Friday, May 17, 2024

పాము కాటుకు 19 ఏళ్లలో 12 లక్షలమంది బలి

- Advertisement -
- Advertisement -

India highest number of snakebites deaths in world

ప్రపంచంలో 50 శాతం భారత్‌లోనే
ఆరోగ్య సిబ్బందికి శిక్షణ లేకపోవడం
వైద్య సౌకర్యాల కొరతే అధిక మరణాలకు కారణం
బాధితుల్లో గిరిజనులే అధికం
ఐసిఎంఆర్ అధ్యయన నివేదిక

న్యూఢిల్లీ: దేశంలో 2000 నుంచి 2019వరకు 19 ఏళ్లలో విష సర్పాల కాటుకు 12 లక్షలమంది బలయ్యారని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్(నిర్)్ర, ముంబయిలోని ఐసిఎంఆర్, మహారాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనాత్మక సర్వేలో వెల్లడైంది. ప్రజలకు, ప్రత్యేకించి గిరిజనులకు విష సర్పాల పట్ల తగిన అవగాహన లేకపోవడమే అధిక మరణాలకు కారణమవుతోందని అధ్యయన నివేదిక పేర్కొన్నది. పాముకాటు సంఘటనల పట్ల తీవ్ర నిర్లక్షం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఒ) వర్గీకరించడాన్ని నివేదిక గుర్తు చేసింది. ప్రపంచంలో ఏటా 54 లక్షలమంది పాము కాటుకు గురవుతుండగా, వారిలో 18 నుంచి 27 లక్షల వరకు విష సర్పాల బాధితులే. మరణాలు 80,000 నుంచి 1,40,000 వరకు నమోదవుతున్నాయి. చూపు కోల్పోవడం, మూత్రపిండాలు దెబ్బతినడం, మనోస్థిమితం కోల్పోవడంలాంటి ఇతర వైకల్యాలతో బాధపడేవారి సంఖ్య మరణాలకన్నా మూడు రెట్లు అధికంగా ఉంటోంది.

ప్రపంచంలో సర్పాల కాటుకు గురవుతున్నవారిలో భారత్‌లోనే అధికంగా ఉండగా, మరణాలు 50 శాతం వరకు నమోదవుతున్నాయి. పాము కాటుకు గురవుతున్నవారిలో రైతులు,కూలీలు,వేటగాళ్లు, పాముల పట్టేవాళ్లు,పశువుల కాపరులు, గిరిజనులు అధికంగా ఉన్నారు. ప్రాథమిక చికిత్స పట్ల అవగాహన లేకపోవడం, ప్రాణాల్ని కాపాడే యాంటీ స్నేక్ వీరమ్(ఎఎస్‌వి) అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వకపోవడం వల్ల మరణాలు అధికంగా నమోదవుతున్నాయని అధ్యయనానికి సమన్వయకర్తగా వ్యవహరించిన ఐసిఎంఆర్‌నిర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ స్మితామహాలే అన్నారు. 2030 వరకల్లా పాముకాటు మరణాలు, వైకల్యాలను సగానికి తగ్గించాలని డబ్లూహెచ్‌ఒ లక్షంగా నిర్ణయించింది. డబ్లూహెచ్‌ఒ రోడ్డు మ్యాప్ ప్రకటించడానికి ముందే(2013లోనే) ఐసిఎంఆర్‌నిర్ ఈ విషయంలో సామాజిక అవగాహన తేవడానికి అధ్యయనాన్ని ప్రారంభించాయి. ఐసిఎంఆర్ నేషనల్ టాస్క్ ఫోర్స్ అందుకు నిధులు సమకూరుస్తోంది.

2013 నుంచి పాల్ఘర్‌జిల్లా గిరిజన ప్రాంతంలో అధ్యయనం

మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా దహాను బ్లాక్‌లో ఈ అధ్యయనం చేపట్టారు. ఆ ప్రాంతంలో దాదాపు 70శాతం గిరిజనులే. దహాను బ్లాక్‌లో లక్ష జనాభాకు 2013లో 216మంది, 2014లో 264మంది, 2015లో 338మంది చొప్పున పాము కాటుకు గురయ్యారు. దహాను బ్లాక్‌లో మొత్తంమీద పాముకాటుకు గురైనవారు 2013లో 870మంది, 2014లో 1060మంది, 2015లో 1360మంది ఉన్నారు. 2014లో పాముకాటు వల్ల మరణాలు 4.4 శాతం ఉండగా, 2017లో 0.4 శాతానికి తగ్గాయని నివేదిక పేర్కొన్నది. ఆ ప్రాంతంలో పాముల పట్ల అవగాహన కలిగించడం, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ద్వారా మరణాలను తగ్గించగలిగామని తెలిపింది.

దహాను బ్లాక్‌లోని వైద్య అధికారుల్లో 50 శాతంమందికి కట్లపాము, రక్తపింజెర కాటు వల్ల జరిగే పరిణామాల పట్ల అవగాహన లేదని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు డాక్టర్ ఇట్టా కృష్ణచైతన్య, డాక్టర్ దీపక్ అబ్నావే తెలిపారు. ఏది విష సర్పమో, ఏది కాదో అన్నది తెలుసుకోవడం, విద్య, సమాచారమందించడం(ఐఇసి) అనే లోపం ఆ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. ప్రాథమిక చికిత్స, ప్రాణాల్ని కాపాడే చికిత్స పట్ల అవగాహన లేకపోవడం, సౌకర్యాలు లేకపోవడాన్ని కూడా అధ్యయన బృందం గుర్తించింది. విష సర్పాల విషయంలో వైద్య విద్యార్థులకు స్వల్పకాలిక శిక్షణ ఇవ్వడం తప్పనిసరి చేయాలని అధ్యయన నివేదికలో సూచించారు. దీనిపై సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి బహుళ వ్యవస్థలు సమన్వయంతో పని చేయాలని, మరణాలను తగ్గించడానికి ఆరోగ్య సేవల సామర్థాన్ని మెరుగు పరచాలని నివేదిక సిఫారసు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News