Friday, May 10, 2024

జోరు మీదున్న ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

జోరు మీదున్న ఢిల్లీ.. నేడు చెన్నైతో ఢీ

దుబాయి: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైన చెన్నైకి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. రాజస్థాన్‌పై చేజేతులా ఓడడంతో ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రాజస్థాన్‌పై గెలవడం ద్వారా విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాలనే పట్టుదలతో ధోనీ ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెన్నై చాలా బలంగా ఉంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి విజయం అందుకుంది. ఇక రాజస్థాన్‌తో కూడా చివరి వరకు పోరాడి ఓడింది. భారీ లక్షం ముందున్న చివరి వరకు అసాధారణ ఆటతో ఆకట్టుకుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో కూడా ఒక్క డుప్లెసిస్ మాత్రమే నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. తొలి మ్యాచ్‌లో రాణించిన రాయుడిని రెండో మ్యాచ్‌కు దూరంగా ఉంచారు. ఈసారైన రాయుడును ఆడిస్తారా లేదా అనేది తేలలేదు. ఇక, ఓపెనర్లు మురళీ విజయ్, షేన్ వాట్సన్‌లు భారీ స్కోర్లను సాధించలేక పోతున్నారు. ఈసారైన వీరిద్దరూ మెరుగైన ఆటను కనబరచక తప్పదు. మరోవైపు కెప్టెన్ ధోనీ కూడా రాజస్థాన్‌పై పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. చివరి ఓవర్‌లో తప్ప మ్యాచ్ మొత్తంలో డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు.

ఈసారి ధోనీ తన బ్యాటింగ్ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇక, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శామ్ కరన్ తదితరులు కూడా మరింత మెరుగ్గా ఆడక తప్పదు. ఇక తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై చిరస్మరణీయ విజయం సాధించిన ఢిల్లీ రెండో గెలుపుపై కన్నేసింది. ఈసారి కూడా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే తొలి మ్యాచ్‌లో ధావన్, పృథ్వీషాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు కూడా స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యారు. చివర్లో స్టోయినిస్ మెరుపులు మెరిపించడం వల్లే ఢిల్లీ మెరుగైన స్కోరును సాధించగలిగింది. ఈసారైన బ్యాట్స్‌మెన్ తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. సమష్టిగా రాణిస్తే చెన్నైను ఓడించడం ఢిల్లీకి అసాధ్యమేమి కాదు.

IPL 2020: DC vs CSK Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News