Wednesday, May 1, 2024

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై పునరాలోచన

- Advertisement -
- Advertisement -
Telangana intermediate exams 2021
ప్రత్యామ్నాయాలపై అధికారుల కసరత్తు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తే వారి ద్వితీయ సంవత్సరం చదువులపై ప్రభావం పడుతుందని ఇంటర్ విద్యాశాఖ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరో 10 రోజులు గడిస్తే సెప్టెంబర్ పూర్తయి, అక్టోబర్ నెల ప్రారంభమవుతుంది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే దాదాపుగా నెల సమయం వృథా అవుతుంది. పరీక్షలు ప్రాంరంభించడానికి కనీసం 15 రోజులు ముం దుగా షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది. విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించినా అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కీలక సమయంలో ఫస్టియ ర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిసింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు పరీక్షలు కాకుండా ఇతర ప్రత్యామ్నాయ విధానాలలో మార్కులు కేటాయించే అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు జరగని పరిస్థితుల్లో అసైన్‌మెంట్లు, ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తే వాటి మార్కులు కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 4.74 లక్షల మంది విద్యార్థులు ఫస్టియర్ పరీక్షలపై విద్యాశాఖ తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికీ వెలువడని పరీక్షల షెడ్యూల్

కరోనా కారణంగా గత మే నెలలో ఇంటర్ ప్రథమ , ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. గత ఏడాది ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులనే కేటాయించారు. మొదటి సంవత్సరం విద్యార్థులను రెండవ సంవత్సరంలోకి ప్రమోట్ చేశారు. పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షలు జరుపుతామని గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీన విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించిన నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు తప్పకుండా ఉంటాయని త్వరలోనే కాలపట్టిక ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది.ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది. దసరా సెలవుల తర్వాత పరీక్షలు ఉండొచ్చని అందరూ భావించారు. ఇప్పటివరకు పరీక్షల షెడ్యూల్ విడుదల కాలేదు కాబట్టి పరీక్షలు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.త్వరలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News