Friday, May 3, 2024

మూడు దశాబ్దాల ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’

- Advertisement -
- Advertisement -

Chiranjeevi

 

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, కె.రాఘవేంద్రరావు, సి.అశ్వనీదత్ కలయికలో వచ్చిన ’జగదేకవీరుడు అతిలోకసుందరి’ అప్పట్లో సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాతో శ్రీదేవి అతిలోకసుందరిగా మారిపోయింది. ఈ విజువల్ వండర్ 1990 మే 9న విడుదలైంది. దీంతో ’జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా మే 9వ తేదీతో 30 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మూడు తెలియని విషయాలను అభిమానులతో పంచుకోనున్నట్టు నిర్మాత అయిన వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్వినీదత్ ట్విట్టర్‌లో తెలిపారు. అందులో మొదటి స్టోరీని నాని వాయిస్ ఓవర్‌తో వింటేజ్ వైజయంతి వీడియోను విడుదల చేశారు. బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి. కానీ తరాలు మారినా ఎవర్‌గ్రీన్ బ్లాక్‌బస్టర్ సినిమా లిస్టులో ఉండే మొదటి సినిమా ’జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఓ సినిమాను చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్ర కథ ఎలా పుట్టింది అంటూ నాని ఆ విషయాలను పంచుకున్నారు.

అశ్వినీదత్‌కి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ‘జగదేకవీరుని కథ’ లాంటి ఫాంటసీ కథను చిరంజీవితో చేయాలనే కోరిక ఉండేదట. అది కూడా తను ఎంతో ప్రేమగా బావ అని పిలిచే రాఘవేంద్రరావు మాత్రమే తీయగలరనే గట్టి నమ్మకం ఆయనకు ఉండేదట. అక్కినేని నాగార్జున, – శ్రీదేవిలతో ‘ఆఖరి పోరాటం’ చేసిన తర్వాత చిరంజీవితో సినిమా చేయాలనుకున్నారు అశ్వనీదత్. అయితే అశ్వనీదత్ తన స్నేహితుడైన అయిన కో డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి, రాఘవేంద్రరావుతో కలిసి తిరుపతికి వెళ్లారు. సరిగ్గా తిరుమల కొండపై ఉండగా అశ్వనీదత్ మనసు తెలిసిన శ్రీనివాస చక్రవర్తి… దేవకన్య భూమిపైకి వచ్చినపుడు ఆమె ఉంగరం పోగొట్టుకుంటుంది, అది హీరోకు దొరుకుతుంది…అని కొంచెం ఊహాజనితంగా ఈ సినిమా కథ ముఖ్య పాయింట్ చెప్పారు. అది రాఘవేంద్రరావుకు బాగా నచ్చింది. ఈ స్టోరీని అశ్వనీదత్ విని ఓకే చేశారు. ఆ తర్వాత మరి జగదేక వీరుడికి జోడిగా అతిలోకసుందరి ఎవరు అని ఆలోచించగా… అందరి మదిలో శ్రీదేవి పేరు వినిపించింది. చివరికి వైజయంతి మూవీస్ ఆస్థాన కథానాయిక శ్రీదేవిని ఈ సినిమా కోసం ఫైనల్ చేశారు.

ఈ చిత్ర కథకు ఒక రూపం ఇవ్వడానికి రాఘవేంద్రరావు, జంధ్యాల, – యండమూరి వీరేంద్రనాథ్, – సత్యమూర్తి , విజయేంద్ర ప్రసాద్, – క్రేజీ మోహన్ వంటి చాలా మంది రచయితలు కలిసి పనిచేశారు. వారితో కలిసి చిరంజీవి కూడా కథా చర్చల్లో పాల్గొన్నారు. ఇక దేవకన్యగా అతిలోకసుందరిని చూపిస్తున్నపుడు నేను కొంచెం మాసిన గడ్డంతో ఉంటే బాగుంటుంది కదా అనే సలహాను కూడా ఇచ్చారట చిరంజీవి. దీంతో సామాన్య ప్రేక్షకులు కథతో కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు. మరోవైపు శ్రీదేవి ఈ సినిమాలో తన కాస్టూమ్స్ తానే కుట్టించుకోవడం మొదలుపెట్టారట. అలా అందరూ కలిసి ఈ చందమామ కథకు అందమైన రూపు ఇచ్చారు. అలా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ చిత్రం క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ కథ వెనక ఉన్న రెండో స్టోరీ గురువారం సినీ ప్రేక్షకులకు ముందుకు రానుందని చెప్పుకొచ్చారు నేచురల్ స్టార్ నాని.

Jagadekavirude Athiloka Sundari will complete 30 yrs
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News