Tuesday, April 30, 2024

వన్ మోర్ ‘సూపర్’ విన్

- Advertisement -
- Advertisement -

India

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టి20లో భారత్ మరోసారి సూపర్ ఓవర్‌లో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యాన్ని 40కు పెంచుకుంది. ఆదివారం చివరి టి20 జరుగనుంది. ఇక, ఈ మ్యాచ్ కూడా టైగా ముగియడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులో మరోసారి భారత్ విజయం సాధించింది. మరోవైపు న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశే మిగిలింది. ఏడు సార్లు ఓవర్ల ద్వారా ఫలితం తేల్చగా ఇందులో ఆరుసార్లు కివీస్ ఓటమిని మూటగట్టుకోవడం గమనార్హం. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్ట నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

ఈ పరిస్థితుల్లో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఇందులో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 13 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మరో బంతి మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి రెండు బంతులను లోకేశ్ రాహుల్ సిక్స్, ఫోర్‌గా మలిచాడు. మూడో బంతికి బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక, నాలుగో బంతికి కోహ్లి రెండు పరుగులు చేశాడు. అంతేగాక ఐదో బంతికి కళ్లు చెదిరే ఫోర్ బాదడంతో భారత్‌కు వరుసగా నాలుగో విజయం లభించింది.

రాహుల్ జోరు

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కిందటి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించిన డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో సంజూ శాంసన్‌కు చోటు కల్పించారు. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో శాంసన్ విఫలమయ్యాడు. ఒక సిక్స్‌తో 8 పరుగులు చేసి కుగ్లేజిన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా నిరాశ పరిచాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కోహ్లి రెండు ఫోర్లతో 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక, అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఏడు బంతులు ఆడిన అయ్యర్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ లోకేశ్ రాహుల్ తన పోరాటాన్ని కొనసాగించాడు. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను భారీ షాట్లుగా మలచడంలో సఫలమయ్యాడు. ధాటిగా ఆడిన రాహుల్ 26 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 39 పరుగులు చేశాడు. జోరుమీదున్న రాహుల్‌ను ఐష్ సోధి వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే మరోసారి విఫలమయ్యాడు. రెండు ఫోర్లతో 12 పరుగులు చేసి ఐష్ సోధి బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఆ వెంటనే వాషింగ్టన్ సుందర్ కూడా వెనుదిరిగాడు. మూడు బంతులు ఎదుర్కొన్న సుందర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. సాంట్నర్ వేసిన అద్భుత బంతికి సుందర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 88 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఆదుకున్న మనీష్ పాండే

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను మనీష్ పాండే తనపై వేసుకున్నాడు. అతనికి శార్ధూల్ ఠాకూర్ అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్, రెండు పరుగులు తీస్తూ స్కోరు పరిగెత్తించారు. ఇద్దరు కుదురు కోవడంతో భారత్ మళ్లీ తేరుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఠాకూర్ రెండు ఫోర్లతో 20 పరుగులు చేశాడు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన మనీష్ పాండే అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న పాండే 36 బంతుల్లో మూడు ఫోర్లతో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నవ్‌దీప్ సైని 11 (నాటౌట్) కూడా చివర్లో ధాటిగా ఆడడంతో భారత్ స్కోరు 165 పరుగులకు చేరింది. ప్రత్యర్థి బౌలర్లలో ఐష్ సోధి 26 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు.

మన్రో, సిఫర్ట్ మెరుపులు

తర్వాత ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న సీనియర్ ఆటగాడు, ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. కిందటి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈసారి జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో టిమ్ సిఫర్ట్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. మరో ఓపెనర్ కొలిన్ మన్రోతో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఇటు మన్రో, అటు సిఫర్ట్ దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లను హడలెత్తించారు. వీరిని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మన్రో అద్భుత షాట్లతో కనువిందు చేశాడు.

దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. సిఫర్ట్ అతనికి అండగా నిలిచాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మన్రో వరుస ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. 47 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో 64 పరుగులు చేసిన మన్రో రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి, ఠాకూర్ అద్భుత ఫీల్డింగ్‌కు మన్రో రనౌట్ కాక తప్పలేదు. తర్వాత వచ్చిన టామ్ బ్రూస్ ఖాతా తెరవకుండానే చాహల్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సమయంలో సీనియర్ ఆటగాడు రాస్ టైలర్‌తో కలిసి సిఫర్ట్ జోరును కొనసాగించాడు. భారత బౌలర్లను హడలెత్తించిన సిఫర్ట్ కివీస్‌ను గెలుపు బాటలో నడిపించాడు.

శార్ధూల్ మాయ

సిఫర్ట్, రాస్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరచడంతో 19 ఓవర్లలో కివీస్ 159/3తో నిలిచింది. చివరి ఓవర్‌లో విజయానికి ఏడు పరుగులు మాత్రమే అవసరమయ్యాడు. ఈ దశలో భారత్ గెలుపుపై ఆశలు వదులుకుంది. ఆఖరి ఓవర్‌ను శార్ధూల్‌కు అప్పగించారు. అయితే శార్ధూల్ మాత్రం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. తొలి బంతికే రాస్‌ను వెనక్కి పంపాడు. కుదురుగా ఆడిన రాస్ 18 బంతుల్లో రెండు ఫోర్లతో 24 పరుగులు చేశాడు. తర్వాతి బంతికి డారెల్ మిఛెల్ అద్భుత ఫోర్ కొట్టాడు. దీంతో కివీస్ గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే మూడో బంతికి సిఫర్ట్ రనౌటయ్యాడు. చెలరేగి ఆడిన సిఫర్ట్ 39 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. నాలుగో బంతికి సాంట్నర్ సింగిల్ తీశాడు. ఐదో బంతికి మిఛెల్‌ను శార్ధూల్ వెనక్కి పంపాడు. దీంతో చివరి బంతికి గెలుపు కోసం న్యూజిలాండ్‌కు రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే రెండో పరుగు తీసే క్రమంలో సాంట్నర్ రనౌట్ కావడంతో కివీస్ స్కోరు 165 పరుగులకే పరిమితమైంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. కిందటి మ్యాచ్ కూడా టైగా ముగిసిన విషయం తెలిసిందే.

ఈసారి కూడా గెలుపు మనదే

మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈసారి కూడా సూపర్ ఓవర్ బాధ్యతను స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా తీసుకున్నాడు. కిందటి మ్యాచ్‌తో పోల్చితే ఈసారి బుమ్రా బాగానే బౌలింగ్ చేశాడు. 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ మరో బంతి మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. లోకేశ్ తొలి రెండు బంతుల్లోనే పది పరుగులు సాధించాడు. మొదటి బంతికి సిక్స్, రెండో బంతికి ఫోర్ కొట్టిన రాహుల్ మూడో బంతికి ఔటయ్యాడు. అయితే మిగిలిన లాంఛనాన్ని కెప్టెన్ కోహ్లిపూర్తి చేశాడు. నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన కోహ్లి, ఐదో బంతిని బౌండరీకి తరలించి భారత్‌ను గెలిపించాడు.

India vs New Zealand 4th T20I Highlights

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News