Monday, April 29, 2024

ధాన్యం డబ్బులు కౌలు రైతుల ఖాతాల్లోకే

- Advertisement -
- Advertisement -

KCR government good news for tenant farmers

కొనుగోలు కేంద్రాల్లో స్వేచ్ఛగా
విక్రయించుకోవడానికి అవకాశం
కల్పించిన ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కౌలు రైతులకు కెసిఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. ధాన్యం విక్రయాల్లో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆ మేరకు దిద్దుబాటు చర్యలు తీసుకుంది. కౌలు రైతులు కూడా ఇక నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్వేచ్చగా విక్రయించుకునే అవకాశం కల్పించింది. విక్రయించిన ధాన్యానికి తగిన డబ్బును నేరుగా కౌలు రైతులకు చెందినబ్యాంకు ఖాతాలకే జమ చేయనుంది. ఈ మేరకు అవరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న ఆన్‌లైన్ విధానంలో మార్పులు చేయాలని ఆదేశించినట్టు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వున్న సాగు భూముల్లో అత్యధికశాతం కౌలు రైతులే సాగుచేస్తున్నారు. భూములు ఉన్న యజమానుల నుంచి కౌలుకు మాట్లాడుకొని ఆ భూముల్లో అత్యధికంగా సన్న చిన్నకారు రైతులే పంటలు వేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఉన్న ధాన్యం కొనుగోలు విధానంలో పంటలు పండించిన కౌలు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవటంలో సమస్యలు ఎదురవుతున్నాయి.

కౌలు రైతుకు తగిన ధృవపత్రాలు లేకపోవటంతో భూమి యజమాని ఇచ్చిన పట్టాదారు పాస్ బుక్ ,బ్యాంకు పాస్ బుక్ ఆధారంగా అన్‌లైన్‌లో ఉన్న వివరాల ప్రకారమే నేరుగా ధాన్యం విక్రయించిన డబ్బు వాటి భూయజమాని ఖాతాలోనే పడుతోంది. దీంతో కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఇక నుంచి కౌలు రైతల ఖాతాకే డబ్బు జమ చేయాలని ఆధికారులను ఆదేశించింది. అధికారుల సమాచారం మేరకు పంటల సాగులో వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చే పంటసాగు ధృవపత్రాన్ని సొంతభూమి ఉన్న యజామని నుంచి తీసుకొని వాటిని స్థానిక వ్యవసాయశాఖ అధికాకరులతో ఆ భూమిని తాము కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నట్టు ధృవపత్రం పొందాలి. అందులో పంట వివరాలు , సాగుచేసేందుకు కౌలుకు తీసుకున్న భూమి విస్తీర్ణం , భూమి వివరాల తెలిపే సర్వే నెంబర్ తదితర వివరాలు ఆ ధృవీకరణ పత్రంలో అధికారులు నమోదు చేసి ఇస్తారు.

ఈ ధృవపత్రాన్ని కౌలు రైతులు తమ ధాన్యం వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లాలి. కౌలు రైతు పండించిన ధాన్యం 50క్వింటాళ్లలోపు ఉంటే వ్యవసాయ విస్తరణ అధికారి(ఎఈఓ) వద్ద , అంతకు మించి ధాన్యం ఉంటే మండల వ్యవసాయ అధికారి వద్ద ధృవీకరణ పత్రం పొందాలి. వ్యవసాయ అధికారులు ఇచ్చిన ధృవపత్రంతోపాటు కౌలు రైతు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాకు చెందిన పాస్‌బుక్ కూడా ధాన్యంకొనుగోలు కేంద్రానికి తీసుకుపోవాలి. అక్కడి అధికారులు వాటిని పరిశీలించి వాటి ఆధారంగా కౌలు రైతుగా ధృవీకరించుకుని ఆన్‌లైన్‌లో కౌలు రైతు వివరాలు నమోదు చేస్తారు. దీంతో ధాన్యం విక్రయించిన కౌలు రైతులకు నగదు భూమి సొంతయజమానికి కాకుండా, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు . అయితే ఆధార్‌కార్డు, మొబైల్ నెంబర్ బ్యాంకు ఖాతాకు అనుసంధానించుకోవాలని అధికారులు వెల్లడించారు.

రెండు రోజుల్లో అందుబాటులోకి సేవలు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కౌలు రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన నగదు కౌలు రైతు బ్యాంకు ఖాతాకు జమ చేసే ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్ వ్యవస్థలో మార్పుల అనంతరం ఈ ప్రక్రియ అందుబాటులోకి రానుంది.ప్రభుత్వం చేసిన ఈ మార్పులతో రాష్ట్రలోని లక్షలాది మంది కౌలు రౌతులకు మేలు జరగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News