Saturday, April 27, 2024

పెరగనున్న అంచనాలు

- Advertisement -
- Advertisement -

వేగంగా కోలుకుంటున్న దేశీయ ఆర్థిక వ్యవస్థ, రెండంకెల జిడిపి, నిలకడగా జిఎస్‌టి వసూళ్లు, అయినా కరోనా ముందు స్థాయి కంటే తక్కువగానే గణాంకాలు

India economy increase with GST

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది. మెరుగైన జిడిపి(స్థూల దేశీయోత్పత్తి), నిలకడగా ఉన్న జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) వసూళ్లే దీని ఉదాహరణ అని చెప్పవచ్చు. జూన్ త్రైమాసికంలో జిడిపి వృద్ధి గణాంకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. బ్లూమ్‌బర్గ్ పోల్‌లో ఆర్థికవేత్తలు 20 శాతం జిడిపి అంచనా వేయగా, దీనికి దగ్గరగా 20.1 శాతం వృద్ధి రేటు నమోదైంది. అయితే జిడిపి వృద్ధి ‘వి’ ఆకారంలో కోలుకున్నప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ త్రైమాసిక ప్రాతిపదికన కోవిడ్ కంటే ముందు స్థాయి కంటే తక్కువగానే ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో జిడిపి రూ. 32,38,020 కోట్లు, ఇది 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.35,66,708 కోట్లుగా ఉంది. కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఇది గత సంవత్సరం రూ.26,95,421 కోట్లకు తగ్గింది.
జిడిపితో ఉత్సాహం
జూన్ త్రైమాసికంలో జిడిపి వృద్ధి గణాంకాలు ప్రభుత్వంలో ఉత్సాహాన్ని నింపాయి. రాబోయే వారాల్లో జిడిపి వృద్ధి అంచనాను పెంచే అవకాశముందని మంగళవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ఆస్తుల సృష్టి కోసం వ్యయాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని తెలిపారు .జిడిపి 2019-20 కంటే ఎక్కువగా ఉంటుందని జూన్ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి స్థాయి కోవిడ్ కంటే ముందు స్థాయికి చేరగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. సిఐఐ ప్రధాన ఆర్థికవేత్త విదిషా గంగూలీ ప్రకారం, సమాధానం అవును కావచ్చు. మొదటి త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలు 2019-20 ఆర్థిక సంవత్సరం కంటే జిడిపి కొద్దిగా పెరుగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.8 శాతం వృద్ధి సాధిస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి జిడిపి 1.8 శాతం పెరుగుతుంది. కోవిడ్ కంటే ముందుగానే ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకుంటుంది.
జిఎస్‌టి వసూళ్లు
రెండో త్రైమాసికంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని అనేక సూచికలు సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. థర్డ్ వేవ్ లేకపోవడం, కోవిడ్ వ్యాప్తి కేసులు తగ్గడం, వ్యాక్సీనేషన్ పెరగడం వంటి సానుకూల సంకేతాలతో పరిస్థితి మెరుగుపడుతోంది. జిఎస్‌టి వసూళ్లు, డిజిటల్ లావాదేవీలు, ఇ-వే బిల్లు, రైల్వే గూడ్స్ వంటి నెలవారీ సూచీల వృద్ధిని చూస్తే వేగంగా రికవరీ సంకేతాలను కనిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి లాక్‌డౌన్ ఆంక్షలు లేకపోవడం, మరోవైపు వ్యవసాయం, నిర్మాణం, తయారీ, వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్ రంగాలు జూన్ త్రైమాసికంలో మెరుగ్గా ఉన్నాయి. అయితే ఆర్థిక, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు ఆశించినంతగా లేవు. రెండవ వేవ్ దృష్ట్యా కోవిడ్ ఆంక్షల కారణంగా దేశీయ డిమాండ్ బలహీనంగా ఉంది. ఈ కాలంలో ఎగుమతులు, పెట్టుబడుల ద్వారా వృద్ధికి మద్దతు లభించింది. ఈ కాలంలో ప్రభుత్వ వ్యయం క్షీణించింది. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో వ్యాక్సీన్ ప్రక్రియ వేగంగా ఉండడం వల్ల ఎగుమతులు పెరుగుతున్నాయి.
ఆర్‌బిఐ అంచనా 9.5%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(202122) జిడిపి వృద్ధి అంచనా విషయానికొస్తే, ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) 9.5 శాతం జిడిపి అంచనా ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం, భారత్ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో 8.3 శాతం ఉంటుంది. జూలై 27న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారతదేశ జిడిపి వృద్ధిని 9.5 శాతంగా అంచనా వేసింది. ఏప్రిల్‌లో సెకండ్ వేవ్ రాకముందే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది 12.5 శాతం ఆర్థిక వృద్ధిని అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 6.9 శాతం నుండి 8.5 శాతానికి పెంచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనామిక్ రీసెర్చ్ ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 9.7 శాతం ఉంటుంది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీల ప్రకారం, వృద్ధి 9 శాతం ఉండొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News