Sunday, April 28, 2024

రెండు జట్లకు సరిపడే క్రికెటర్లు ఉన్నారు

- Advertisement -
- Advertisement -

IND vs ENG 1st T20 Match on March 12

అహ్మదాబాద్: ప్రపంచ క్రికెట్‌లోనే భారత జట్టుకు ఉన్నంత పటిష్టమైన రిజర్వ్‌బెంచ్ మరే జట్టుకు లేదనడంలో అతిశయోక్తి లేదని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో రెండు ఫార్మాట్‌లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసే వెసులుబాటు భారత్‌కు ఉందన్నాడు. ప్రతిభావంతులైన క్రికెటర్లు అందుబాటులో ఉండడంతో ప్రపంచంలోనే టీమిండియా అత్యంత బలమైన జట్టుగా ఎదిగిందన్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర జట్ల ఆటగాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా భారత్‌కు అలాంటి సమస్య లేకుండా పోయిందన్నాడు. సీనియర్లు అందుబాటులో లేకున్నా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టెస్టుల్లో పూర్తిగా కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగడం దీనికి నిదర్శనంగా రవిశాస్త్రి పేర్కొన్నాడు. సీనియర్లు లేకున్నా వారి స్థానాన్ని భర్తీ చేసే ఎంతో మంది యువ క్రికెటర్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారన్నాడు. ఇది భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేసే అంశంగా అభివర్ణించాడు. రానున్న ఇంగ్లండ్ సిరీస్, ఆసియా కప్‌లకు వేర్వేరు జట్లను పంపడం భారత్‌కు కష్టమేమీ కాదన్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా తదితర జట్లు రెండు ఫార్మాట్‌లకు పూర్తి భిన్నమైన జట్లను ఎంపిక చేస్తున్న విషయాన్ని రవిశాస్త్రి గుర్తు చేశాడు.

భారత్‌కు కూడా ఇలా రెండు జట్లను ఎంపిక చేసే వెసులుబాటు ఉందన్నాడు. అవసరమైతే టెస్టులకు, వన్డేలకు, టి20లకు కూడా వేర్వేరు జట్లను ఎంపిక చేయడం భారత్‌కు పెద్ద సమస్యేమీ కాదన్నాడు. ఐపిఎల్‌తో పాటు పటిష్టమైన దేశవాళి క్రికెట్ టోర్నమెంట్‌ల వల్ల భారత్‌లో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారన్నాడు. ఇక బయో బుడగల్లో ఉండటం కష్టమే అయినప్పటికీ దాని వల్ల భారత క్రికెట్‌కు మేలే జరిగిందన్నాడు. ఆరు నెలల క్రితం ఊహించలేని విధంగా ఎంతో మంది యువ క్రికెటర్లకు అవకాశాలు లభించాయన్నాడు. మైదానంలోకి రెండు జట్లను పంపే సత్తా భారత జట్టుకు ఉందన్నాడు. కాగా, ఆరు నెలల క్రితం ఇంతమంది క్రికెటర్లు అందుబాటులో ఉంటారని ఎవరూ ఊహించలేదన్నాడు. కరోనా నిబంధనల నేపథ్యంలో విదేశీ పర్యటనలకు భారీ జట్టుతో వెళ్లడం భారత్‌కు కలిసి వచ్చిందన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు జంబో జట్టును పంపడం కూడా టీమిండియాకు కలిసి వచ్చిందన్నాడు. ఈ సిరీస్‌లో గాయాలతో చాలా మంది క్రికెటర్లు జట్టుకు దూరమైనా యువ ఆటగాళ్లకు జట్టులోకి వచ్చే అవకాశం లభించిందన్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న యువ ఆటగాళ్లు జట్టుకు కీలకంగా మారారని రవిశాస్త్రి ఆనందం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌ను పురస్కరించుకుని రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జట్టుకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు.

IND vs ENG 1st T20 Match on March 12

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News