Sunday, May 12, 2024

తెలంగాణ హైకోర్టు సిజెగా జస్టిస్ సతీష్ శర్మ

- Advertisement -
- Advertisement -

Justice Satish Sharma as Telangana High Court CJ

తెలంగాణకు సతీశ్ శర్మ, ఎపికి ప్రశాంత్ కుమార్ మిశ్రా
ఒకేసారి 8 రాష్ట్రాల హైకోర్టుల సిజెల బదిలీకి సుప్రీం కొలీజియం సిఫార్సు

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారు చేసింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని వివిధ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌లుగా నియమించడం కోసం ఎనిమిది మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలియజేశాయి. తెలంగాణ హైకోర్టు సిజెగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, ఎపి హైకోర్టు సిజెగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించాలని కొలీజియం సూచించింది. తెలంగాణ హైకోర్టు సిజెగా పని చేసిన జస్టిస్ హిమా కోహ్లీసుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో తాత్కాలిక సిజెగా జస్టిస్ ఎంఎస్ రామచంద్ర రావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Justice Satish Sharma as Telangana High Court CJ

తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక సిజె ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి సిజెగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను నియమించేందుకు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, జస్టిస్ యువి లలిత్, జస్టిస్ ఎఎం ఖన్విల్కర్‌లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే ప్రస్తుతం ఎపి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ఎకె గోస్వామిని చత్తీస్‌గఢ్ హైకోర్టుకు బదిలీ చేసి ఆయన స్థానంలో చత్తీస్‌గఢ్ సిజె జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించాలని సిఫార్సు చేసింది. అలాగే ఐదుగురు సిజెలను, 28 మంది జడ్జిలను ఇతర హైకోర్టులకు బదిలీ చేయాలని కూడా కొలీజియం నిర్ణయించింది. అలహాబాద్, కలకత్తా, కర్నాటక, మేఘాలయ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల హైకోర్టు సిజెలుగా నియమించడానికి పేర్లను కూడా కొలీజియం సిఫార్సు చేసింది. కలకత్తా హైకోర్టు తాత్కాలిక సిజెగా ఉన్న జస్టిస్ రాజేశ్ బిందాల్‌ను అలహాబాద్ హైకోర్టు సిజెగా, త్రిపుర హైకోర్టు సిజె జస్టిస్ అకిల్ ఖురేషిని రాజస్థాన్ హైకోర్టు సిజెగా బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది.

అలాగే మధ్యప్రదేశ్ హైకోర్టు సిజె మహమ్మద్ రఫీక్‌ను హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సిజెగా, రాజస్థాన్ హైకోర్టు సిజె జస్టిస్ ఇంద్రజిత్ మహంతిని త్రిపుర హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా సూచించింది. జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవను కలకత్తా హైకోర్టు సిజెగా, రితురాజ్ అవస్థిని కర్నాటక హైకోర్టు సిజెగా నియమించాలని కూడా కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే జస్టిస్ రంజిత్ వి మోరేను మేఘాలయ హైకోర్టు సిజెగా, జస్టిస్ అరవింద్ కుమార్‌ను గుజరాత్ హైకోర్టు సిజెగా, జస్టిస్ ఆర్‌వి మాలిమఠ్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు సిజెగా నియమించాలని కూడా కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిషార్జు చేసింది. దేశవ్యాప్తంగా 12 హైకోర్టులకు జడ్జిలుగా నియమించడానికి 62 మంది పేర్లను ఇటీవల ఒకేసారి సిఫార్సు చేసి కొలీజియం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అంతకు ముందు సుప్రీంకోర్టు జడ్జిలుగా ఒకే సారి 9 మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేయడం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News