Monday, April 29, 2024

రాణి సేన సంచలనం

- Advertisement -
- Advertisement -

Indian women’s team historic win in Olympics hockey

రాణి సేన సంచలనం
మహిళల హాకీ సెమీస్‌లో భారత్
టోక్యో: భారత మహిళా హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక విజయంతో సెమీఫైనల్‌కు చేరుకుంది. సోమవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో రాణి రాంపాల్ టీమ్ 1-0 తేడాతో పటిష్టమైన ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. భారత మహిళల హాకీ చరిత్రలో ఒలింపిక్స్ సెమీఫైనల్లో చేరడం ఇదే తొలిసారి. టోక్యో ఒలింపిక్స్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్ ఏకంగా సెమీస్‌కు చేరుకుని పెను ప్రకంపనలే సృష్టించింది. మహిళల హాకీలోనే అత్యంత బలమైన జట్టుగా పేరు తెచ్చుకున్న ఆస్ట్రేలియాపై రాణి టీమ్ చారిత్రక విజయాన్ని సాధించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో అసాధారణ ఆటను కనబరిచిన భారత్ ఏకైక గోల్ తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను కంగుతినిపించడం ద్వారా రాణి సేన భారత మహిళల హాకీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత గోల్ కీపర్ సవిత అసాధారణ ఆటతో అలరించింది. ఆస్ట్రేలియాకు ఏడు పెనాల్టీ కార్నర్‌లు లభించినా వాటిని సమర్థంగా అడ్డుకోవడం ద్వారా గోలకీపర్ సవిత టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక భారత్ సాధించిన ఏకైక గోల్‌ను గుర్జీత్ కౌర్ నమోదు చేసింది. 22వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడం ద్వారా భారత్‌కు గోల్ సాధించి పెట్టింది. ఆ తర్వాత వందా కటారియా, నవనీత్ కౌర్, రాణి రాంపాల్, టెటె సలీమా తదితరులు ఆధిక్యాన్ని మరింత పెంచేందుకు తీవ్రంగా శ్రమించారు.

అయితే, ఆస్ట్రేలియా గోల్ కీపర్ రేచల్ భారత దాడులను సమర్థంగా తిప్పికొట్టడంలో సఫలమైంది. ఇక బుధవారం జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనాతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు పతకం ఖాయమవుతోంది. అదే జరిగితే మహిళా హాకీ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డు చేరుతోంది. ఇక ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించినా రాణి సేనకు సెమీస్‌లో అర్జెంటీనా ఓడించడం అసాధ్యమేమీ కాదు. అయితే ఇలాంటి జోరునే కొనసాగించాల్సి ఉంటుంది. లీగ్ దశ ఆరంభంలో వరుస ఓటములు చవిచూసిన భారత్ నాకౌట్ దశకు చేరడమే కష్టంగా కనిపించింది. ఇలాంటిది రాణి టీమ్ ఏకంగా సెమీఫైనల్‌కు చేరుకుని ఒలింపిక్స్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఇదిలావుండగా భారత పురుషుల హాకీ జట్టు కూడా సెమీఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా మహిళా జట్టు కూడా ఒలింపిక్స్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుని కోట్లాది మంది అభిమానులను అలరించింది.
ప్రముఖుల ప్రశంసలు..
మరోవైపు ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న భారత మహిళా హాకీ జట్టుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాణి సేన సాధించిన విజయంపై రాజకీయ, క్రీడా, సినీ, వాణిజ్య ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా మహిళా హాకీ టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చారిత్రక ప్రదర్శనతో సెమీస్‌కు చేరడం ద్వారా మహిళా జట్టు భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ కొనియాడారు. భారత హాకీ ఇది శుభసూచకమని పేర్కొన్నారు. క్రీడల మాజీ మంత్రులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, కిరణ్ రిజిజు, ఒరిసా సిఎం నవీన్ పట్నాయక్, భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, లక్ష్మణ్, బిసిసిఐ కార్యదర్శి జే షా, బాలీవుడ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తదితరులు రాణి టీమ్ ప్రశంసలతో ముంచెత్తారు. ఇదే జోరును మిగిలిన మ్యాచుల్లోనూ కొనసాగించిన స్వర్ణంతో తిరిగి రావాలని వారు ఆకాంక్షించారు.

Indian women’s team historic win in Olympics hockey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News