Sunday, April 28, 2024

కరోనా కామెంట్స్‌పై ఖాకీల సీరియస్

- Advertisement -
- Advertisement -

తప్పుడు న్యూస్ పెడితే కేసుబుక్ గ్యారంటీ

corona

 

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారిపై సోషల్‌మీడియాలో తప్పుడు సమాచారం, న్యూస్ వైరల్ చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్‌మీడియాలో వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసినా, ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యవహరించిన వారిపై పోలీసుశాఖ సుమోటో కేసులు నమోదు చేయనున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు సహకరించకపోగా వైరస్‌పై తప్పుడు ప్రచారం, ప్రసారం చేసేవారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిజిపి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్‌పిలకు ఆదేశాలిచ్చారు. ట్విటర్, వాట్సాప్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ తదితర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫేక్ న్యూస్ వైరల్ పై పోలీసు శాఖలోని ఐటి విభాగం అధికారులు నిఘా సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలానాచోట కరోనా వ్యాపించిందంటూ తప్పుడు పోస్ట్‌లు, మద్యం దుకాణాలను తెరుస్తున్నారంటూ, లాక్‌డౌన్ ఎత్తేస్తున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపులపై పోలీసులు దృష్టిసారించడంతో పాటు వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వైరస్ వ్యాప్తికి కారణమంటూ ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియోలూ వైరల్‌గా మారడం పై పోలీసు బాసులు సీరియస్‌గా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు.

ముఖ్యంగా సోషల్‌మీడియాలో వర్గాలు, మతాలు, కులాల వారీగా నెటిజన్లు విడిపోయి ఒకరిపై ఒకరు కామెంట్లు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపాలని ఇప్పటికే నగర సిపి అంజనీకుమార్, సైబరాబాద్ సిపి సజ్జనార్, రాచకొండ మహేష్ భగవత్ తమ సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో మూడు కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైం పోలీసులు వాట్సాప్ గ్రూపులను పరిశీలిస్తున్నారు. జాతి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజలను భయాందోళన కలిగించేలా ఉండే పోస్టులను పరిశీలించడంతో పాటు కొందరిపై కేసులు నమోదు చేశారు. రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు రెండు సుమోటో కేసులు, కీసర సిఐ నరేందర్ మరో రెండు సుమోటో కేసులు నమోదు చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు అసభ్యకర, ఫేక్ న్యూస్‌లు పోస్ట్ చేసినా అడ్మిన్లపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తుండటంతో వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు అప్రమత్తమయ్యారు.

కొందరైతే తాము మాత్రమే ఆ గ్రూపుల్లో పోస్టులు పెట్టేలా ఆడ్మిన్‌లను తొలగిస్తున్నారు. ప్రజల మనోభావాలతో దెబ్బతీసేలా, జాతి విద్వేషాలను రెచ్చగొట్టేలా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్‌లలో తప్పుడు సమాచారాన్ని ప్రసారం, ప్రచారాలకు చెక్‌పెట్టేందుకు పోలీసుశాఖలోని ఐటి విభాగం అధికారులు సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇటీవల వైన్ షాప్స్ తెరుస్తున్నారని ఉప్పల్‌కు చెందిన సన్ని అనే యువకుడు నకిలీ జివొ ప్రతిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో అతన్ని గుర్తించి కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ప్రజలకు ఏదైనా సమాచారం అందితే అది నిజమో కాదో తెలుసుకొని ఫార్వర్డ్, పోస్ట్ చేయాలని పోలీసులు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు.

 

Telangana police serious fake news on corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News