Friday, April 26, 2024

అదుపు తప్పిన అంతరిక్ష కేంద్రం

- Advertisement -
- Advertisement -

International Space Station thrown out of control

కొద్ది నిమిషాల్లోనే సరి చేసిన గ్రౌండ్ కంట్రోల్ బృందం
వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం లేదని నాసా ప్రకటన

వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్‌ఎస్)లో గురువారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా పంపిన కొత్త మాడ్యూల్.. కేంద్రానికి అనుసంధానమైన కొద్ది గంటల్లోనే అందులోని థ్రస్టర్లు అనుకోకుండా మండాయి. దీంతో ఐఎస్‌ఎస్ దిశ అదుపు తప్పింది. అయితే భూమిపైనుంచి ఐఎస్‌ఎస్ కదలికలను నిరంతరం గమనించే గ్రౌండ్ కంట్రోల్ సిస్టం బృందం కొద్దినిమిషాల్లోనే తిరిగి పరిస్థితిని మామూలు స్థితికి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా స్పష్టం చేసింది. 23 టన్నుల బరువు కల ‘నాకా’అనే కొత్త మాడ్యూల్‌ను గతవారం కజకిస్థాన్‌లోని బైకనూర్‌నుంచి రష్యా ఐఎస్‌ఎస్ వద్దకు పంపించింది. ఇది గురువారం ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది. ‘స్వయం అనుసంధాన వ్యవస్థ’ వైఫల్యం చెందడంతో ఐఎస్‌ఎస్‌లోని కాస్మొనాట్ ఓలెగ్ నొవెట్‌స్కీ మాన్యువల్‌గా నాకా అనుసంధాన ప్రక్రియను పూర్తి చేశారు.

దీంతో భూమిపై ఉన్న రష్యా గ్రౌండ్ కంట్రోల్ బృందం చేసుకుంది. అయితే దాదాపు రెండు గంటల తర్వాత నాకాపై ఉన్న థ్రస్టర్లు అనుకోకుండా మండాయి. దీంతో ఐఎస్‌ఎస్ ఉండాల్సిన స్థితికన్నా 45 డిగ్రీలు అదనంగా ఒరిగింది. అప్పటికే అప్రమత్తమైన రష్యా గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థలు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. దాదాపు గంట వ్యవధిలోనే ఐఎస్‌ఎస్ తిరిగి మామూలు స్థితికి చేరుకుంది. అయితే మరో 12 నిమిషాల పాటు భ్రమణం అలాగే కొనసాగి ఉంటే ఐఎస్‌ఎస్ పూర్తిగా వ్యతిరేక దిశకు చేరుకుని ఉండేదని నాసా వర్గాలు తెలిపాయి. కానీ ఈ కారణంగా నాసా స్పేస్ సెంటర్‌కు పంపదలచుకున్న బోయింగ్‌కు చెందిన సిఎస్‌టి100 స్టార్‌లైనర్ క్యాప్సూల్ ప్రయోగాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకోవలసి వచ్చింది. శుక్రవారం ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌నుంచి అట్లాస్ వి రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించాల్సి ఉండింది.

ఐఎస్‌ఎస్ నిర్దేశిత దశ, స్థితిలో లేకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దానిపై ఉండే సౌర ఫలకాలు( సోలార్ ప్యానెల్స్)నిత్యం సూర్యుడికి అభిముఖంగా ఉండే విధంగా ఐఎస్‌ఎస్ దిశ మారుతుంది. ఒక వేళ సూర్యుడి కిరణాలు సోలార్ ప్యానెల్స్‌పై పడకపోతే ఐఎస్‌ఎస్‌లోని ఇంధన వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా కేంద్రంలోని కొన్ని వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది. గురువారం కొన్ని నిమిషాల పాటు వ్యోమగాములనుంచి గ్రైండ్ కంట్రోల్ సిస్టంకు సమాచార మార్పిడి ఆగిపోయింది. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ఏడుగురు వ్యోమగాములున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News