Wednesday, May 22, 2024

రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తాం

- Advertisement -
- Advertisement -

రాంచి: లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం వాగ్దానం చేశారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా సోమవారం నాడిక్కడ ఒక బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. జార్ఖండ్‌లో గిరిజనుడు ముఖ్యమంత్రిగా ఉండడాన్ని సహించలేకనే జెఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జెడితో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి ప్రయత్నించిందని రాహుల్ ఆరోపించారు. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కుట్రను అడ్డుకుని జార్కండ్‌లో పేదల ప్రభుత్వాన్ని కాపాడినందుకు ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ సారథ్యంలోని కూటమికి చెందిన ఎమ్మెల్యేలను ఆయన అభినందించారు. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన కులాలను(ఓబిసిలు) వెట్టి కార్మికులుగా మార్చివేశారని, బడా కంపెనీలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలలో వారి భాగస్వామ్యం కొరవడిందని రాహుల్ అన్నారు.

భారతదేశం ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదేనని, దేశంలో కుల గణనను నిర్వహించడమే మన తొలి అడుగు అవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుత చట్టాల కింద 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేమని ఆయన వివరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని విసిరి పారేస్తామని ఆయన వాగ్దానం చేశారు. దళితులు, ఆదివాసీల రిజర్వేషన్లలో ఎటువంటి తగ్గింపు ఉండబోదని ఆయన హామీ ఇచ్చారు. సమాజంలోని వెనుకబడిన తరగతులకు వారి హక్కులు లభిస్తాయని తాను భరోసా ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. సామాజిక, ఆర్థిక అన్యాయమే దేశం ముందున్న అతి పెద్ద సమస్యని రాహుల్ చెప్పారు. తాను ఓబిసినని ప్రధాని నరేంద్ర మోడీ తరచు చెబుతుంటారని, అయితే కుల గణన డిమాండు లేవనెత్తిన ప్రతిసారి ఈ దేశంలో ధనిక, పేద అనే రెండే కులాలు ఉన్నాయని ఆయన ప్రకటిస్తుంటారని రాహుల్ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ అసెంబ్లీలో చంపయి సోరెన్ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చినపుడు గిరిజనుడిని ముఖ్యమంత్రిగా సహించలేని బిజెపి కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.

హేమంత్ సోరెన్ భార్యతో రాహుల్ భేటీ
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం రాంచీలో ఝార్కండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్‌తో భేటీ అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో జెఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసిన కొన్ని రోజుల తరువాత వారిద్దరి భేటీ జరిగింది. రాంచీలోని హెచ్‌ఇసి సముదాయంలో షహీద్ మైదాన్‌లో బహిరంగ సభకు ముందు కొన్ని నిమిషాల పాటు కల్పన సోరెన్‌తో రాహుల్ సమావేశం అయినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News