Saturday, April 27, 2024

ఖలిస్థానీ సవాలు

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో గల భారత దౌత్య కార్యాలయానికి ఖలిస్థాన్ వాదులు నిప్పుపెట్టిన ఉదంతం అంతటా అందరూ ఖండించదగినది. మొన్న శనివారం నాటి ఈ ఘటన ఐదు మాసాల వ్యవధిలో అక్కడ జరగడం రెండోసారి. గత మార్చిలో ఒకసారి ఇదే విధంగా చేశారు. బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో జరుగుతున్న దాడుల గురించి తెలిసిందే. శాన్‌ఫ్రాన్సిస్కో ఘటనను అగ్ర రాజ్యం తీవ్రంగా ఖండించింది. దౌత్య ఉద్యోగులపైన, కార్యాలయాల మీద దాడులు చేయడం తీవ్ర నేరంగా పరిగణిస్తున్నామని ప్రకటించింది. గత మార్చి లో లండన్‌లోని భారత హై కమిషన్ ఆవరణలోకి చొరబడి ఖలిస్థానీయులు భారత జాతీయ పతాకకు చేసిన అపచారం తెలిసిందే. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆ ఘటనను తీవ్రంగా ఖండించింది.

భారత్ హై కమిషన్‌కు గట్టి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ ఘటనతో భారత, బ్రిటన్ సంబంధాల్లో స్వల్ప తేడా వచ్చింది. శనివారం నాటి శాన్‌ఫ్రాన్సిస్కో ఘటన చిన్నదే. అయినప్పటికీ విదేశాల్లోని బలమైన సిక్కు సమాజాన్ని ఆసరా చేసుకొని ఖలిస్థానీయులు జరుపుతున్న భారత విద్రోహ కార్యకలాపాలను ప్రతిబింబిస్తున్న తీవ్ర ఘటన అది. ఆస్ట్రేలియాలో గత ఫిబ్రవరిలో బ్రిస్బేన్‌లో గల భారత దౌత్య కార్యాలయానికి ఖలిస్థానీ జెండాను అతికించిన ఘటన సంభవించింది. దానితో ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడి భారత కాన్సులేట్‌ను మూయించి వేసింది. రోమ్‌లో 2021 జనవరిలో భారత రాయబార కార్యాలయంపై దాడి చేశారు. ఆ భవనంపై తమ జెండా ఎగుర వేశారు. గోడలపై ఖలిస్థాన్ జిందాబాద్ నినాదాలు రాశారు.

2020 డిసెంబర్‌లో అమెరికాలోని భారత రాయబార కార్యాలయంపై బయట గల మహాత్మా గాంధీ విగ్రహానికి అపచారం తలపెట్టారు. వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయానికి వందలాది మంది సిక్కులు కారు ర్యాలీ తీశారు. ఈ నిరసనల్లో వారు కృపాణాలు ధరించి మహాత్మా గాంధీ విగ్రహంపైకి దురుసుగా దుమికారు. దాని మీద ఖలిస్థాన్ అనుకూల నినాదం గల పోస్టర్‌ను అతికించారు. కెనడాలోనైతే వీరి భారత విద్రోహ కార్యకలాపాలకు హద్దే లేదు. 2021 మార్చిలో కెనడాలో జరుపదలపెట్టిన అక్కడి భారతీయ సంతతి సమావేశాన్ని 300 మంది ఖలిస్థానీ తీవ్రవాదులు అడ్డుకొన్నారు. ఆ ఘటనలో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా, కెనడా ఫౌండేషన్ అనే సంస్థలను నడుపుతున్న మనీందర్ గిల్ ఏర్పాటు చేసిన ఆ సమావేశానికి ముందే ఖలిస్థానీయులు అక్కడికి చేసుకొని ఈ దుర్మార్గాన్ని జరిపించారు. గమనించదగినది ఏమిటంటే ఈ దుర్ఘటనను కెనడా పోలీసులు మౌన ప్రేక్షకులుగా చూస్తూ ఊరుకొన్నారు. దానితో ఆ సమావేశాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది.

కెనడా జనాభాలో 2.1 శాతం మంది సిక్కులున్నారు. వారిలో 80 లక్షల మంది సిక్కు మతావలంబులు. సిక్కు మతం కెనడాలోని నాలుగవ అతి పెద్ద మతం. వారి ఓట్ల మీద దృష్టితో కెనడా పాలకులు వారి పట్ల ఉదారంగా వుంటారు. వారి దుశ్చర్యలను అడ్డుకోడానికి జంకుతారు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇటీవల ఈ విషయాన్ని ధ్రువపరిచారు. ఖలీస్థానీ తీవ్రవాదుల విషయంలో కెనడా ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతున్నదని ఆయన అన్నారు. కెనడాలోని భారత దౌత్య కార్యాలయాలకు సమీపంలో విద్రోహ చర్యలకు తలపడకుండా నిరసనకారులను నిరోధించాలని ఇందు కోసం గట్టి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం తాజాగా అక్కడి ట్రూడో ప్రభుత్వానికి రాసింది. గతంలో ఆపరేషన్ బ్లూస్టార్ సైనిక చర్యతో భింద్రన్ వాలే వగైరా ఖలిస్థానీ తీవ్రవాదులను ఏరివేసిన తర్వాత ఇంత కాలానికి అది మళ్ళీ అంకురించి మొగ్గ తొడిగి విజృంభిస్తున్నదని అర్థమవుతున్నది.

ఇటీవల వారిస్ పంజాబ్ దే ఉద్యమ నాయకుడు అమృత్ పాల్ సింగ్‌ను పంజాబ్‌లో అరెస్టు చేసిన తర్వాత దేశ దేశాల్లోని తీవ్రవాదులు విజృంభించడం ప్రారంభించారు. పంజాబ్ రాష్ట్రాన్ని గాని, చుట్టు ప్రక్కలనున్న ప్రాంతాలను కలిపిగాని ఖలిస్థాన్‌గా ప్రకటింపజేసుకోవాలని వారు కోరుతున్నారు. అందుకోసం దేశ విదేశాల్లోని వనరులను పోగుచేసి మళ్ళీ బింద్రన్ వాలే నాటి ప్రయోగానికి తెర తీయాలనే దుస్సాహసానికి పాల్పడుతున్నారు.అమృత్‌పాల్ సింగ్ తన మిత్రుడిని విడిపించుకోడానికి పోలీసు స్టేషన్‌పై వందలాది మంది అనుచరులతో దాడి చేసినప్పుడు అది ఒక చిన్న ఘటనేనని దానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వనక్కర లేదని ప్రచారం జరిగింది. ఇప్పటి పరిస్థితులను గమనిస్తే ఈ శక్తులను తక్కువ అంచనా వేయలేమని రూఢి అవుతున్నది. కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం మరింత సమన్వయంతో వీరి నిర్మూలనకు కృషి చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News