Monday, April 29, 2024

రాహుల్ మళ్లీ పాత కథే!

- Advertisement -
- Advertisement -

వరుస వైఫల్యాలతో సతమతం

K L Rahul failed in test series

లండన్: టీమిండియా యువ ఓపెనర్ కెఎల్. రాహుల్ మళ్లీ వైఫల్యాల బాటపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో బాగానే ఆడిన రాహుల్ ఆ తర్వాత మళ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో రాహుల్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మొదటి రెండు మ్యాచుల్లో రాహుల్ బ్యాటింగ్‌ను చూసిన వారు అతనికి తిరుగులేదని భావించారు. కానీ మూడో టెస్టు నుంచి రాహుల్ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక ఆరంభంలోనే వికెట్‌ను పారేసుకుంటున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. జట్టుకు అండగా నిలుస్తాడని భావించిన రాహుల్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. గతంలో కూడా ఇలాంటి ప్రదర్శన వల్లే టీమిండియాలో చోటు కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే బాటలో ప్రయాణిస్తున్నాడు. జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకడిగా రాహుల్‌ను పరిగణిస్తున్నారు. కానీ అతను మాత్రం తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నాడు. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో రాహుల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశ పరిచాడు. ఈసారి 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్‌ను పారేసుకున్నాడు. అంతేగాక గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులోనూ తేలిపోయాడు. ఈసారి కూడా భారీ స్కోరును సాధించడంలో వైఫల్యం చెందాడు. కేవలం 17 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇలా మూడు ఇన్నింగ్స్‌లలో రాహుల్ ఒక్కసారి కూడా 20 పరుగుల మైలురాయిని అందుకోక పోవడం గమనార్హం. యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రాహుల్ వంటి సీనియర్ వరుస వైఫల్యాలు చవిచూడడం అతని కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికైనా రాహుల్ తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోక తప్పదు. తొందరగా ఔటయ్యేందుకు గల కారణాలపై దృష్టి పెట్టాలి. బ్యాటింగ్ కోచ్‌తో పాటు రవిశాస్త్రి కూడా ఈ విషయంలో రాహుల్‌కు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే రాహుల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారినా ఆశ్చర్యం లేదు.
జట్టుపై ప్రభావం..
మరోవైపు రాహుల్ వైఫల్యం టీమిండియాను వెంటాడుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ వరుసగా విఫలం అవుతుండడంతో టీమిండియా భారీ స్కోర్లు సాధించలేక పోతోంది. ఇలాంటి స్థితిలో రాహుల్ తన లోపాలను సవరించుకుని బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో అతను ఎంత వరకు సఫలం అవుతాడనే దానిపైనే టీమిండియాలో స్థానం శాశ్వతం అవుతుంది. లేకుంటే అతనికి ఉద్వాసన పలికి మరో ఓపెనర్‌ను టెస్టుల్లో తీసుకునే అవకాశాలను కొట్టి పారేయలేం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News