Monday, April 29, 2024

జైలులో నిమ్మకాయల స్కాం

- Advertisement -
- Advertisement -

Lemon scam in Kapurthala Jail

జైలు సూపరింటెండెంట్‌పై వేటు

చండీగఢ్ : ఈ వేసవిలో ఎండలు మండుకు పోతుంటే మరో వైపు నిమ్మ ధరలు పెరిగిపోతుండడంతో పంజాబ్ లోని ఓ జైలులో నిమ్మకాయల స్కామ్ వెలుగు చూసింది. కిలో నిమ్మకాయల ధర మార్కెట్‌లో దాదాపు రూ.200 కు పైగా పలుకుతుండడంతో ఇదే అదనుగా భావించిన జైలు అధికారులు వాటిని కొనకుండానే కొన్నట్టుగా రికార్డుల్లో చూపించి అడ్డంగా దొరికి పోయారు. నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు తేలడంతో జైలు సూపరింటెండెంట్ గుర్నామ్ లాల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కపుర్తలా మోడ్రన్ జైలులో అక్రమాలు జరుగుతున్నట్టు తెలియడంతో జైళ్లశాఖ ఏడీజీపీ వీరేంద్ర కుమార్ ఈ నెల 1 న ఇద్దరు సీనియర్ అధికారుల్ని ఆకస్మిక తనిఖీల కోసం పంపారు. దీంతో అక్కడి రికార్డులను పరిశీలించగా, కిలో రూ. 200 చొప్పున 50 కిలోల నిమ్మకాయలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు.

అయితే ఖైదీలు తమకు భోజనంలో నిమ్మకాయలేవీ ఇవ్వడం లేదని తనిఖీ బృందానికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఈ వ్యవహారంపై పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి హర్‌జోత్ సింగ్ బియాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు సూపరింటెండెంట్ పై విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో అక్రమాలు బయటపడ్డాయి. దీంతో గుర్నామ్ లాల్‌ను సస్పెండ్ చేశారు. జైలులో ఖైదీలకు నాసిరకం ఆహారాన్ని ఇవ్వడం, సరిపడా భోజనం పెట్టడం లేదని తనిఖీ బృందం గుర్తించింది. అలాగే జైలులో తయారు చేసిన ప్రతి చపాతి 50 గ్రాముల కంటే తక్కువ బరువు ఉండటాన్ని చూస్తుంటే గోధుమ పిండి కూడా పక్కదారి పట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కూరగాయల కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగాయని నివేదికలో అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News