు, నిరుద్యోగ యువత, మహిళలకు తేనెటీగల పెంపకం ద్వారా ఉపాధిని సృష్టించడంతో పాటు భారతదేశ తేనె ఉత్పత్తిని కూడా పెంచడం ఈ విప్లవం ముఖ్యోద్దేశం. దీని ద్వారా ప్రాథమిక తేనెటీగల పెంపకం,తేనె వెలికితీత పద్ధతులను బోధించడమే కాకుండా, ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, పుణెలోని ఉన్న సెంట్రల్ బీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా రైతులను ఎంపిక చేసి వారికి అధునాతన శిక్షణను అందిస్తుంది. ఈ శిక్షణలో భాగంగా తేనెటీగల నుండి పుప్పొడి, రాయల్ జెల్లీ, విషాన్ని వేరు చేయడం, మెరుగైన వృక్షజాలం కోసం వారు తమ తేనెటీగలతో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడం లాంటి విషయాలలో మెళకువలు నేర్చుకుంటారు.తేనెటీగలు పువ్వుల నుండి తేనెను పీల్చినప్పుడు వాటి కాళ్ళపై సేకరించే పుప్పొడి, క్రిటర్లు స్రవించే రాయల్ జెల్లీలో పుష్కలంగా ఉండే ప్రోటీన్లను తరచుగా పోషక పదార్ధాలలో ఉపయోగిస్తారు. తేనెటీ గల నుండి సేకరించిన పుప్పొడికి మార్కెట్లో కిలోకు దాదాపు రూ.1200, రాయల్ జెల్లీకి రూ.25 నుండి రూ.30 వేల వరకు ధర పలుకుతుంది.
తేనెటీగల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు
వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖా పరిధిలోని నేషనల్ బీ బోర్డ్ (ఎన్‌బిబి) ఈ పథకాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ బీ బోర్డ్ (ఎన్‌బిబి) ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 2020 నుంచి 2023 వరకు 3 ఏళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. దేశంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తేనెటీగల పెంపకానికి సంబంధించిన్ ఇతర పథకాలైన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ మిషన్, హనీ మిషన్, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు, ఎంఎస్‌ఎంఇ, ఆయుష్ తదితర వాటితో కలిసి ఈ స్కీం పని చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News