Saturday, May 11, 2024

20 రోజుల క్రితం మునిగిన కారులో 3 మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

Kakatiya Canal

 

మృతులు ఎంఎల్‌ఎ దాసరి మనోహర్‌రెడ్డి సోదరి, బావ, వారి కూతురు వినయశ్రీ కాలువలో పడిపోయిన మహిళ కోసం గాలిస్తుండగా బయటపడిన కారు

తిమ్మాపూర్: మండలంలోని అల్గునూర్ గ్రామంలో గల కాకతీయ కాలువ ప్రమాదాలకు నెలవుగా మారింది. నెల వ్యవధిలోనే మూడుకు పైగా ప్రమాదాలు జరగ్గా దాదాపుగా ఆరుగురిని బలితీసుకుంది. ఆదివారం రాత్రి గల్లంతైన ఓ మహిళను వెతికేందుకు కాలువ గేట్లు మూయగా.. మర్నాడు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భావకు చెందిన కారు బయటకు తేలింది. అందులో ఎమ్మెల్యే చెల్లెలుతో పాటు ఆమె భర్త, కూతురు మృతదేహాలు లభ్యం కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

గల్లంతైన మహిళ కోసం వెతికితే..
గన్నేరువరం గ్రామానికి చెందిన పరాంకుశం వెంకట నారాయణ, అతడి భార్య కీర్తన ఇద్దరు కలిసి ఆదివారం రాత్రి తమ ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. కాకతీయ కాలువ దగ్గరికి చేరుకోగానే చిన్న చిన్న పురుగులు వెంకటనారాయణ కళ్లల్లో పడడంతో అతడి ద్విచక్ర వాహనం కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో భార్యభర్తలిద్దరూ కెనాల్ పడి కొట్టుకుపోతుండగా అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ సిబ్బంది వారిని గమనించి వెంకట నారాయణను కాపాడారు. అప్పటికే అతడి భార్య కీర్తన గల్లంతవ్వడంతో ఆమె ఆచూకీ తెలియలేదు. ఆమె కోసం వెతికేందుకని కెనాల్ గేట్లు మూయించగా అదేరోజు రాత్రి మానకొండూర్ మండలంలోని చెంజర్ల గ్రామ సమీపంలో కీర్తన మృతదేహం దొరికింది. అయితే కాలువలో గేట్లు తెరవకపోవడంతో దాదాపుగా 20రోజుల క్రితం నీటిలో మునిగిపోయిన కారు మర్నాడు ఉదయం బయటకు తేలింది.

మృతులంతా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బంధువులే..
కాలువలో కారును గమనించిన తిమ్మాపూర్ గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఎల్‌ఎండీ ఎస్‌ఐ నరేశ్ రెడ్డి బృందం క్రేన్ సాయంతో కారును బయటకు తీయగా అందులోంచి మూడు మృతదేహాలు బయటపడ్డాయి. కారు నీటిలో మునిగిపోవడంతో మృతదేహాలు ఉబ్బిపోయి గుర్తు పట్టకుండా మారగా, కారు నెంబర్ ఆధారంగా ఎస్‌ఐ వివరాలు సేకరించారు. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సొంత చెల్లెలు రాధిక, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, ఆమె కూతురు వినయ శ్రీగా గుర్తించారు. వీరంతా కరీంనగర్‌లోని బ్యాంకు కాలనీలో నివాసముంటున్నట్లు తెలిసింది.

మృతదేహాలను పరిశీలించిన కలెక్టర్, సీపీ, ఎమ్మెల్యేలు..
కాకతీయ కాలువలో కారు తేలిన విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రసమయి బాలకిషన్ వెంటనే కాలువ దగ్గరికి చేరుకున్నారు. కారులోంచి బయటకు తీసిన మృతదేహాలను పరిశీలించారు. అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, కరీంనగర్‌కు తరలించారు.

దాసరిని ఓదార్చిన ప్రజాప్రతినిధులు..
చెల్లెలు మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హుటాహుటిన కాలువ దగ్గరకు చేరుకొని కంటతడి పెట్టారు. అక్కడే ఉన్న కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తోపాటు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు మనోహర్ రెడ్డిని ఓదార్చారు.

20రోజులుగా కాలువలోనే..
కాకతీయ కాలువకు నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతుండడంతో నీటిలో మునిగిపోయిన కారు ఎవరికి కనపడకుండా ఉండిపోయింది. మృతదేహాలను పరిశీలిస్తే దాదాపు 15నుంచి 20రోజుల క్రితం కారు కాలువలో పడిపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే కారు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Kakatiya Canal is home to Dangers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News