Saturday, May 4, 2024

చికెన్ తిందామా !

- Advertisement -
- Advertisement -

Increased demand for chicken Due to coronavirus

వారానికి మూడుసార్లు తినేందుకు మొగ్గుచూపుతున్న జనాలు
నాటుకోళ్లకు విపరీతంగా పెరిగిన డిమాండ్.. కిలోకు రూ.500 ఆపైనే
కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకే

హైదరాబాద్: ఏ కరోనాతో నాలుగు నెలల కిందట చికెన్ తినేందుకు జనాలు భయపడ్డారో.. ఇప్పుడు అదే చికెన్ తినేందుకు ఎగబడుతున్నారు. చికెన్‌తో కరోనా రాదని, పైగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతుండటంతో పట్టణాల్లో అయితే వారానికి మూడు రోజులు చికెన్ తింటున్నారు. ఇక పల్లెల్లో కూడా చికెన్ వినియోగం పెరిగింది. పైగా ఆషాడ మాసం బోనాలు, మొక్కులు చెల్లించుకోవడం కూడా కలిసి రావడంతో కోళ్ల విక్రయాలు పెరిగినట్లు చికెన్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా నాటుకోడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కిలో నాటు కోడి ధర రూ.500 ఆపై మాటే. కరోనా వచ్చిన వారు ఎక్కువగా నాటుకోడి తింటున్నారని తెలియడంతో.. ముందస్తుగానే జనాలు నాటుకోడి తినేందుకు పరుగులు తీస్తున్నారు. దీంతో ధరలు అమాంతం పెరిగాయి.

అన్ని చికెన్ సెంటర్లలోనూ బ్రాయిలర్, లేయర్ కోళ్లతో పాటు నాటు కోళ్లను కూడా విక్రయిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ ప్రాంతాలలో నాటుకోళ్లు ఎక్కువగా అందుబాటులో ఉండటం లేదు. గ్రామాల్లోనే ఎక్కువగా తింటుండంతో వాటి సరఫరా తగ్గిపోయిందని చికెన్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామాల్లో కిలో నాటుకోడి ధర రూ.350 వరకు పలుకుతోంది. గతంలో ఈ ధర రూ.250 వరకు ఉంది. ఇందుకు కారణం లేకపోలేదు. సహజ వాతావరణంలో పెరిగే నాటుకోడి రుచికి రుచి, బలం, ఆరోగ్యం వస్తుందని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగాయి.

ఊర్లలో కూడా వినియోగం పెరగడంతో పట్టణాలకు సరఫరా తగ్గి కొరత ఏర్పడింది. అయితే తమకు మాత్రం ఇంకా గిట్టుబాటు కావడం లేదని బ్రాయిలర్ పౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు. కరోనాతో వచ్చిన నష్టం అంతా ఇంత కాదని, ఇప్పుడు కూడా పెద్దగా ఏమి మిగలడం లేదని వాపోతున్నారు. కిలో బ్రాయిలర్ ధర తమ నుంచి రూ.90 వరకే ఉంటుందని చెబుతున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి నెలలో కోళ్లతో కరోనా వస్తుందనే అసత్య ప్రచారంతో పౌల్ట్రీ కుదైలైంది. పౌల్ట్రీ ఫాంల నుంచి ఉచితంగానే కోళ్లను కూడా పంపిణీ చేసిన విషయం విధితమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News