Saturday, May 18, 2024

నేడు, రేపు ముంబైలో ‘ఇండియా’ భేటీ

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రతిపక్షాల ఐక్యకూటమి ఇండియా రెండు రోజుల కీలక సదస్సు గురు, శుక్రవారాలలో ముంబైలో జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికల దశలో బిజెపికి ఉమ్మడిగా ప్రత్యామ్నాయ పోటీ వేదికగా మారేందుకు కూటమి ఏర్పడింది. ప్రత్యేకించి సంయుక్త ప్రచార వ్యూహం ఖరారు, సీట్ల సర్దుబాట్లు, ఉమ్మడి చిహ్నం వంటివి కీలక విషయాలుగా చర్చనీయాంశాలుగా ఉంటాయని వెల్లడైంది. సీట్ల సర్దుబాటు ఇండియా కూటమి పురోగతికి, ఉనికికి కీలక పరీక్ష అవుతుందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ముందుగా ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు జరుగుతుంది. దీనికి కన్వీనర్ ఎంపిక విషయంలో స్పష్టత రాలేదు. ముందుగా కమిటీని ఎంచుకుని అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగే విషయంలో నిర్థిష్టతను సాధిస్తాయని వెల్లడైంది. ఎన్‌డిఎను ఎదిరించేందుకు ముందుగా తమ మధ్య సమన్వయం , లుకలుకల సర్దుబాట్లు కీలకమని పార్టీల నేతలు భావిస్తున్నారు.

కూటమికి కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి) అవసరం . దీని ద్వారా దేశవ్యాప్తంగా పలు విషయాలపై బిజెపికి వ్యతిరేకంగా ఉద్యమించడం, ప్రజలకు ఇండియా కూటమి గురించి మరింతగా పరిచయం చేయడం ప్రధాన విషయాలుగా ఎంచుకున్నారు. లోగో ఖరారు చేసుకోవడం, సీట్ల సర్దుబాట్లకు ప్రాధాన్యత ఇస్తారని వెల్లడైంది. సిఎంపి ఖరారుకు కొన్ని ప్యానెల్స్ ఏర్పాటు అవుతాయి. దేశంలో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ తిరోగమన విధానాలను ప్రతిఘటించడమే తమ లక్షం అవుతుందని ఆర్జేడికి చెందిన మనోజ్ ఝా తెలిపారు. ఇండియా కూటమిలో అంతర్గత సమన్వయానికి ఓ సెక్రెటెరియట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రధాన కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేస్తారు. కన్వీనర్ పోస్టు ఎవరికి దక్కుతుందనేది ముందస్తు ప్రశ్న అయింది. బీహార్ సిఎం నితీశ్ కుమార్ పేరు ఈ క్రమంలో ప్రధానంగా వినబడుతోంది. కాగా సోనియా గాంధీ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఈ ఇరువురూ పలు దశల్లో కన్వీనర్ బాధ్యత పట్ల వేర్వేరుగా విముఖత చూపారు.

దీనితో ప్రధానమైన కన్వీనర్ పోస్టు ఎవరికి దక్కుతుందనేది కీలక ప్రశ్నఅయింది. కాగా రెండు రోజుల భేటీకి హాజరయ్యేందుకు ఇప్పటికే కొందరు నేతలు బుదవారం సాయంత్రానికే ముంబై చేరారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు , బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఇప్పటికే ముంబైలో ఉన్నారు. మొత్తం 26 పార్టీలు ఈ ఇండియా కూటమికి హాజరు కానున్నాయి. కాగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రెండు రోజుల సదస్సు దశలోనే కూటమిలోకి చేరేందుకు వీలుందని వెల్లడైంది. ప్రతిపక్ష ఐక్యవేదిక భేటీ జరగడం ఇది మూడోది అవుతుంది. తొలి భేటీ పాట్నాలో జరిగింది. తరువాతి భేటీ బెంగళూరులో జరిగింది. ఇక్కడనే ఇండియా కూటమి ఏర్పాటు అయింది. తరువాత పలు దఫాలు వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు ముంబైలో మూడో భేటీకి సిద్ధం అయింది.

