Wednesday, May 1, 2024

సరిహద్దుల వద్దకు మరిన్ని బలగాల తరలింపు

- Advertisement -
- Advertisement -

ఎల్‌ఎసి వెంబడి చైనా నిర్మాణాల కూల్చివేతకు సన్నాహాలు
సైన్యానికి తోడుగా ఐటిబిపి పోలీసులు
భారత ప్రభుత్వ నిర్ణయం

Indian army move to china boarder
న్యూఢిల్లీ: తమ దేశ సరిహద్దుల్లో సైనిక దళాల మోహరింపును చైనా పెంచుతుండడంతో చైనాతో గల 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి తమ సైనిక బలగాలను కూడా పెంచాలని భారత్ నిర్ణయించింది. సైన్యంతోపాటు ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు బలగాలతోపాటు ఆయుధ సామగ్రిని ఎల్‌ఎసి వద్ద మోహరించాలని భారత్ నిర్ణయించింది.
మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్, ఐటిబిపి చీఫ్ ఎస్‌ఎస్ దేశ్వాల్ గత శనివారం లెహ్‌ను సందర్శించిన సందర్భంగా సైన్యానికి దన్నుగా ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు బలగాలను రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. గాల్వన్ లోయలో ఘర్షణల సంఘటన జరగడానికి ముందే లడఖ్‌కు కొన్ని బలగాలను పంపించామని, ఇప్పుడు వాటి సంఖ్యను మరింత పెంచుతున్నామని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఎల్‌ఎసి వెంబడి అన్ని పెట్రోలింగ్ పాయింట్ల వద్ద సైనికులకు సహాయంగా ప్లటూన్‌కు బదులుగా ఒక కంపెనీని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సాధారణంగా ఒక ప్లటూన్‌లో 30 మంది జవాన్లు ఉంటారు. అదే ఒక కంపెనీలో దాదాపు 100 మంది జవాన్లు ఉంటారు.

చైనా, భారత్ మధ్య సోమవారం చర్చలు జరిగినప్పటికీ గాల్వన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ సరస్సు పాయింట్ల వద్ద ఇప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని ఇక్కడి జాతీయ భద్రతా మండలి(ఎన్‌ఎస్‌సి)కి సమాచారం అందుతోంది.
2020 ఏప్రిల్ 30 నాటి పరిస్థితి పునర్ధురణ జరగాలని భారత్ కోరుతోంది. మోల్డోలో జరిగిన సమావేశంలో ఉభయ దేశాలూ తమ తమ వాదనను వినిపించాయి. గాల్వన్, గోగ్రా వద్ద గల 14, 15, 17 పెట్రోలింగ్ పాయింట్ల వద్ద బలగాలను తగ్గించాలని ఉభయ పక్షాలూ సూచించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా.. పెట్రోలింగ్ పాయింట్ 14(గాల్వన్), పెట్రోలింగ్ పాయింట్ 15(కోంగ్కా లా), పెట్రోలింగ్ 17(హాట్ స్ప్రింగ్స్) వద్ద పరిస్థితి చల్లబడేందుకు మరింత విస్తృతంగా చర్చలు జరపాల్సి వస్తుందని వర్గాలు తెలిపాయి.

ఇలా ఉండగా గాల్వన్‌లో పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద చైనా బలగాలు కొత్త నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలియచేసే ఉపగ్రహ చిత్రాలను ఎన్‌డిటివి బుధవారం ప్రసారం చేసింది. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద కూడా చైనా దళాలు భారీ టెంట్లు వేసి అక్కడే గత నెలరోజులుగా మకాం వేసినట్లు తెలుస్తోంది. ఇక పెట్రోలింగ్ పాయింట్ 17 వద్ద ఉభయ దేశాలకు చెందిన సైనిక దళాలు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నాయి. ఫింగర్ 4లోకి చైనాకు చెందిన 120కి పైగా వాహనాలు, డజన్ల కొద్దీ పడవలు చొరబడినట్లు పాంగాంగ్ సరస్సుకు సంబంధించి సమాచారం అందుతోంది.

వాస్తవాధీన రేఖను చైనా ఏకపక్షంగా మారుస్తోందని భారత్ ఆరోపిస్తోంది. ఎల్‌ఎసికి అత్యంత సమీపంలో తమ సరిహద్దుల వద్దకు చైనా బలగాలు చేరుకుని భారీ నిర్మాణాలు చేపడుతున్నాయని, దీంతో భారత్ కూడా తన బలగాలు, సామగ్రిని అక్కడకు భారీ సంఖ్యలో పంపుతోందని సీనియర్ దౌత్యాధికారి ఒకరు తెలిపారు. భారత ప్రభుత్వం చైనాను సైనికపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. అయితే..భారత సేనలు కూడా చైనా బలగాలతో తలపడేందుకు సిద్ధమవుతున్నాయని ఆయన అన్నారు. డోక్లాం వద్ద చైనా సైన్యాన్ని నిలువరించి, పరిస్థితిని అదుపు చేసేందకు 73 రోజులు పట్టిందని, ఈ సమస్యకు కూడా చాలా రోజులు పట్టే అవకాశం ఉందని, ఈ కారణంగానే ఎక్కువ బలగాలను సరిహద్దుల వద్దకు పంపుతున్నామని ఆ అధికారి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News