Monday, April 29, 2024

హాట్‌స్పాట్లలో పొడిగింపు!

- Advertisement -
- Advertisement -

MODI

 

 

 లాక్‌డౌన్‌తో వేలాది మంది ప్రాణాలను కాపాడాం
ఇదే స్ఫూర్తితో ముందుకు, ఆర్థిక వ్యవస్థకూ ప్రాధాన్యత
రాష్ట్రాలవారీగా ప్రణాళికలు రూపొందించాలి
సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ స్పష్టీకరణ

లాక్‌డౌన్ కొనసాగించేందుకు మొగ్గుచూపిన ముఖ్యమంత్రులు వీరే

ఒడిశా – నవీన్‌పట్నాయక్
మేఘాలయ – కాన్రాడ్ సంగ్మా
గోవా – ప్రమోద్ సావంత్
పశ్చిమబెంగాల్ – మమత
పుదుచ్చేరి – నారాయణ స్వామి

న్యూఢిల్లీ: కోవిడ్19 పోరాటం సాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశంలో కోవిడ్19 ప్రస్తుత పరిస్థితి, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ముందుకు సాగేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. తొమ్మిది రాష్ట్రాల సిఎంలు ఈ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్ ముగింపునకు అయిదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొగ్గు చూపగా, పొడిగించాలని నలుగురు సిఎంలు కోరినట్లు సమాచారం. కాగా కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో ప్రధాని కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్‌స్పాట్ ప్రాంతాలు, కొత్తగా కేసులు బైటపడుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుందని చెప్పినట్లు తెలుస్తోంది.

‘ ఇంతవరకు మనం రెండు రకాల లాక్‌డౌన్లను చూశాం. ప్రస్తుతం మనం ముందుకు ఎలా వెళ్లాలనేది ఆలోచించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కరోనా వైరస్ ప్రభావం రాబోయే నెలల్లో కూడా కనిపిస్తుంది. మునుముందు కూడా రోజువారీ జీవితంలో మాస్కులు ధరించడం అనివార్యం కావచ్చు’ అని ప్రధాని ఈ సందర్భంగా అన్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సానుకూల ఫలితాలు వచ్చాయని, దీనివల్ల గడచిన నెలన్నర రోజులుగా వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగామని మోడీ స్పష్టం చేశారు. పలు దేశాల జనాభా కలిపితే ఎంతో భారత దేశ జనాభా అంతని అన్నారు. మార్చి నెల ప్రారంభంలో భారత్‌తో సహా చాలా దేశాల్లో పరిస్థితి ఒకేలా ఉండిందన్నారు. అయితే భారత్‌లో సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు. అంతమాత్రంతో సరిపోదని వైరస్‌పై నిరంతర నిఘా అవసరమని ప్రధాని ఉద్ఘాటించారు. పరిస్థితులను సమీక్షించి మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాని పిఎంలతో చెప్పినట్లు సమాచారం. అయితే కోవిడ్19 ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించి మినహాయింపులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రాలవారీగా ప్రణాళికలను తయారు చేయాలని ప్రధాని సిఎంలకు సూచించారు. గ్రీన్, ఆరంజ్, రెడ్ జోన్ల వారీగా ఈ ప్రణాళికలు ఉండాలని సూచించారు. అయితే ప్రణాళికను రూపొందించేటప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులు. వాటి కారణంగా రాబోయే అనారోగ్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే హాట్‌స్పాట్లు, లేదా రెడ్ జోన్లలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన రాష్ట్రాలకు గుర్తు చేశారు. రెడ్ జోన్లను ఆరంజ్ జోన్లుగా, ఆ తర్వాత గ్రీన్ జోన్లుగా మార్చడానికి కృషి చేయాలని కూడా ఆయన నొక్కి చెప్పారు. లాక్‌డౌన్ ప్రభావం చాలా స్పష్టంగా ఉందని, వేలాది మంది ప్రాణాలను కాపాడడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యమని, ప్రతినిత్యం నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని చెప్పారు. ఉపాధి హామీ పనులతో పాటుగా కొన్ని పరిశ్రమలు ప్రారంభమైనాయని, ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందొద్దని సూచించారు. మన ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని ఈ సందర్భంగా ప్రధాని సిఎంలతో పేర్కొన్నట్లు సమాచారం.

కాగా విదేశాలనుంచి భారతీయులను వెనక్కి తీసుకు రావడం గురించి మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చిన తర్వాత వారు ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా చూడడంతో పాటుగా వారి కుటుంబాలు ఎలాంటి ఇబ్బందుల్లో పడకుండా ఉండడం దృష్టిలో పెట్టుకొని ఇది చేయాల్సి ఉంటుందన్నారు. కాగా సమావేశంలో ముఖ్యమంత్రులు ఈ క్లిష్ట సమయంలో ప్రధాని నాయకత్వంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశంపించడంతో పాటుగా వైరస్ కట్టడికి తాము తీసుకున్న చర్యలను వివరించినట్లు ఆ ప్రకటన తెలిపింది.ఈ సమావేశంలో ప్రధానితో పాటుగా హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో పాటుగా ప్రధానమంత్రి కార్యాలయం,ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రుల్లో అరవింద్ కేజ్రివాల్( ఢిల్లీ), ఉద్ధవ్ థాక్రే( మహారాష్ట్ర), ఇకె పళనిస్వామి(తమిళనాడు), వి నారాయణ స్వామి( పుదుచ్చేరి), కొన్రాడ్ సంగ్మా(మేఘాలయ) త్రివేంద్ర సింగ్ రావత్ (ఉత్తరాఖండ్),నవీన్ పట్నాయక్( ఒడిశా), యోగిఆదిత్యనాథ్ (యుపి), నితీశ్ కుమార్ (బీహార్) ఉన్నారు.

లాక్‌డౌన్ పొడిగింపునకే మెజారిటీ మొగ్గు

ఇదిలా ఉండగా ప్రధానితో మాట్లాడిన ముఖ్యమంత్రుల్లో అత్యధిక శాతం మంది లాక్‌డౌన్‌ను కొనసాగించడానికే మొగ్గు చూపారని ఈ సమావేశంలో పాల్గొన్న పుదుచ్చేరి సిఎం వి నారాయణ స్వామిచెప్పారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున లాక్‌డౌన్‌ను ఎత్తివేసే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులంతా ప్రధానికి చెప్పారని సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ నారాయణ సామి చెప్పారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో చిక్కుపడిన వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపించేందుకు ఒక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రులు ప్రధాని చెప్పారని ఆయన అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ అంశాన్ని ప్రధానితో ప్రస్తావించారని చెప్పారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి ప్రధాని ఎలాంటి పరిష్కారాన్ని చెప్పలేదని నారాయణ స్వామి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయడం కోసం 2008లో యుపిఎ ప్రభుత్వం ప్రకటించినట్లుగా ప్రభుత్వం ఒక ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించాలని కూడా ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారని కూడా ఆయన చెప్పారు.

 

Lockdown extension on Hotspots!
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News