Sunday, April 28, 2024

వెనుకబడిన వర్గాల అభివృద్ధి ప్రదాత కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR is provider of development of backward communities

 

హైదరాబాద్: స్వాతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వెనకబడిన వర్గాలకు ఆత్మ గౌరవం కల్పించారన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం ఎంసిఆర్ హెచ్ ఆర్ డిలో సహచర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఏక సంఘంగా ఏర్పడిన మున్నూరు కాపు, పెరిక, తెలంగాణ మరాఠమండలి, కుమ్మరి శాలివాహన, విశ్వబ్రాహ్మణ, నక్కాస/ ఆరేటి క్షత్రియ వంటి 6 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణ అనుమతి పత్రాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ… ఇప్పటికే 24 కుల సంఘాలు ఏక సంఘంగా ఏర్పడి అనుమతి పత్రాలు తీసుకున్నాయని మిగతా కులాలు సైతం మరో వారం రోజుల్లోపు ఏక సంఘంగా ఏర్పడాలని మంత్రి గంగుల పిలుపునిచ్చారు. ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

లేనిపక్షంలో వాటి నిర్మాణాలకు టెండర్లు పిలిచి వారం తర్వాత ప్రభుత్వమే చేపడుతుందని తెలియజేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 41 కులాలకు హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్లు విలువ చేసే 82.30 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా భవన నిర్మాణాన్ని సైతం ఆయా కుల సంఘాలకె అప్పగించి నిధుల్ని సైతం ఇస్తున్న సిఎం కెసిఆర్ మాత్రమే అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని వెనుకబడిన వర్గాల ఆత్మ గౌరవం సూచించేలా కులాల ఇష్ట ప్రకారం ప్రత్యేక నమూనాలతో భవనాలను నిర్మించుకోవాలన్నారు. ఈ ఆత్మగౌరవభవనాలు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆయా కుల సంఘాలకు విద్యాపరంగాను, సామాజికంగానూ, సాంస్కృతికపరంగానూ, వసతి లో కూడా అత్యుత్తమ సేవలు అందిస్తాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… మహాత్మ జ్యోతిబాపూలే చేసిన రీసెర్చ్ ప్రకారం మన కులాలన్నీ ఒకే ఇంటి నుండి ఉద్భవించాయని, వృత్తుల పరంగా వేరుపడి తర్వాత కులాల రూపాన్ని సంతరించుకున్నాయన్నారు. అందుచేత వెనుకబడిన వర్గాలంతా ఒక్కటే అని ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కులంలో ఎదిగే వాళ్లకు అండగా నిలబడాలి కానీ అడ్డుపడకూడదని ఆకాంక్షించారు. కుల రహిత సమాజం కోసం పాటుపడుతూ కులాంతర వివాహాలు ప్రోత్సహించాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రోద్బలంతో ఒకే తాటిపైకి వచ్చిన వెనుకబడిన కులాలు ఇకముందు అదే ఆత్మగౌరవాన్ని ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ గౌరవ సిఎం వేలకోట్ల విలువైన స్థలాల్ని, నిధుల్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చారని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు, కులం ఆత్మగౌరవం ప్రతిఫలించేలా భవన నిర్మాణాలను చేసుకోవాలన్నారు.

మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. కుల సంఘాల్ని ఆత్మగౌరవ బొహనాల కోసం ఏకతాటిపైకి తెచ్చిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, గంగుల కమలాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఐక్యంగా ఉండడం అభివృద్ధికి దారితీస్తుందని కెసిఆర్ ఆశయం కూడా అదే అన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ అనుమతి పత్రాలు అందుకున్న కుల సంఘాలు మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోరుకంటి చందర్, సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్, జల వనరుల సంస్థ ఛైర్మన్ వి.ప్రకాశ్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర, ఇతర బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, ఆరు కుల సంఘాల నేతలు ప్రతినిధులు, పెద్ద ఎత్తున బీసీలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News