Saturday, April 27, 2024

ఏ శాఖలో… ఎంత డిపాజిట్లు!

- Advertisement -
- Advertisement -

Lockdown

 

తక్షణమే వివరాలు ఇవ్వాలని కోరిన రాష్ట్ర ఆర్థిక శాఖ
సేవింగ్స్, కరెంట్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వారీగా పంపాలని ఆదేశాలు
గత డిసెంబర్ నాటికి రూ.6 వేల కోట్లు డిపాజిట్లు
ఘోరంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆదాయం.. రోజుకు రూ. కోటి మాత్రమే

మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఇప్పటికిప్పుడు అత్యవసర నిధుల కింద ప్రభుత్వ విభాగాల్లోని బ్యాంకు ఖాతాల్లో ఉన్న డిపాజిట్లను వాడుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల హెడ్స్‌కు యూ.ఒ నోట్‌ను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం పంపించారు. మార్చి 31వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ విభాగాలు, యూనిట్ ఆఫీస్‌లు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, కమిటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలలోని సేవింగ్స్, కరెంట్ అకౌంట్‌లలో ఉన్న డిపాజిట్లతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎంత మొత్తంలో ఉన్నాయో తక్షణమే వివరాలు పంపించాలని ఆదేశించారు. సూచించిన ప్రొఫార్మా రూపంలో పంపాలని కోరారు. ప్రొఫార్మాలో సచివాలయ పరిపాలన శాఖ, హెచ్‌ఒడి, డిడిఒ, బ్యాంకు పేరు, శాఖ, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, అకౌంట్ నెంబర్, టైప్ ఆఫ్ అకౌంట్, ఎంత మొత్తం(రూ.లక్షల్లో), రిమార్క్ ఏమైనా ఉంటే పొందుపర్చాలని యూ.ఒ నోట్‌లో రామకృష్ణారావు స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆదాయం రోజుకు రూ.కోటి
లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆదాయం ఘోరంగా పతనమైంది. ఈ విషయాన్ని సిఎం కెసిఆర్ కూడా సోమవారం మీడియాకు తెలిపారు. సాధారణంగా రోజుకు సగటున రూ.400 కోట్ల వరకు రాష్ట్రానికి ఆదాయం రావాల్సి ఉండగా, ఈ ఏప్రిల్ ఆరు రోజుల్లో రూ.6 కోట్లు వచ్చింది. అంటే రోజుకు రూ. ఒక కోటి మాత్రమే వస్తుంది. వీటితో కనీసం రెవిన్యూ శాఖలోని ఉద్యోగులకు కోత విధించిన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అయితే ఆర్థికంగా నష్టపోయినా, ప్రజల ప్రాణాలు ముఖ్యమని తరువాత ఏదో ఒక రకంగా చేసుకోవచ్చునని సిఎం ప్రకటించిన విషయం విధితమే.

2018 డిసెంబర్ వరకు రూ.6 వేల కోట్లు
గడిచిన ఏడాదిలోనూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్న డిపాజిట్లపై వివరాలను సేకరించింది. వీటి ప్రకారం 2018 డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఖాతాల్లో రూ.6 వేల 49 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు బ్యాంకులు (ఎస్‌ఎల్‌బిసి) అప్పుడు ఆర్థిక శాఖకు వెల్లడించాయి. ఇందులో సేవింగ్స్ ఖాతాలో జమ చేసిన మొత్తం రూ.2638 కోట్లు ఉన్నాయి. కరెంట్ అకౌంట్‌లలో రూ.301.25 కోట్లు ఉన్నట్లు బ్యాంకులు ఆర్థిక శాఖకు సమర్పించాయి. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.3110 కోట్లు ఉన్నట్లు తెలిపాయి.

ఇందులో ప్రభుత్వ శాఖల్లోని బ్యాంకు ఖాతాల్లో బ్యాంకు ఆఫ్ బరోడాలో అధికంగా రూ.2058 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.1881 కోట్లు కావడం గమనార్హం. ఆ తరువాత ఆంధ్రాబ్యాంకులో రూ.1755 కోట్లు, కెనరా బ్యాంకులో రూ.1299 కోట్లలో రూ.895 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇక ఎస్‌బిఐలో రూ.534 కోట్లు, ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో రూ.126.55 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.118.74 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.87.41 కోట్లు, టెస్కాబ్‌లో రూ.65.75 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ.3.28 కోట్లు డిపాజిట్లు ఉన్నట్లు బ్యాంకులు ఆర్థిక శాఖ తెలిపాయి.

 

Lockdown effect on Finance department
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News