Monday, April 29, 2024

సన్‌రైజర్స్ ప్లేఆఫ్‌కు చేరడం కష్టమే!

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి పెను ప్రకంపనలు సృష్టించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత పరాజయాల బాట పట్టింది. చివరగా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కిందటి పోరులో హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పేలవమైన ప్రదర్శనే సన్‌రైజర్స్ వరుస ఓటములకు ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ పూర్తిగా తేలిపోయాడని వారు పేర్కొంటున్నారు. లక్నో, రాజస్థాన్, గుజరాత్ తదితర జట్ల కెప్టెన్లు జట్లను ముందుండి నడిపిస్తున్నారు. విలియమ్సన్ మాత్రం అలాంటి ప్రదర్శన చేయలేక పోతున్నాడు. ఇక కోట్లాది రూపాయలు వెచ్చించి సొంతం చేసుకున్న పూరన్, వాషింగ్టన్, త్రిపాఠి తదితరులు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. త్రిపాఠి బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే తర్వాతి మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. ఓపెనర్ అభిషేక్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మార్‌క్రామ్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేయలేక పోతున్నాడు. ఇది కూడా హైదరాబాద్ వరుస ఓటములకు ప్రధాన కారణంగా చెప్పాలి.
నాకౌట్ బెర్త్ సులువేమీ కాదు..
వరుస ఓటముల నేపథ్యంలో హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం ఐదింటిలో మాత్రమే విజయం సాధించింది. మరో ఆరింటిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇప్పటికే గుజరాత్, లక్నో, రాజస్థాన్ జట్లు ప్లేఆఫ్ బెర్త్‌లను దాదాపు సొంతం చేసుకున్నాయి. మిగిలిన స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. హైదరాబాద్‌తో పోల్చితే బెంగళూరుకు నాకౌట్ అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరు ఏడు విజయాలు సాధించింది. ఇలాంటి స్థితిలో బెంగళూరును వెనక్కినెట్టి హైదరాబాద్ నాకౌట్‌కు చేరుకోవడం చాలా క్లిష్టమైన అంశమే. మిగిలిన మూడు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవడమే కాకుండా బెంగళూరు చివరి రెండు మ్యాచుల్లో ఓటమి పాలు కావాలి. అప్పుడే హైదరాబాద్‌కు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం హైదరాబాద్ ఆటను గమనిస్తే అది సాధ్యం కావడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఈసారి సన్‌రైజర్స్ లీగ్ దశలోనే ఇంటిదారిపట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

IPL 2022: SRH no chances for playoff

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News