Friday, April 26, 2024

సుప్రీంకోర్టును మూసేద్దామా?

- Advertisement -
- Advertisement -

supreme-court

న్యూఢిల్లీ: దేశంలో వ్యవస్థల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఎజిఆర్) కింద బకాయి పడిన దాదాపు రూ. 1.5 లక్ష కోట్ల మేర మొత్తాన్ని చెల్లించని వొడాఫోన్, ఎయిర్‌టెల్ సహా వివిధ టెలికం కంపెనీల ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ కింద షోకాజ్ నోటీసులు జారీచేసింది. 2019 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు బకాయిలు చెల్లించని టెలికం కంపెనీలను సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా మందలించింది. ఈ తీర్పు మేరకు వొడాఫోన్ ఐడియా రూ. 50,000 కోట్లు, భారతి ఎయిర్‌టెల్ రూ. 35,586 కోట్లు టెలికం డిపార్ట్‌మెంట్(డిఓటి)కు చెల్లించవలసి ఉంది.

జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం టెలికం కంపెనీల సిఎండిలు, ఎండిలను మార్చి 17న రోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులను పాటించడానికి ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. కోర్టు ఉత్తర్వులను పాటించకపోతే తగిన మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని కూడా టెలికం కంపెనీల ఉన్నతాధికారులను కోర్టు హెచ్చరించింది. అన్ని రకాల అవినీతి అంతం కావాలని, ఇదే చివరి అవకాశం, చివరి హెచ్చరికని న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా చెప్పారు. గత ఏడాది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసిన డిఓటి అధికారిపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది.

ఆ అధికారికి కోర్టు ధిక్కరణ నేరం కింద నోటీసు జారీచేసిన ధర్మాసనం తన చర్యపై సంజాయిషీ ఇచ్చుకోవడానికి కోర్టు ఎదుటకు రావాలని ఆ అధికారికి కోర్టు సమన్లు జారీచేసింది. డిఓటి అధికారి ఇచ్చిన ఉత్తర్వును ఈ రోజు సాయంత్రానికల్లా ఉపసంహరించాలని, లేని పక్షంలో అతడు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం తెలియచేసింది. సుప్రీంకోర్టును మూసేద్దామా? దేశంలో చట్టాలు ఏమైనా ఉన్నాయా? సుప్రీంకోర్టు తీర్పును ఒక ప్రభుత్వ అధికారి ఎలా నిలిపివేస్తారు? అతనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? అంటూ జస్టిస్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయాన్ని తాను పరిశీలిస్తానని సొలిసిటర్ జనరల్ చెప్పగా జస్టిస్ మిశ్రా మండిపడుతూ ఆ అధికారి చర్యపై ఇక మాట్లాడాల్సింది ఏదీ లేదంటూ వ్యాఖ్యానించారు.

ఇదంతా ధనబలం చూసుకునే కదా? ఈ చర్యల వెనుక ఉన్నది ఎవరు? ఎవరి కోసం ఆ అధికారి ఆ పని చేశారు? బకాయిలు చెల్లించడానికి ఇష్టపడని వారితో ఆ అధికారి చేతులు కలిపారని అనుకోవాలా? ఆ అధికారిపై కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపడుతున్నాము అని జస్టిస్ మిశ్రా తేల్చిచెప్పారు. దేశంలో జరుగుతున్న పరిణామాలతో మా మనస్సాక్షి కంపిస్తోందని, ఈ పరిణామాల కారణంగా ఈ వ్యవస్థలో కొనసాగాలని తాను భావించడం లేదని జస్టిస్ మిశ్రా అన్నారు. నా గురించి నాకు చింతలేదు..కాని వ్యవస్థకు ఏం జరుగుతోంది. జరుగుతున్నది చూస్తే దిగ్భ్రాంతి కలుగుతోంది. దీన్ని సరిచేయడానికి మేము చేయాల్సింది చేస్తాము అని జస్టిస్ మిశ్రా స్పష్టం చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఎస్‌ఎ నజీర్, ఎంఆర్ షా ఉన్నారు.

Judge thunders Should we wind up Supreme Court, Contempt notices issued to Higher officers of Telcos

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News