Friday, May 3, 2024

నేడు మొహాలీలో తొలి టి20

- Advertisement -
- Advertisement -

IND vs AUS 1st T20 Match Today at Mohali

ప్రపంచకప్‌కు రిహార్సల్
భారత్‌కు కీలకం, ఆస్ట్రేలియాకు సవాల్
నేడు మొహాలీలో తొలి టి20
మొహాలీ: టి20 ప్రపంచకప్‌కు ముందు సొంత గడ్డపై భారత్ కీలక సిరీస్ ఆడనుంది. వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు తుది జట్టును తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్న టీమిండియాకు సిరీస్ చాలా కీలకంగా మారింది. జట్టు లోపాలను సరిదిద్దకుని రానున్న వరల్డ్‌కప్‌కు సమరోత్సాహంతో సిద్ధం అయ్యేందుకు సిరీస్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా భారత్‌తో జరిగే సిరీస్‌ను సవాల్‌గా తీసుకుంది. ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా సొంత గడ్డపై జరిగే వరల్డ్‌కప్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని తహతహలాడుతోంది. ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మంగళవారం మొహాలీ వేదికగా తొలి టి20 జరుగనుంది. ఆస్ట్రేలియాకు అరోన్ ఫించ్, భారత్‌కు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నారు. ఈ సిరీస్‌ను ఇరు జట్లు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జట్టు లోపాలను సరిదిద్దుకునేందుకు సిరీస్‌ను ఉపయోగించుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్లుగా పేరున్న భారత్‌ఆస్ట్రేలియాల మధ్య జరిగే సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయం.
రాహుల్‌కు పరీక్ష
ఇక ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ భారత ఓపెనర్ కెఎల్ రాహుల్‌కు చాలా కీలకమని చెప్పాలి. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో రాహుల్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో అతను ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతను మెరుగైన ఆరంభాన్ని అందించాల్సి ఉంది. రాహుల్, రోహిత్‌లు తమదైన శైలీలో చెలరేగితే టీమిండియా బ్యాటిగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇక కెప్టెన్ రోహిత్ కూడా భారీ ఇన్నింగ్స్‌లపై కన్నేశాడు. మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలన పట్టుదలతో ఉన్నాడు.
అందరి కళ్లు విరాట్‌పైనే
మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఆసియాకప్‌లో పరుగుల వరద పారించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి ఈ సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే ఆస్ట్రేలియా బౌలర్లకు ఇబ్బందులు ఖాయం. ఇక వికెట్ కీపింగ్ స్థానం కోసం రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తుది జట్టులో ఎవరికీ స్థానం దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యలు కూడా జట్టుకు కీలకంగా మారారు. అక్షర్ పటేల్, అశ్విన్‌ల మధ్య కూడా తుది జట్టులో స్థానం కోసం పోటీ నెలకొంది. ఇక బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేలతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
తక్కువ అంచనా వేయలేం
ఇక ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా కంగారూలకు ఉందనే విషయాన్ని మరువ కూడదు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆస్ట్రేలియా జయకేతనం ఎగుర వేసింది. భారత్‌పై కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉంది. సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఫామ్‌లోకి రావడం ఆస్ట్రేలియాకు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. కెప్టెన్ ఫించ్, మాథ్యూ వేడ్, మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, అస్టన్ అగర్, కామెరూన్ గ్రీన్, జంపా, హాజిల్‌వుడ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఆస్ట్రేలియాలో ఉన్నారు. దీంతో సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.

IND vs AUS 1st T20 Match Today at Mohali

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News