Friday, April 26, 2024

వేర్వేరు డోసులు వేసుకున్న జర్మనీ, ఇటలీ అధినేతలు

- Advertisement -
- Advertisement -

బెర్లిన్/రోమ్: కరోనా వైరస్ వ్యాక్సిన్ల మిక్సింగ్ ఐరోపా దేశాల్లో సాధారణమైంది. టీకాల కొరతను అధిగమించడానికి రెండు వేర్వేరు టీకా డోసులను తీసుకోవచ్చా? అనే కోణంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్(66) మొదటి విడతలో ఆస్ట్రాజెనెకా టీకా తీసుకోగా, రెండో విడతలో మోడెర్నా టీకా తీసుకున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగ్(73) కూడా ఏంజెలా మెర్కెల్ బాట లోనే నడిచారు. మొదటి డోసు ఆస్ట్రాజెనెకా తీసుకోగా, రెండో విడతలో ఫైజర్ టీకాను వేసుకున్నారు. ఆస్ట్రాజెనెకా వల్ల రక్తం గడ్డ కడుతోందని చాలా ఐరోపా దేశాలు ఈ వ్యాక్సిన్‌ను తాత్కాలికంగా నిషేధించారు. జర్మనీ కూడా 60 ఏళ్లు పైబడిన వారికే ఈ వ్యాక్సిన్‌ను పరిమితం చేసింది. ఆ తరువాత కొన్నాళ్లకు మళ్లీ పూర్తి స్థాయిలో ఈ టీకాను ఇస్తున్నారు. ఇక తొలి డోసు ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారు రెండో డోసుగా మరో టీకాను తీసుకోవచ్చని జర్మనీ ప్రకటించింది. ఇటలీ ప్రధాని మారియో మొదటి డోసు ఆస్ట్రాజెనెకా టీకాను తీసుకున్న తరువాత తక్కువ సంఖ్యలో యాంటీబాడీలు అభివృద్ధి కావడం కనిపించగా, రెండోడోసు ఫైజర్ టీకాను వేసుకున్నారు. పలు దేశాల్లో టీకా ప్రక్రియ ముమ్మరం కావడంతో టీకాలకు డిమాండ్ పెరుగుతోంది.

అయితే దీనికి తగ్గట్టు టీకాలు అందుబాటులో లేక పోవడంతో చాలా దేశాలు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఒకే వ్యక్తి రెండు వేర్వేరు డోసులు తీసుకోవచ్చా? అనే కోణంలో పరిశోధనలు సాగించారు. వేర్వేరు డోసులు తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ దుష్ప్రభావాల వల్ల ప్రమాదం మాత్రం లేదని సూచిస్తున్నారు. కొన్ని దేశాల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా రూపొందుతున్నట్టు స్పష్టమైంది. యాంటీబాడీలు, కరోనా సోకిన కణాలను చంపే తెల్లరక్త కణాలు అత్యధిక స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొత్త వేరియంట్లపై వేర్వేరు డోసులు బాగానే పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఇప్పటికే ఒక టీకా డోసు ఇచ్చి కొరత వల్ల రెండో డోసు ఇవ్వలేక పోయిన దేశాలకు ఇదో అవకాశమని పేర్కొంది.

Italy PM take different vaccine doses

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News