Monday, April 29, 2024

చెమటోడ్చిన జకోవిచ్

- Advertisement -
- Advertisement -

క్వార్టర్స్‌లో జ్వరేవ్, గాఫ్
స్టీఫెన్స్, కెనిన్ ఔట్
ఫ్రెంచ్ ఓపెన్


పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ప్రీక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు 17వ సీడ్ మారియా సక్కారి (గ్రీస్), 24వ సీడ్ కొకొ గాఫ్ (అమెరికా), బార్బొరా క్రెజికొవా (చెక్) క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. పురుషుల విభాగంలో పదో సీడ్ డిగో షావర్ట్‌మాన్ (అర్జెంటీనా), తొమ్మిదో సీడ్ బెర్రిటెని (ఇటలీ) ప్రీక్వార్టర్ ఫైనల్లో విజయం సాధించారు. కాగా, 8వ సీడ్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) గాయం వల్ల టోర్నమెంట్ మధ్యలోనే నిష్క్రమించాడు.

గట్టెక్కిన నొవాక్

పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు నొవాక్ జకోవిచ్ చెమటోడ్చి విజయం సాధించాడు. ఇటలీ ఆటగాడు లొరెన్జొ ముసెట్టితో జరిగిన పోరులో జకోవిచ్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆరంభం నుంచి పోరు ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో జకోవిచ్‌కు ప్రత్యర్థి ముచ్చెమటలు పట్టించాడు. లొరెన్జొ అద్భుత షాట్లతో చెలరేగి పోవడంతో జకోవిచ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇదే క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన లొరెన్జొ తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక రెండో సెట్‌లో కూడా జకోవిచ్‌కు తీవ్ర పోటీ తప్పలేదు. ఈసారి కూడా పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులోనూ లొరెన్జొ పైచేయి సాధించాడు. వరుసగా రెండో సెట్‌ను కూడా అతను సొంతం చేసుకున్నాడు. కానీ తర్వాతి సెట్‌లో జకోవిచ్ పుంజుకున్నాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ లక్షం వైపు అడుగులు వేశాడు.

ఇదే క్రమంలో అలవోకగా మూడో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో కూడా నొవాక్ దూకుడును ప్రదర్శించాడు. ఇదే క్రమంలో 40 ఆధిక్యాన్ని అందుకున్నాడు. ఈ దశలో ప్రత్యర్థి లొరెన్జొ గాయానికి గురయ్యాడు. ఆట నుంచి తప్పుకోవడంతో జకోవిచ్‌కు విజయం వరించింది. తొలి రెండు సెట్లలో జకోవిచ్‌కు గట్టి పోటీ ఇచ్చినా లొరొన్జొ తర్వాత చేతులెత్తేశాడు. ఇక అసాధారణ పోరాట పటిమతో పుంజుకున్న జకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరో మ్యాచ్‌లో డిగో షావర్ట్‌మన్ విజయం సాధించాడు. జర్మనీ ఆటగాడు స్ట్రాఫ్‌తో జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో డిగో 76, 64, 61తో జయకేతనం ఎగుర వేశాడు. మరోవైపు ఆరో సీడ్ జ్వరేవ్ అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. జపాన్ ఆటగాడు నిషికోరితో జరిగిన పోరులో జ్వరేవ్ 64, 61, 61తో జయభేరి మోగించాడు. ఇక ఫెదరర్‌తో జరిగిన పోరులో ఇటలీ ఆటగాడు బెర్రిటెనికి వాకోవర్ లభించింది. దీంతో అతను బరిలోకి దిగకుండానే క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.

కెనిన్‌కి షాక్..

మహిళల సింగిల్స్‌లో మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి వైదొలిగింది. నాలుగో సీడ్ సోఫియా కెనిన్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో గ్రీస్ క్రీడాకారిణి సక్కారి 61, 63తో కెనిన్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్కు చేరింది. మరో మ్యాచ్‌లో గాఫ్ విజయం సాధించింది. ట్యూనీషియా క్రీడాకారి జాబియుర్‌తో జరిగిన నాలుగో రౌండ్‌లో గాఫ్ 63, 61తో జయకేతనం ఎగుర వేసింది. మరోవైపు క్రెజికొవా 62, 60తో స్లొవానె స్టీఫెన్స్ ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News