Friday, April 26, 2024

ఈ దేశాన్ని ‘దేవుడే రక్షించాలి’!

- Advertisement -
- Advertisement -

India is facing the worst crisis in 70 years

గత కొద్ది నెలలుగా భారత దేశం గత 70 ఏళ్ళల్లో యెరుగనంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒక వంక ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దిగజారుతూ ఉండగా, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ప్రజలు గతంలో ఎన్నడూ యెరుగనంతటి రీతిలో తమ భవిష్యత్ పట్ల ఆందోళన చెందుతున్నారు. అన్ని రంగాలలో తీవ్రమైన అశాంతి నెలకొన్నది.

అయితే మన చట్టసభలు గాని, రాజకీయ పక్షాలు గాని, చివరకు మీడియా గాని ఈ విషయాలపై దృష్టి సారించడం లేదు. మూడు నెలలుగా హిందీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిని పెను రాజకీయ వివాదంగా మార్చారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశాన్ని ప్రతిష్టాకరంగా తీసుకున్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు పాత్ర వహించింది. సుప్రీంకోర్టు అత్యవసరమైన ప్రజా ప్రయోజనంగా భావిం చి హడావుడిగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్ సుశాంత్ స్వస్థలం కానీ పక్షంలో ఇంతటి హడావుడి చేసేవారా? మరో నటి కంగనా రనౌత్ రాజకీయ నాయకులను మించిపోయి, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, అందుకు అంతే అసహనంతో శివసేన నేత ఒకరు స్పందించడం, అర్ధాంతరంగా ఆమె కార్యాలయ భవనాన్ని ముంబైలో పగులగొట్టడం, కేంద్రం హడావుడిగా ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించడం జరిగింది.

ఎన్నికైన ఒక పార్లమెంట్ సభ్యుడు కె. రామకృష్ణంరాజు తనకు ఏపీలో భద్రత లేదని, స్థానిక పోలీసులపై నమ్మకం లేదని అంటూ తగు భద్రత కల్పించమని కేంద్రాన్ని కోరితే మూడు నెలల వరకు స్పందన లేదు. చివరకు ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకొంటే గాని ఆయనకు భద్రత లభించలేదు. కానీ కంగనా విషయంలో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అత్యంత వేగంగా స్పందించింది. దేశంలో న్యాయ వ్యవస్థ, భద్రత వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కేవలం తమ వైఫల్యాలను కప్పుపుచ్చు కోవడం కోసమే అనవసర అంశాలపై రాద్ధాంతం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయా? ప్రధాన అంశాలను ఎదుర్కొనే సాహసం చేయలేకనే ప్రజల దృష్టిని ఉద్దేశపూర్వకంగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా?

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కిషోర్ రెండు ట్వీట్‌లు ఇచ్చారని హడావుడిగా సుమోటోగా కేసు చేపట్టి 24 రోజులలో దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు వలస కార్మికుల విషయంలో రెండు, మూడు నెలల వరకు స్పందించకపోవడం గమనార్హం. సుప్రీం కోర్టు ప్రతిష్ఠ, గౌరవం న్యాయమూర్తుల తీర్పులపై ఆధార పడిఉంటుందని గ్రహించలేకపోతున్నారా?ఉపాధి కోల్పోయి, నిలువనీడ లేక, ప్రాణ భయంతో వందల మైళ్ళు మండుటెండలతో వలస కార్మికులు స్వస్థలాలకు నడిచి వెడుతుంటే దారిలోని ప్రజలు స్పందించి మానవత్వంతో వారికి నీరు, ఆహారం సమకూర్చారు గాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు కూడా వెంటనే స్పందించ లేదు.

దేశ ఆర్ధిక వ్యవస్థకు వారే మూలవిరాట్‌లని లాక్ డౌన్ సమయంలోనే దేశ ప్రజలు గ్రహించారు. వారు వెళ్లిపోతుంటే తమ రాష్ట్రాలలో అభివృద్ధి ఆగిపోతుందని పలువురు ముఖ్యమంత్రులు కంగారుపడ్డారు. కానీ లాక్‌డౌన్ సమయంలో వారి సంగతి ఏమిటి? ఎవ్వరు పట్టించుకోలేదు. ఈ దేశంలో అమలులో ఉన్న పలు కార్మిక చట్టాలు వారికి అక్కరకు రాలేకపోయాయి. ఇంకా వలస కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.వలస కార్మికుల దుస్థితిపై ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్, కరోనా కారణంగా వారి బతుకులు మరీ దుర్భరంగా మారిపోయాయని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. కోట్లాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు. వారు వీధులలోకి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. జిడిపి చరిత్రలో ఎన్నడూ యెరుగనంతగా పడిపోయింది. ఇదంతా ‘దైవం చేస్తున్న చర్య’ అంటూ ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ముక్తాయింపు ఇచ్చి మౌనం వహిస్తున్నారు. ఆర్ధిక వ్యవహారాల గురించి మాట్లాడడానికి ఒక్క కేంద్ర మంత్రిగాని, ఒక్క అధికార పక్ష ప్రజాప్రతినిధి గాని నేడు సాహసించడం లేదు.

ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని అనేక కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకోవడమో, ఇస్తున్న జీతాలతో కోత విధించడం చేస్తున్నాయి. అటువంటి కంపెనీలను ఎటువంటి చట్టాలు దోషిగా నిలబెట్టలేకపోతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజలకు తాయిలాలు ఇవ్వడం కాదని, వస్తూత్పత్తికి డిమాండ్ సృష్టించాలని ఆర్ధిక నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. ఇంతటి సంక్షోభకర పరిస్థితులలో సహితం అన్ని ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్న మన గ్రామీణ, వ్యవసాయ రంగాలు దేశ ఆర్ధిక వ్యవస్థకు పట్టుకొమ్మగా నిలదొక్కుకొంటున్నాయి. వాటికి మరింత చేయూత ఇచ్చే ప్రయత్నాలు జరగడం లేదు. ఆపదలో ఉన్న వారికి ఉచితంగా బియ్యం, పప్పులు ఇవ్వడంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఏదో పని కల్పిస్తే సరిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ ఆ విధంగా చేయడం వల్లన ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదు.

ఉపాధి హామీ పథకం క్రింద ఒక సంవత్సర కాలంలో ఐదుగురు సభ్యులు గల కుటుంబానికి కనీసం 100 పని దినాలు కల్పించాలి. దేశంలోని అతి పేద రాష్ట్రంగా భావించే ఒడిశాలో సగటున 50 పని దినాలకు మించి కల్పించలేకపోతున్నారు. అంటే డిమాండ్ లేదా? తాత్కాలిక ఉపశమనం కల్పించడం కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని శాశ్వత ఉపాధి పథకంగా మార్చడం ప్రభుత్వాల దివాలాకోరు విధానాలకు అద్దం పడుతుంది. నదుల అనుసంధానం, రహదారులు, వివిధ ప్రాజెక్ట్‌లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించే వాటి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకో గలిగితే ఆర్ధిక వ్యవస్థలో మంచి చైతన్యం తీసుకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అటువంటి ప్రయత్నం జరగడం లేదు.

దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలకు కేంద్ర ప్రభుత్వం వద్ద పరిష్కారాలు లేవని అధికార పక్షానికి చెందిన ఎంపి, ప్రముఖ ఆర్ధిక వేత్త డా. సుబ్రహ్మణ్య స్వామి ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. సాధారణంగా ఏ మంత్రివర్గంలో అయినా సమాన స్థాయి (అర్హతలు) గలిగిన పలువురు ఉంటారు. దానితో ఎటువంటి సంక్షోభాలు ఎదురైనా వారు కూలంకషంగా చర్చించి, కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉదాహరణకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ప్రణబ్ ముఖర్జీని ప్రధాని ‘సర్’ అని పిలిచేవారు. ఆయన మంత్రివర్గంలో ప్రధాని పదవి ఆశించేవారు అనేక మంది ఉన్నారు. అట్లాగే వాజపేయి మంత్రివర్గంలో జస్వంత్ సింగ్, జార్జ్ ఫెర్నాండెస్, ఎల్ కె అద్వానీ వంటి ఎందరో ఉద్దండులు ఉన్నారు. కానీ ప్రస్తుత మంత్రివర్గంలో దాదాపు అందరూ ఏదో కారణంగా మంత్రి పదవులు పొందినవారు కావడంతో నోరు విప్పితే ఆ పదవి ఎక్కడ పోతుందో అని మాట్లాడటం లేదని స్వామి చెప్పుకొచ్చారు.

ప్రధాన మంత్రి చైర్మన్‌గా, ముగ్గురు కేంద్ర మంత్రులతో ఏర్పడిన పిఎం కేర్స్ నిధిని, ప్రధాన మంత్రి కార్యాలయం పర్యవేక్షణలో ఉన్న నిధిని ఒక ప్రైవేట్ నిధి వలే వ్యవహరిస్తూ, దానికి సంబంధించిన అంశాలను గోప్యంగా ఉంచుతూ ఉంటె ఎవ్వరు మాట్లాడకపోవడం, కనీసం సుప్రీంకోర్టు ప్రశ్నించలేక పోవడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో లభించే ధర కన్నా రెట్టింపు ధర పలుకుతుంది. మన చుట్టూ ఉన్న దాదాపు 15 దేశాలలో కన్నా దాదాపు రెట్టింపు ధర పలుకుతుంది. అయినా ఎవ్వరు ప్రశ్నించడం లేదు. పారదర్శకత, జవాబుదారీతనం ప్రజాస్వామ్యానికి మౌలికమైన అంశాలు. నేడు వాటికి తిలోదకాలిచ్చినట్లు స్పష్టమవుతున్నది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య వ్యవస్థ కోరుకొంటున్న ప్రభుత్వం 10 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పరీక్షలను వాయిదా వేయమని కోరితే వారి వాదనలను వినే ప్రయత్నమైనా చేయరా? ప్రశ్నలు, జవాబులు లేకుండా పార్లమెంట్ సమావేశాలు జరపవలసిన అత్యవసర పరిస్థితి నేడు దేశంలో నెలకొందా? దేశం ఎటు వైపు పోతుంది?

* చలసాని నరేంద్ర -9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News