Friday, May 3, 2024

చెన్నైకి తొలి గెలుపు

- Advertisement -
- Advertisement -

దీపక్ మాయ, మొయిన్ మెరుపులు.. చెన్నైకి తొలి గెలుపు
పంజాబ్‌పై సిఎస్‌కె జయకేతనం

ముంబై: ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) తొలి విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 15.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ డుప్లెసిస్ 33 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 36 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మరోవైపు ధాటిగా ఆడిన మొయిన్ అలీ 31 బంతుల్లోనే ఏడు ఫోర్లు, సిక్స్‌తో 46 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.
దీపక్ దెబ్బకు విలవిల..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను దీపక్ చాహర్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కొద్ది సేపటికే కెప్టెన్ కెఎల్. రాహుల్(5) కూడా ఔటయ్యాడు. రవీంద్ర జడేజా అద్భుత ఫీల్డింగ్ విన్యాసానికి రాహుల్ రనౌటయ్యాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ కూడా నిరాశ పరిచాడు. రెండు ఫోర్లతో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే నికోలస్ పూరన్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. పూరన్ సున్నాకే వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు కూడా దీపక్ ఖాతాలోకే వెళ్లాయి. కొద్ది సేపటికే దీపక్ హుడా(15) కూడా ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా దీపక్‌కే దక్కింది. దీంతో పంజాబ్ 26 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.
షారుఖ్ ఒంటరి పోరాటం..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను యువ ఆటగాడు షారుఖ్ ఖాన్ తనపై వేసుకున్నాడు. చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. అతనికి జై రిచర్డ్‌సన్ అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. రిచర్డ్‌సన్ రెండు ఫోర్లతో 15 పరుగులు చేసి మొయిన్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన షారుఖ్ ఖాన్ 36 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో పంజాబ్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 106 పరుగులకు చేరింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

IPL 2021: CSK Win by 6 wickets against PBKS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News