Thursday, May 9, 2024

ఆకలి భారతం

- Advertisement -
- Advertisement -

India ranks 94th in Food Index system

 

ఈ ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం అత్యంత అథమ స్థానంలో ఉన్నదన్న సమాచారం దేశం ఎంచుకున్న విధానాలను, పాలనా శైలిని బోనులో నిలబెడుతున్నది. దేశదేశాల్లో ఆకలి, పోషకాహార లోపం గురించి ఆరా తీసే ప్రపంచ ఆహార సూచీ వ్యవస్థ 2020 సంవత్సరానికి విడుదల చేసిన 107 దేశాల ర్యాంకుల్లో భారత్ 94వ స్థానంలో ఉన్నది. అంటే కేవలం 13 దేశాలే మన కంటే వెనుకబడి ఉన్నాయి. అదే సమయంలో మనతో పాటు ఆకలి సమస్య తీవ్రంగా వున్న దేశాల జాబితాలో ఉన్న మన పొరుగు దేశాలు బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్థాన్‌లు మన కంటే మెరుగైన ర్యాంకులు పొందడం గమనార్హం. బంగ్లాదేశ్ 75వ స్థానంలో, మయన్మార్, పాకిస్థాన్‌లు వరుసగా 78, 88 ర్యాంకుల్లో ఉన్నాయి. ఆకలి సమస్య ఒక మాదిరిగా పీడిస్తున్న దేశాల జాబితాను నేపాల్, శ్రీలంకలు అలంకరించడం విశేషం. నేపాల్‌ది 73వ ర్యాంకు కాగా, శ్రీలంకది 64. భారత దేశ జనాభాలో 14 శాతం మంది పోషకాహార కొరతను ఎదుర్కొంటున్నారని నిగ్గు తేలింది. ఇందుకు ప్రధాన కారణం అట్టడుగు స్థాయి జనాభాలో పేరుకుపోయిన పేదరికమేనని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు.

వారు పోషకాహార విలువలున్న పప్పులు, మాంసాహారం, పండ్లు, ఆకు కూరలు వంటివి అరుదుగా గాని తీసుకోరన్నది సుస్పష్టం. ప్రపంచ ఆహార సూచీ గత ఏడాది ర్యాంకులిచ్చిన 117 దేశాల జాబితాలో ఇండియా 102వ స్థానంలో నిలిచింది. అంటే నిరుటికి, ఈ ఏడాదికి చెప్పుకోదగిన మెరుగుదల లేదని విదితమవుతున్నది. ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభా గల భారత్‌కు యువత పెట్టని కోట వంటి సంపద. దేశ జనాభాలో సగం మంది 25 ఏళ్లలోపు వయసులోని వారే. 35 సంవత్సరాల లోపు వయసున్న వారు జనాభాలో 65 శాతం వరకు ఉంటారు. ఇంతటి యువ సంపదను సక్రమంగా వినియోగించుకొని ఆర్థికాభివృద్ధికి సంపూర్ణంగా వాడుకోగలిగితే ఆకలి, పోషకాహార లేమి సమస్యలు మన దరిదాపుల్లో ఉండేవి కావు. కాని దేశంలో గల పని వయసు జనంలో సగం మంది పనిపాటు లేకుండా ఉన్నారన్న చేదు వాస్తవమే మన దుస్థితిని అద్దం పట్టి చూపిస్తున్నది. దేశానికి సారథ్యం వహిస్తున్న రాజకీయ శక్తులు, ప్రణాళికా కర్తలు జనశక్తిని సద్వినియోగం చేసుకోడంలో, మానవ వనరులను ఉపయోగంలోకి తీసుకురావడంలో ఘోరంగా విఫలమవుతున్నారని రూఢి అవుతున్నది.

దేశ ప్రజలందరికీ కనీసమైన ఆహార, ఆరోగ్య భద్రతను హామీ ఇచ్చే సంక్షేమరంగం దారుణంగా నీరసించిపోడం కూడా ఆకలి ఆర్తనాదాలు మిన్నంటుతుండడానికి కారణమని చెప్పక తప్పదు. ఆకలితో పాటు బాలల్లో సహేతుక శారీరక పెరుగుదల లోపం కూడా దేశాన్ని పట్టి పీడుస్తున్నది. ఎత్తుకు తగిన బరువులేని బాలలు 201014 లో 15.1 శాతం ఉండగా, 201519 నాటికి 17.3 శాతానికి పెరిగారు. పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు లేమి గతంతో పోలిస్తే ఇప్పుడు తక్కువగా ఉన్నప్పటికీ ఇంకా తీవ్రంగానే కొనసాగుతున్నది. ఈ సమస్య 2000 సంవత్సరంలో 54 శాతం మంది బాలల్లో రుజువు కాగా, ఇప్పుడది 35 శాతానికి తగ్గింది. విశేషమేమిటంటే చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్‌లు 2020 ఆకలి సూచీలో మొదటి ఐదు ర్యాంకుల లోపునే ఉండడం. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి అతి పెద్ద నిరుపేద రాష్ట్రాల్లో పేరుకుపోయిన ఆకలి, దారిద్య్రాల ప్రభావం దేశ సగటులో ప్రతిబింబించడం సహజం.

పేదరిక నిర్మూలన పథకాల అమల్లో లోపాలు, సరైన పర్యవేక్షణ కొరవడడం, గోప్యతతో కూడిన పాలనా విధానాలు వంటివే దేశంలో ఆకలి సమస్య తీవ్ర స్థాయిలో కొనసాగడానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. మిగతా ప్రపంచమంతా ఆధునిక పద్ధతుల వెంట పరుగులు పెడుతుండగా మన దేశ పాలకులు సనాతన జీవన విధానాన్ని బోధిస్తూ ప్రజలను వెనుకపట్టు పట్టిస్తుండడం కూడా ఈ దుస్థితికి ఒక కారణమని అంగీకరించక తప్పదు. బాలలలో మరణాలు, జనన సమయంలో తగినంత బరువు లేకపోడం అతి పేద రాష్ట్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నదని కూడా ప్రపంచ ఆకలి సూచీ ఎత్తి చూపుతున్నది. ఎక్కడైతే ఆధునికత చొరబడలేకపోతున్నదో అక్కడే ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని దీనిని బట్టి తెలుస్తున్నది. జనాభాను దేశ వికాసానికి సవ్యంగా వినియోగించుకునే రీతులను శాస్త్రీయంగా అభివృద్ధి పరిచి వాటిని సమగ్రంగా అమలులో పెట్టినప్పుడే ఆకలి కోరల్లోంచి నవ భారతం విముక్తి చెందుతుంది. పొరుగున గల అన్ని దేశాల కంటే అథమ స్థానంలో కొనసాగుతూ ఉండడం వృద్ధి పథంలో దూసుకుపోతున్నానని దిక్కులు పిక్కటిల్లేలా చెప్పుకుంటున్న ఇండియాకు ఎంత మాత్రం ప్రతిష్ఠాత్మకం కాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News