Saturday, April 27, 2024

సౌదీ యువరాజు అనుమతి తోనే ఖషోగీ హత్య

- Advertisement -
- Advertisement -

Khashoggi was assassinated with permission of Saudi prince

 

అసమ్మతివాదులను మట్టుబెట్టే ఆపరేషన్
ఇస్తాంబుల్ సౌదీ దౌత్యకార్యాలయం లోనే ఈ దారుణం
హంతకులు 12 మంది
అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడి
సౌదీ అరేబియన్లు 76 మందిపై అమెరికా వీసా ఆంక్షలు

వాషింగ్టన్ : సౌదీ అరేబియా బహిష్కరించిన జర్నలిస్ట్ 59 ఏళ్ల జమాల్ ఖషోగీ హత్య వెనుక సౌదీ యువరాజు మహ్మద్ బీన్ సల్మాన్ హస్తం ఉందని అమెరికా ఇంటెలిజెస్స్ నివేదిక వెల్లడించింది. ఈమేరకు కాంగ్రెస్‌కు నివేదిక సమర్పించింది. టర్కీ లోని ఇస్తాంబుల్ లో సౌదీ దౌత్యకార్యాలయంలో 2018 అక్టోబర్ 2న ఖషోగీ భయంకరంగా హత్యకు గురయ్యారు. అతని శరీరాన్ని ఖండఖండాలుగా చిత్రవధ చేశారు. అవశేషాలు కనబడకుండా చేశారు. టర్కీ మహిళను వివాహం చేసుకోడానికి కావలసిన డాక్యుమెంట్ల కోసం ఖషోగీ సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్లినప్పుడు ఈ హత్య జరిగింది. సౌదీ రాజకుటుంబాన్ని అక్కడి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖషోగి విమర్శించేవారు. ఈమేరకు వాషింగ్టన్ పోస్ట్ లో కూడా ఆయన కథనాలు వెలువరించారు. ఇలాంటి అసమ్మతివాదులను అంతమొందించడానికి సాగించిన ఆపరేషన్ ఇది అని నివేదిక వెల్లడించింది.

సౌదీ దౌత్య కార్యాలయం లోనే ఈ హత్య జరగడంతో దీని వెనుక సౌదీ యువరాజు హస్తం ఉందని ప్రపంచ మంతా ఆరోపణలు రావడంతో అమెరికాకు చెందిన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ఒడిఎన్‌ఐ) దీనిపై దర్యాప్తు చేపట్టి కీలక ఆధారాలను సేకరించింది. సౌదీ రాజకుటుంబం ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై పర్యవేక్షణ యువరాజుదే. 2017 నుంచి రాజకుటుంబానికి చెందిన భద్రత, నిఘా సంస్థలు పూర్తిగా యువరాజు అధీనం లోనే నడుస్తున్నాయి. అందువల్ల యువరాజు అనుమతి లేకుండా ఇలాంటి ఆపరేషన్ జరిగే వీలులేదు. యువరాజు అప్పగించిన పని చేయకుంటే తమ ఉద్యోగాలు పోవడం కానీ లేదా తాము అరెస్టు కావడం కానీ జరుగుతుందన్న భయ వాతావరణాన్ని యువరాజు కల్పించినందునే సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారని నివేదిక అభిప్రాయపడింది.

యువరాజు తరఫున దాదాపు 12 మంది ఈ హత్యలో పాల్గొని ఉండవచ్చని చెప్పింది. 2019 లో సౌదీ యువరాజు ఈ హత్యాసంఘటనకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని వెల్లడించారు. కానీ హత్యకు తాను ఆదేశించినట్టు వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ నివేదికను కాంగ్రెస్‌లో సమర్పించిన తరువాత సౌదీ అరేబియాకు చెందిన 76 మంది వ్యక్తులపై ఖషోగి బ్యాన్ పేరుతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వీసా ఆంక్షలు విధించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని చెప్పారు. ప్రపంచ దేశాల్లోని సౌదీ అసమ్మతి దారులను వీరు బెదిరించడం, దాడులకు పాల్పడడం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది. సౌదీ ప్రభుత్వం తమపై ప్రతీకారం తీర్చుకుంటుందన్న భయాందోళనలు లేకుండా పౌరులు తమ ప్రాథమిక మానవ హక్కులను,స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News