ఉద్ధవ్ థాక్రే శివసేన ఇండియా కూటమి భేటీకి ముంబైలో ఆతిధ్యం ఇస్తోంది. ఈ సమావేశాలు వకోలాలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతాయి. సదస్సుకు ఐదుగురు సిఎంలు, 26 వేర్వేరు పార్టీలకు చెందిన దాదాపు 80 మంది వరకూ హాజరు కానున్నారు. వీరికోసం ఇప్పటికే 150 గదులను బుక్ చేశారు. సమావేశానికి ఖర్గే, రాహుల్, మమత బెనర్జీ, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా, మెహబూబ్ ముఫ్తీ, అఖిలేష్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
ఇండియా కూటమే సరైన మరోదిక్కు ః పవార్
దేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమి సరైన రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి అవుతుందని ఎన్‌సిపి సీనియర్ నేత శరద్ పవార్ తెలిపారు. ఇప్పుడున్కన రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చే దిశలో ఇండియా పటిష్టమైన వేదిక అవుతుందని స్పష్టం చేశారు. గురువారం , శుక్రవారం ( ఆగస్టు 31, సెప్టెంబర్ 1) తేదీలు (రేపు, ఎల్లుండి) ముంబైలో ఇండియా కూటమి రెండు రోజుల సదస్సు జరుగుతుంది.ఈ నేపథ్యంలో పవార్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 28 రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 63 మంది ప్రతినిధులు ఈ భేటీకి హాజరవుతున్నారని పవార్ వివరించారు. ఇండియాలో ఇప్పటివరకైతే సీట్ల సర్దుబాట్లపై ఎటువంటి చర్చ జరుగలేదని పవార్ తెలిపారు. ఇండియా భేటీకి కొన్ని ప్రతిపక్ష పార్టీలు రావడం లేదనే విషయాన్ని ప్రస్తావించారు. బిఎస్‌పి అధినేత్రి మాయావతి గురించి ప్రస్తావనకు రాగా, ఆమె ఎటువైపు ఉన్నారనేది తెలియదని, అయితే ఇంతకు ముందు ఆమె బిజెపితో చర్చలు జరిపినట్లు తెలిసిందన్నారు.

ప్రధాని అభ్యర్థిపై పలు చాయిస్‌లు ః ఉద్ధవ్
ప్రతిపక్ష కూటమి ఇండియాలో అంతా పద్ధతి ప్రకారం జరుగుతుందని శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ థాకరే తెలిపారు. పలు ఆలోచనలు, సిద్ధాంతాలకు చెందిన ప్రతిపక్ష పార్టీల కూటమి ఏకైక లక్షం దేశంలో ప్రజాస్వామిక ప్రక్రియ పరిరక్షణనే అని తేల్చిచెప్పారు. ఈ విదంగా ప్రధాని అభ్యర్థి ఎంపిక కూడా ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతుంది. పిఎం పదవికి అభ్యర్థి ఎంపికపై పలువురి పేర్ల పరిశీలన జరుగుందని, ఇదే బిజెపికి ఈ విషయంలో ఇటువంటి అవకాశం లేదని, ఛాయిస్ ఛాన్స్ లేదని, వారికి ఒక్కరే పిఎం అభ్యర్థి ఉన్నారని తెలిపారు. ఇండియా కన్వీసర్ ఎవరని విలేకరులు ప్రశ్నించగా , ఎన్‌డిఎ కన్వీనర్ ఎవరనేది చెపుతారా? అని విలేకరులకు ఎదురుప్రశ్న వేశారు.
కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపిన ఓట్ల లెక్క
2019 లోక్‌సభ ఎన్నికల ఓట్ల విశ్లేషణ క్రమం
బిజెపియేతర పార్టీలన్నింటికి కలిపి దక్కిన ఓట్లు ః 23 కోట్లు
ఇక ఈ ఎన్నికల్లో బిజెపికి దక్కిన ఓట్లు ః 22 కోట్లు …అప్పుడు ప్రతిపక్షం విడివిడి కాబట్టి ఓడింది. ఇప్పుడు కలిశాం కాబట్టి గెలుస్తున్నాం అని చవాన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News