Friday, May 3, 2024

టాక్స్ హాలిడే మంత్రం

- Advertisement -
- Advertisement -

tax-holiday

కొత్త పెట్టుబడుల కోసం భారీగా పన్ను మినహాయింపులు
ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు భారత్ ప్రణాళిక
చైనా నుంచి వచ్చే కంపెనీలకు గాలం
కంపెనీలకు భూకేటాయింపు సులభతరం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను కంపెనీలకు టాక్స్ హాలిడే (పన్ను మినహాయింపు) ప్రకటించాలని భారతీయ వాణిజ్య మంత్రిత్వశాఖ యోచిస్తోంది. అయితే ఈ రకమైన పన్ను రాయితీలు కొత్త వ్యాపారం ప్రారంభించిన తర్వాత మాత్రమే లభిస్తాయి. ఈమేరకు సంబంధిత అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం 500 మిలియన్ డాలర్ల వరకు కొత్త పెట్టుబడులు పెట్టే కంపెనీలకు 10 ఏళ్ల పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదనగా ఉంది.

ఈ వివరాలను వెల్లడించినవారు పేరు చెప్పేందుకు నిరాకరించారు. జూన్ నుంచి మూడేళ్లలో పనులు ప్రారంభించే కంపెనీలకు ఈ ప్లాన్ వర్తింపజేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విభాగంలో వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, టెలికామ్ ఉపకరణాలు, క్యాపిటల్ గూడ్స్ సహా పలు రంగాలకు ప్రాధాన్యతనిచ్చి, పెట్టుబడులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది. మరో విధంగా 100 మిలియన్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు నాలుగేళ్ల టాక్స్ హాలిడే ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విభాగంలో కార్మిక సంబంధిత రంగాలు టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్, ఫుట్‌వేర్ వుండనున్నాయి. పన్ను మినహాయింపు తర్వాత వచ్చే ఆరు సంవత్సరాల వరకు తక్కువ స్థాయిలో 10 శాతం కార్పొరేట్ పన్ను ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదించిందనప్పటికీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. చైనా నుంచి వచ్చే కంపెనీలకు సులువుగా భూమి కేటాయించడం నుంచి పన్ను మినహాయింపుల వరకు అన్నింటిపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికార యంత్రాంగం ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్నది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం భారీ ప్యాకేజీ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

100 మి.డాలర్ల పెట్టుబడిపై పన్ను మినహాయింపు

టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, తోలు, పాదరక్షల రంగాల వంటి కార్మిక ఆధారిత రంగాలలో 100 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు నాలుగేళ్లపాటు పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. దీని తరువాత కార్పొరేట్ పన్నును రాబోయే 6 ఏళ్లకు 10 శాతం తక్కువ రేటుతో చెల్లించాలి. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఆమోదం ఇవ్వలేదు. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

చైనా నుండి వచ్చే సంస్థలే లక్ష్యం

కరోనావైరస్ కారణంగా క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులను ఆకర్షించడం ప్రారంభించింది. దీని కింద చైనాను విడిచిపెట్టిన సంస్థలకు భారతదేశంలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సులభంగా భూమిని అందిస్తున్నారు. కరోనా మహమ్మారితో భారతదేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. ఇప్పటివరకు ప్రభుత్వం పెద్ద ఉపశమన ప్యాకేజీని ప్రకటించలేదు. కరోనా కారణంగా ఏప్రిల్‌లో సుమారు 1.22 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వినియోగదారుల డిమాండ్ పూర్తిగా లేకుండా పోయింది.

మౌలిక సదుపాయాల విస్తరణ కోసం 50 క్లస్టర్ల ఎంపిక

అదనంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం 50 ఇండస్ట్రీ క్లస్టర్లను ఎంపిక చేసింది. ఈ క్లస్టర్లలో టెస్టింగ్ క్లస్టర్లు, పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కూడా ఉంటాయి. వస్త్ర, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, రత్నాలు, ఆభరణాల వంటి రంగాల అభివృద్ధి ఇందులో ఉంది. ఇవే కాకుండా పర్యాటక రంగం వంటి సేవల రంగాన్ని విస్తరించే ప్రణాళికలపై కూడా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.

10 ఏళ్ల పన్ను మినహాయింపు

వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం, కొత్త కంపెనీలకు పెట్టుబడి ఆధారంగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక సంస్థ 500 మిలియన్ల డాలర్లకు మించి కొత్త పెట్టుబడి పెడితే, 10 సంవత్సరాల వరకు పూర్తి పన్ను తగ్గింపును ఇస్తారు. ఈ పన్ను మినహాయింపును సద్వినియోగం చేసుకోవడానికి కంపెనీలు జూన్ 1 నుండి 3 సంవత్సరాలలోపు కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంటుంది. వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, టెలికాం పరికరాలు, మూలధన వస్తువులతో సంబంధం ఉన్న సంస్థలకు ఈ పన్ను మినహాయింపు లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News