Monday, April 29, 2024

టీమిండియా ముందు భారీ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ను విజయం అందీ అందనట్లుగా ఊరిస్తోంది. విజయం సాధించాలంటే 407 పరుగులు భారీ లక్షాన్ని ఛేదించాల్సి ఉండగా, ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే వేళకు 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. చివరి రోజు ఆటలో భారత్ విజయం సాధించాలంటే 309 పరుగులు చేయాలి. అయితే టీమిండియా అంతటి భారీ లక్షాన్ని ఛేదించి విజయం సాధించడం ద్వారా సిడ్నీ మైదానంలో రికార్డు సృష్టిస్తుందా లేక మ్యాచ్‌ని సమర్పించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. గెలుపు సాధ్యం కాకపోయినా మ్యాచ్‌ని డ్రా చేసుకునేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాట్స్‌మెన్ ఎంత వరకు క్రీజ్‌లో నిలుస్తారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంది. మరో వైపు రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు గాయాల పాలయి పూర్తి స్థాయిలో బ్యాట్ చేసే స్థితిలో లేరు. పంత్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ జడేజా అవసరమైతే చేతివేలు ఫ్యాక్చర్ నొప్పి తెలియకుండా ఉండేందుకు ఇంజక్షన్ తీసుకొనైనా బ్యాట్ చేస్తాడని బిసిసిఐ తెలియజేసింది.
రోహిత్ హాఫ్ సెంచరీ…
కాగా టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభాన్నే అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించిన తర్వాత 31 పరుగులు చేసిన గిల్ ఔటయ్యాడు. ఆపై పుజారాతో జత కలిసిన రోహిత్ శర్మ తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.98 బంతుల్లో ఒక సిక్స్,5 ఫోర్లతో 52 పరుగులు చేసిన రోహిత్ కమిన్స్ వేసిన షార్ట్‌పిచ్ బంతిని భారీ షాట్ ఆడబోయి స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రహానే, పుజారాతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అంతకు ముందు ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 312 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతతో కలుపుకొని 407 పరుగుల భారీ లక్షాన్ని టీమిండియా ముందుంచింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో లబుషేన్ (73), స్టీవ్ స్మిత్(81), కామెరూన్ గ్రీన్ (84)లు రాణించడంతో పాటు కెప్టెన్ టిమ్‌పైన్ (39 పరుగులు నాటౌట్) రాణించడంతో భారీ స్కోరు సాధించింది.

India 92/2 at Stumps on Day 4 in Sydney Test

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News