Saturday, April 27, 2024

రాజీలేని పోరాట వీరుడు జైనీ మల్లయ్య గుప్తా

- Advertisement -
- Advertisement -

నిజాం రాచరిక వ్యవస్థతో, గ్రామీణ భూస్వామ్య నిరంకుశత్వంతో రాజీలేని పోరాటం చేసిన జైనీ మల్లయ్య గుప్తా తెలంగాణ ప్రజల విప్లవ చైతన్యానికి అసలైన ప్రతీక. నిజాం ప్రభుత్వం ఆయనను ఆయన మిత్రులను జైల్లో వుంచగా నేర్పుగా బయటకు వచ్చారు. సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులతో కలిసి పని చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి ప్రాంతానికి చెందిన జైనీ మల్లయ్య భువనగిరి పట్టణంలో 1926 అక్టోబర్ 11వ తేదీన లక్ష్మమ్మ, నారాయణలకు జన్మించారు. నలుగురు కుమారులు రమేష్, రవీందర్, మధు సూదన్, ప్రకాశ్, ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఆయన సతీమణి సునంద పదేళ్ళ కింద మరణించారు. ఇంట్లో చెప్పకుండా 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు బొంబాయికి వెళ్లారు. 1943లో ఆరుట్ల లక్ష్మీ నరసింహా రెడ్డి సారథ్యంలో మిత్ర మండలి ప్రారంభించారు.

రావి నారాయణ రెడ్డి నేతృత్వంలో నిజాం రాచరిక వ్యవస్థకు, గ్రామీణ భూస్వామ్య దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా సాగిన మహోద్యమంలో మల్లయ్య గుప్తా పాల్గొన్నారు. 1944 లో భువనగిరిలో నిర్వహించిన 11వ ఆంధ్ర మహాసభకు జైనీ మల్లయ్యతో పాటు భువనగిరిలో పిండెం వాసదేవ్, ముత్యం ప్రకాశ్ తదితరులతో కలిసి మహాసభ ఏర్పాట్లకు సారథ్యం వహించారు. 1946 అక్టోబర్‌లో నిజాం ప్రభుత్వం జైనీ మల్లయ్యతో పాటు మిత్ర మండలి సభ్యులను అరెస్టు చేయడంతో చంచల్ గుడా, జాల్నా జైల్లో శిక్షలు అనుభవించారు. కొంత కాలం అనంతరం జైలు నుంచి 1948లో చాకచక్యంగా తప్పించుకొని అజ్ఞాతంలో ఉండి పోరాటం కొనసాగించారు.

ఆయనను పట్టించిన వారికి ఇనాం ఇస్తామని కూడా ప్రకటించారు. ఆ తరువాత పోరాటాల కాలంలో రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, కమలాదేవి తదితరులతో, అనంతరం కమ్యూనిస్టు పార్టీతో కలిసి పని చేశారు. తెలంగాణ విమోచనం అనంతరం రాజకీయాలలో చేరి 1962లో భువనగిరి పురపాలక సంఘానికి తొలి వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. మొదటి నుంచి ఆయనకు సాహిత్యం, గ్రంథాలయోద్యం పట్ల మక్కువ ఎక్కువ. అనేక గ్రంథాలయాల ఏర్పాటుకు ఆయన తోడ్పాటును అందించారు. భువనగిరి పట్టణ సాహిత్య, సమాజిక కార్యక్రమాల్లో అగ్ర భాగాన నడిచిన వ్యక్తి. ఉర్దూ భాషా ప్రేమికుడు. ప్రజాస్వామిక విలువల కోసం పాటు పడిన వ్యక్తి. అలాగే హిందూ, ముస్లిం ఐక్యత, సమగ్రత కోసం కృషి చేశారు. తెలంగాణ అమర వీరుల స్మారక ట్రస్టు సభ్యులుగా కూడా ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. తుది శ్వాస వరకు సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News