Saturday, May 4, 2024

ఆర్‌సిబి కెప్టెన్సీకి కూడా కోహ్లి గుడ్‌బై!

- Advertisement -
- Advertisement -

Kohli retirement to RCB captaincy

 

దుబాయి: ఇప్పటికే టీమిండియా ట్వంటీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లి తాజాగా మరో నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్ ముగిసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటానని ప్రకటించాడు. అయితే ఆటగాడిగా మాత్రం బెంగళూరులోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ఆర్‌సిబి అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించాడు. అంతకుముందు మీడియా సమావేశంలో కూడా కోహ్లి మాట్లాడాడు. యుఎఇ వేదికగా జరిగే ఐపిఎల్ రెండో దశలో మరింత మెరుగైన ప్రదర్శన చేయడమే లక్షంగా పెట్టుకున్నట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. తొలి దశలో ఎలా ఆడామో ఈసారి కూడా అలాగే ఆడతామని స్పష్టం చేశాడు. రెండో దశలో కొంతమంది కీలక ఆటగాళ్లు దూరమైనా తమకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నాడు.

వారి స్థానాల్లో వచ్చిన శ్రీలంక క్రికెటర్లు వానిండు హసరంగా, చమీర దుష్మంత మెరుగైన ప్రదర్శన చేస్తారనే నమ్మకాన్ని కోహ్లి వ్యక్తం చేశాడు. వీరికి యుఎఇ పిచ్‌లపై మంచి అవగాహన ఉండడం తమకు కలిసి వచ్చే అంశమన్నాడు. అంతేగాక కిందటి సీజన్ యుఎఇలోనే జరగడంతో ఇక్కడి వాతావరణం, పిచ్‌లపై పూర్తి అవగాహన తమ ఆటగాళ్లకు ఉందన్నాడు. ఇక డివిలియర్స్, మాక్స్‌వెల్, పడిక్కల్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉండడం తమకు సానుకూల పరిణామమన్నాడు. వీరిలో ఏ ఇద్దరూ నిలదొక్కుకున్నా తమకు గెలుపు నల్లేరుపై నడకేనని అభిప్రాయపడ్డాడు. ఇక తొలి దశలో మెరుగైన విజయాలు సాధించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. ఈసారి మరింత మెరుగ్గా ఆడడమే లక్షంగా పెట్టుకున్నామన్నాడు. ఇందులో సఫలమవుతామనే నమ్మకం తనకుందని కోహ్లి వ్యాఖ్యానించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News