Friday, April 26, 2024

మద్దతు పెంచండి

- Advertisement -
- Advertisement -

crop support prices

 

వరి, పత్తి, కందులకు ఎంఎస్‌పి పెంచాలంటూ కేంద్రానికి రాష్ట్రం లేఖ

సాగు వ్యయం ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించాలి, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
ఎకరా వరి ఉత్పత్తి వ్యయం రూ.35వేలు క్వింటాల్ పత్తికి రూ.10వేలు

హైదరాబాద్ : తెలంగాణ రైతుల సాగు ఖర్చులకు అనుగుణంగా కనీస మద్దతు ధరలు పెంచాలని భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్(సిఎసిపి)ను రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ కోరింది. వ్యయానికి తగ్గట్టు వాటిని పెంచాలంది. ఖరీఫ్ పంటలకు.. రైతులు పెట్టే ఖర్చుల వివరాలు నివేదిస్తూ వాటికి ఇవ్వాల్సిన మద్దతు ధరలను కమిషన్‌కు సిఫారసు చేసింది. పంటల వారీగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంటకోత, రవాణా, కూలీ, రైతు కుటుంబ శ్రమకు ఫ్రతిఫలం తదితరాలన్నీ మదింపు చేసి ఈ నివేదికను సమర్పించింది. క్వింటా సాధారణ వరి పండించాలంటే రైతుకు అయ్యే ఖర్చు రూ. 2529గా నిర్ధారించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఇవ్వాలని సిఎసిపికి ప్రతిపాదించింది. ఆ సూత్రం ప్రకారం 202021 ఖరీఫ్ వరికి క్వింటాకు రూ.3794 ఇవ్వాలని కోరింది. పత్తి, కందులు, మొక్కజొన్న, సోయాబీన్, జొన్నలు, సజ్జలు వంటి పంటలకు కూడా అయ్యే ఖర్చు, వాటికి ఇవ్వాల్సిన ఎంఎస్‌పిని సూచించింది.

క్వింటా పత్తి పండించాలంటే రూ.10వేలు
రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే పత్తి పంట క్వింటా పండించేందుకు రూ.10,043 ఖర్చు అవుతుందని వ్యవసాయ శాఖ లెక్క గట్టింది. ఈ లెక్కన క్వింటా పత్తికి రూ.15,064 ఎంఎస్‌పి ఇవ్వాలని కోరింది. అలాగే మొక్కజొన్నకు క్వింటా పండించేందుకు రూ.2172 ఖర్చు అవుతుందని నిర్ధారించారు. ఎంఎస్‌పి రూ.3258 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. వేరుశనగ క్వింటా పండించేందుకు రూ.5282 ఖర్చు అవుతుండగా, క్వింటాకు ఎంఎస్‌పి రూ.7924 ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది. అలాగే క్వింటా కందులు పండించేందుకు రూ.8084 వ్యయం అవుతుండగా మద్ధతు ధర రూ.12,126 కల్పించాలంది. క్వింటా సోయాబీన్ ఉత్పత్తికి రూ.4694 అవుతుండగా, మద్ధతు రూ.7041కు పెంచాలని నివేదించింది.

ఎకరా వరి ఖర్చు రూ.35 వేల పైనే
సాగు సహా ఇతర ఖర్చులు పరిగణనలోకి తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని అధికారులు అంటున్నారు. అన్ని పంటల సాగు, ఇతరత్రా ఖర్చులను శాస్త్రీయంగా లెక్కవేసినట్లు వారు చెబుతున్నారు. ఉదాహరణకు సాధారణ వరి రకం నారుమడి సిద్ధం చేయడం, ఎరువులు, విత్తనాలు, పంట కోత వరకు కుటుంబ సభ్యుల కూలీలు కలుపుకుని ఎకరానికి రూ.35 వేల పైనే అవుతున్నట్లు పేర్కొన్నారు. తన భూమినే రైతు ఒక వేళ కౌలుకు తీసుకున్నట్లుగా లెక్క వేసుకున్నట్లయితే అందుకు చేసే ఖర్చు, పెట్టుబడుల మీద వడ్డీ, ఇంటి మనుషులంతా చేసే శ్రమ ఖర్చు, యాజమాన్యం కింద అయ్యే ఖర్చుతో కలిపితే ఇంకా పెరుగుతుందని పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పంట ఖర్చు, మద్దతు ధరలు (ఎం.ఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం) క్వింటాకు రూపాయాల్లో

పంట           సాగు వ్యయం            ఇవ్వాల్సిన మద్దతు ధర                        ప్రస్తుత ఎంఎస్‌పి

వరి              2529                     3794                                        1815
మొక్కజొన్న    2172                      3258                                        1760
కందులు        8084                     12,126                                      5800
పత్తి             10,043                   15,064                                     5550
సోయాబీన్      4694                     7041                                         3710
వేరుశనగ       5282                      7924                                         5090
జొన్నలు        3713                      5569                                         2570
సజ్జలు          3477                      5215                                         3150

Increase crop support prices
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News