Tuesday, May 7, 2024

హైదరాబాద్‌కు చావో రేవో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌కు చావో రేవో

గెలిస్తేనే ముందుకు, నేడు ముంబైతో కీలక పోరు

IPL 2020: SRH vs MI Match 2020 Tomorrow

షార్జా: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ తుది అంకానికి చేరుకుంది. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తోంది. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ప్లేఆఫ్ బెర్త్‌ను సాధించింది. ఇక సోమవారం బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో మరో ప్లేఆఫ్ బెర్త్ ఖరారవుతోంది. అయితే హైదరాబాద్, కోల్‌కతాలతో పాటు సోమవారం ఓడే జట్టు ప్లే ఆఫ్ భవితవ్యం ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాతే తేలుతుంది. దీంతో అందరి దృష్టి ముంబైసన్‌రైజర్స్ మ్యాచ్‌పైనే నిలిచింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇప్పటికే ప్లస్ రన్‌రేట్ కలిగిన సన్‌రైజర్స్ ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లేఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి. ముంబైకి ఈ మ్యాచ్‌లో ఓడినా వచ్చే నష్టమేమి ఉండదు. ఇప్పటికే ముంబైకి అగ్రస్థానం సొంతమైంది. అయితే హైదరాబాద్‌కు మాత్రం ఆఖరి మ్యాచ్ చావోరేవోగా మారింది. ఇందులో ఓడితే డేవిడ్ వార్నర్ సేన ఇంటిదారి పడుతోంది. అప్పుడూ కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు జట్లు నేరుగా ప్లేఆఫ్‌కు చేరుకుంటాయి. ఇప్పటికే ఈ జట్లు 14 పాయింట్లతో హైదరాబాద్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. సన్‌రైజర్స్ ఓటమి పాలైతే మాత్రం 12 పాయింట్లకే పరిమితమై టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తోంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసం సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి నాకౌట్‌కు దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వార్నర్ సేన బలంగానే కనిపిస్తోంది. అయితే నిలకడలేమి జట్టుకు ప్రధాన సమస్యగా తయారైంది.
వార్నర్‌పైనే ఆశలు..
ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అవకాశాలన్నీ కెప్టెన్ వార్నర్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఆడడంలో విఫలమైన వార్నర్ కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా, మరో స్టార్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను ఈ మ్యాచ్ లో ఆడిస్తారా లేదా అనేది సందేహంగా మారింది. అతని బదులు జాసన్ హోల్డర్‌ను ఆడించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. కేన్ విలియమ్సన్ కూడా జట్టు చాలా కీలకంగా మారా డు. గతంతో పోల్చితే ఈసారి విలియమ్సన్ పెద్దగా రాణించలేదనే చెప్పొ చ్చు. ఈ మ్యాచ్‌లో మాత్రం జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక మనీష్ పాండే అద్భుత ఫామ్‌లో ఉండడం జట్టుకు పెద్ద ఊరటనిచ్చే అంశమే. నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్న మనీష్ ఈసారి కూడా అదే జోరును కనబరిచేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు సీనియర్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా ఆడిన రెండు మ్యాచుల్లోనూ మెరుపులు మెరిపించాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. బౌలింగ్‌లో మాత్రం సన్‌రైజర్స్‌కు ఎదురే లేదు. సందీప్ శర్మ, నటరాజన్, హోల్డర్, రషీద్ ఖాన్ తదితరులతో బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. ఈ సీజన్‌లో నిలకడగా రాణించిన బౌలర్లు ఆఖరి మ్యాచ్‌లోనూ సత్తా చాటితే ముంబైని తక్కువ స్కోరుకు పరిమితం చేయడం సన్‌రైజర్స్ కష్టమేమి కాదు.


ఎదురే లేదు..
మరోవైపు ముంబై ఇప్పటికే 9 విజయాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పదో గెలుపును ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబైకి ఎదురు లేదనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, పొలార్డ్, తివారి, కృనాల్, హార్దిక్, పొలార్డ్ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, బౌల్ట్, రాహుల్, కౌల్టర్ నైల్, పాటిన్సన్, కృనాల్ పాండ్యలతో బౌలింగ్ కూడా మెరుగ్గా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ముంబైని ఓడించాలంటే హైదరాబాద్ సమష్టిగా రాణించాల్సిం దే. లేకుంటే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం.

IPL 2020: SRH vs MI Match 2020 Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News