Monday, April 29, 2024

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • అదనపు కలెక్టర్ కె. సీతారామారావు

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: జిల్లా ప్రజలందరిలో దేశభక్తి భావాలు రేకెత్తించేలా ఆగష్టు 15 వేడుకలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వివిధ శాఖల జిల్లా అధికారులను నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. సీతారామారావు ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై సంబంధిత జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నియమించే ముఖ్య అతిథి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశాన్ని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కనువిందు చేసే రీతిలో నిర్వహించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.

దేశభక్తి ఉట్టిపడేలా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిఈఓను ఆదేశించారు. శకటాలను ఓవరాల్‌గా జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిభింబించేలా వ్యవసాయం, డిఆర్‌డిఏ, వైద్యం, అటవి, ఐసిడిఎస్, ఎస్సి కార్పొరేషన్, హార్టికల్చర్ తదితర అన్ని సంక్షేమ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాట్లు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరిని ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు.

అన్ని సంక్షేమ, ప్రభుత్వ శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధిపై ముఖ్య అతిథి సందేశ బుక్‌లెట్‌లను సిద్ధం చేయాలని, 9వ తేది సాయంత్రంలోగా అందజేయాలని సిపిఓను ఆదేశించారు. ముఖ్య అతిథులుగా, జిల్లా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్డిఓకు సూచించారు. అత్యంత ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల జారీకి ఈ నెల 9వ తేది లోగా జాబితా పంపాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రశంసా పత్రాలకు ఒక్కో శాఖ నుండి ఒక్కరి పేరునే ప్రతిపాదించాలని సూచించారు.

మైక్, సౌండ్ ఏర్పాట్లను పర్యవేక్షించాలని డిపిఆర్‌ఓను ఆదేశించారు. సివిల్ సప్లై శాఖ నుంచి అతిథులు, విద్యార్థులు, హాజరైన అందరికి స్నాక్స్, వాటర్ బాటిల్స్ అందజేయాలన్నారు. ఈ సమీక్షలో కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, ఏఆర్ డిఎస్‌డి నరసింహ చారి, నాగర్‌కర్నూల్ ఆర్డిఓ వెంకట్ రెడ్డి, సి సెక్షన్ తహసిల్దార్ జాకీర్ అలీ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News