Monday, April 29, 2024

ఈసారి ఐపిఎల్ సవాలు వంటిదే!

- Advertisement -
- Advertisement -

ఈసారి ఐపిఎల్ సవాలు వంటిదే!

ముంబై: కరోనా భయంతో ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ వేదికను యుఎఇకి మార్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే గతంతో పోల్చితే ఈసారి టోర్నమెంట్‌ను నిర్వహించడం భారత క్రికెట్ బోర్డుకు సవాలుగా తయారైంది. కరోనా మహమ్మరి ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి ఆటంకం లేకుండా ఓ పెద్ద టోర్నీని సాఫీగా నిర్వహించడం అనుకున్నంత తేలికకాదు. గతానికి భిన్నంగా ప్రస్తుతం పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐపిఎల్ వంటి అతి పెద్ద క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతంగా ముగించడం బిసిసిఐకి పరీక్షగా తయారైంది. దీనికి తోడు ఈసారి టోర్నీ స్వదేశంలో కాకుండా విదేశాల్లో నిర్వహించాల్సి ఉంది. ఇది కూడా పెద్ద సమస్యగా తయారైంది.

సుదీర్ఘ రోజుల పాటు సాగే ఐపిఎల్‌ను జయప్రదం చేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అయితే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగుతుందనే నమ్మకంతో బిసిసిఐ పెద్దలు ఉన్నారు. బయట ఇలాంటి ప్రకటనలు చేస్తున్నా బిసిసిఐ అధికారుల్లో మాత్రం ఏదో ఒక భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన విదేశీ క్రికెటర్లు పాల్గొననున్నారు. వారందరికి పూర్తి ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత బిసిసిఐపై ఉంది. కరోనా మహమ్మరి నివారణకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు. ఒక వేళ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండి ఉంటే టోర్నీని సజావుగా నిర్వహించడం కష్టం అయ్యేది కాదు. కానీ కరోనా వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఒక రకమైన భయం ఏర్పడింది. నెలలు గడుస్తున్నా మహమ్మరి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఇలాంటి స్థితిలో ఇప్పటికీ పలు దేశాల్లో ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపిఎల్‌లో పాల్గొంటారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.

కరోనా భయం వెంటాడుతున్న పరిస్థితుల్లో చాలా మంది క్రికెటర్లు ఐపిఎల్‌లో ఆడేందుకు సందేహిస్తున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టోర్నీకి దూరంగా ఉండడమే మంచిదనే నిర్ణయంతో చాలా మంది స్టార్లు ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఈసారి ఐపిఎల్‌కు ఆదరణ లభించడం చాలా కష్టం. ఇప్పటికే ఖాళీ స్టేడియాల్లో టోర్నీని నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులు లేకుండా సాగే టోర్నీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చెప్పడం కష్టంగా తయారైంది. కేవలం టివిల్లో చూసే వారిని నమ్ముకూనే ఈసారి ఐపిఎల్‌ను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఐపిఎల్ ప్రధాన స్పాన్సర్ వివో అర్ధాంతరంగా తప్పుకోవడం కూడా టోర్నీ నిర్వహణపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఐపిఎల్ నిర్వహిస్తుండడంతో బిసిసిఐపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగింది. మరోవైపు ప్రధాన స్పాన్సర్ వైదొలగడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. ఒకవైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు క్రికెటర్ల భద్రత, వసతి తదితర అంశాలు ఈసారి కీలకంగా తయారయ్యాయి. పలు సవాళ్ల మధ్య జరుగుతున్న ఐపిఎల్ ఎంత వరకు విజయవంత మవుతుందో వేచి చూడాల్సిందే.

IPL 2020 to Start from September 19 in UAE

అధికారిక ఉత్తర్వులు అందాయి
మరోవైపు ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి తమకు అధికారిక ఉత్తర్వులు అందాయని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఇసిబి) వెల్లడించింది. తమపై నమ్మకంతో ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించిన భారత క్రికెట్ బోర్డుకు ఇసిబి కృతజ్ఞతలు తెలిపింది. టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బోర్డు అధికారులు తెలిపారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఐపిఎల్‌ను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం, బిసిసిఐ నుంచి అధికారిక ఉత్తర్వులు అందడంతో ఏర్పాట్లను మరింత వేగవంతం చేస్తామని బోర్డు అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో టోర్నీని సాఫీగా నిర్వహించడం తమ ముందున్న అతి పెద్ద సవాలని ఆ అధికారులు పేర్కొన్నారు. అయితే పకడ్బంధీ వ్యూహంతో టోర్నీని విజయవంతంగా నిర్వహించేదుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. టోర్నీలో పాల్గొనే క్రికెటర్లు, ఫ్రాంచైజీ ప్రతినిధులు, అధికారులు, సహాయక సిబ్బంది భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. బిసిసిఐ అధికారుల సహాయ సహకారాలతో ఐపిఎల్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహించడమే తమ ఏకైక లక్షమని బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పటికే టోర్నీ నిర్వహణకు సంబంధించి ఓ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశామని, బిసిసిఐ అధికారులతో చర్చించిన తర్వాత దానికి తుది రైపం ఇస్తామని వివరించారు. ఇక తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు శాయశక్తుల కృషి చేస్తామని ఇసిబి అధికారులు పేర్కొన్నారు.

IPL 2020 to Start from September 19 in UAE

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News