Friday, May 3, 2024

భూముల వేలానికి నోటిఫికేషన్ జారీ

- Advertisement -
- Advertisement -

కోకాపేటలోని హెచ్‌ఎండిఏ భూములు 49.92 ఎకరాలు…
ఖానామెట్‌లోని టిఎస్‌ఐఐసీ భూములు 15.01 ఎకరాలకు
హెచ్‌ఎండిఏ భూములకు 25న….
టిఎస్‌ఐఐసీ భూములకు 26న ప్రీబిడ్ సమావేశం
జూలై 15న హెచ్‌ఎండిఏ, జూలై 16న టిఎస్‌ఐఐసీ భూములకు ఈ -వేలం

Land auction notification by HMDA
మనతెలంగాణ/హైదరాబాద్: హెచ్‌ఎండిఏ, టిఎస్‌ఐఐసీ భూముల విక్రయానికి (Land Sale) సంబంధించి మంగళవారం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. హెచ్‌ఎండిఏకు చెందిన కోకాపేట భూములతో పాటు టిఎస్‌ఐఐసీకి చెందిన ఖానామెట్ భూముల విక్రయానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కోకాపేటలో హెచ్‌ఎండిఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లే ఔట్‌లోని 7 ప్లాట్లతో పాటు.. గోల్డెన్‌మైల్ లే ఔట్‌లోని ఒక ప్లాట్ ను ప్రభుత్వం విక్రయించనుంది. 49.92 ఎకరాల విస్తీర్ణంలో కోకాపేటలోని ప్లాట్లు, ఖానామెట్‌లో టిఎస్‌ఐఐసీకి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ రెండు కలిపి మొత్తం 64.93 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఈ ప్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోకాపేట భూముల వేలాన్ని హెచ్‌ఎండిఏ, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను టిఎస్‌ఐఐసీ నిర్వహించనుంది.
హెచ్‌ఎండిఏ భూములకు 25న ప్రీబిడ్ సమావేశం
భూముల విక్రయ (Land Sale) నిమిత్తం మంగళవారం నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. హెచ్‌ఎండిఏ భూములకు 25న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనుండగా, టిఎస్‌ఐఐసీ భూములకు 26న ప్రీబిడ్ సమావేశం జరగనుంది. జూలై 13 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ కాగా హెచ్‌ఎండిఏ భూములకు జూలై 15న, టిఎస్‌ఐఐసీ భూములకు జూలై 16న ఈ -వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. కోకాపేట ప్రాంతంలో ఉన్న హెచ్‌ఎండిఏకు చెందిన భూములను మొదటగా విక్రయించాలని, ఆ తర్వాత స్పందనను బట్టి మిగతా భూముల అమ్మకాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. భూముల విక్రయం ద్వారా రూ.20 వేల కోట్లు లేదా రూ.10 వేల కోట్లు సమీకరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఒకేమారు కాకుండా దశల వారీగా భూముల అమ్మకాన్ని ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలానికి ముందే లే ఔట్లకు సంబంధించిన అన్ని వసతులు, అనుమతులను స్థలం కొన్నవారికి 7 రోజుల్లోగా అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

కోకాపేటలో హెచ్‌ఎండిఏ కార్పొరేట్ వెంచర్

కోకాపేటలో కార్పొరేట్ వెంచర్‌ను హెచ్‌ఎండిఏ నియోపొలిస్ పేరుతో అభివృద్ధి చేసింది. ఐటి కారిడార్‌లో ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న కోకాపేటలో హెచ్‌ఎండిఏ నియోపొలిస్ పేరుతో ప్లాట్లను చేసింది. ఇప్పటికే ఈ వెంచర్‌లో భారీ హోర్డింగ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు 150కి పైగా ఎకరాల స్థలంలో 100 అడుగుల విస్తీర్ణంతో రోడ్లను వేసి అత్యున్నత ప్రమాణాలతో లే ఔట్‌లను అభివృద్ధి చేసి ఐటి, ఐటిఈఎస్ వంటి కంపెనీలకు ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు హెచ్‌ఎండిఏ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం అమ్మాలని నిర్ణయించిన ప్లాట్ నెంబర్ 1లో (7.72 ఎకరాలు), ప్లాట్ నెంబర్2లో (7.75 ఎకరాలు), ప్లాట్ నెంబర్ 3లో (7.73, ఎకరాలు), ప్లాట్‌నెంబర్ 12లో (7.56, ఎకరాలు), ప్లాట్‌నెంబర్ 04లో (8.94 ఎకరాలు), ప్లాట్‌నెంబర్ 13లో (7.57 ఎకరాలు), నియోపొలిస్ లే ఔట్ దక్షిణ వైపు రోడ్డు నెంబర్7లో ప్లాట్ ఏలో (ఎకరం) ప్లాట్‌తో పాటు కోకాపేటలోని గోల్డెన్ మైల్ లే ఔట్‌లో ప్లాట్ (1.65 ఎకరాలు) మొత్తం 49.92 ఎకరాల భూమిని ఈ వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఖానామెట్‌లోని టిఎస్‌ఐఐసి ప్లాట్లు

ఖానామెట్‌లోని టిఎస్‌ఐఐసికి చెందిన 15.01 ఎకరాల భూమిని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖానామెట్‌లోని ప్లాట్ నెంబర్ 4లో (3.15 ఎకరాలు), ప్లాట్ నెంబర్ 6లో (3.15 ఎకరాలు), ప్లాట్ నెంబర్ 12లో (3.69 ఎకరాలు), ప్లాట్ నెంబర్ 14లో (2.92 ఎకరాలు), ప్లాట్ నెంబర్ 17లో (2.10 ఎకరాలు) మొత్తంగా 15.01 ఎకరాలను ఈ వేలం ద్వారా విక్రయించనున్నారు.

రెండు చోట్ల కలిపి 64.93 ఎకరాల విస్తీర్ణం

హెచ్‌ఎండిఏ, టిఎస్‌ఐఐసీలకు చెందిన భూములు సుమారుగా 64.93 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, అందులో నుంచి 13 ప్రైమ్ ప్లాట్లను ప్రభుత్వం వేలం వేయనుంది. ఎటువంటి చిక్కులు లేని 100 శాతం క్లియర్ టైటిల్ ఉన్న భూమిగా అధికారులు ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం (నియోపోలిస్ అండ్ గోల్డ్ మైల్ లే ఔట్) గురించి తెలుసుకోవాలంటే AUCTIONS.HMDA.GOV.IN వెబ్‌సైట్‌లో, (ఖానామెట్ భూముల గురించి) తెలుసుకోవాలంటే TSIIC.TELANGANA.GOV.IN) వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News